ఇద్దరూ ఆ..ఆశతోనే..??

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణే సంకీర్ణ సర్కార్ కొంపముంచుతుందా? మరోసారి జరుగుతున్న మంత్రి వర్గ విస్తరణలో తమకు చోటు దక్కకుంటే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు [more]

Update: 2019-06-11 18:29 GMT

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణే సంకీర్ణ సర్కార్ కొంపముంచుతుందా? మరోసారి జరుగుతున్న మంత్రి వర్గ విస్తరణలో తమకు చోటు దక్కకుంటే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తారా? వారు ధిక్కార స్వరం విన్పిస్తారా? ఇదే ప్రస్తుతం కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ నేతలను కలవరపెడుతోంది. ఈనెల 12వ తేదీన మంత్రి వర్గ విస్తరణ చేపట్టేందుకు ముఖ్యమంత్రి కుమారస్వామి రెడీ అయిపోయారు. అయితే నటుడు గిరీష్ కర్నాడ్ మృతి చెందడంతో 14వ తేదీకి విస్తరణను వాయిదా వేశారు.

ముగ్గురికే అవకాశం…..

అయితే మంత్రివర్గ విస్తరణలో జనతాదళ్ ఎస్ నుంచి ఇద్దరిని, కాంగ్రెస్ నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశముంది. అయితే జనతాదళ్ ఎస్ నేతల్లోనూ మంత్రిపదవి కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. గెలిచింది తక్కువ స్థానాలే అయినప్పటికీ మంత్రులం కాలేకపోయామన్న ఆవేదన అనేక మందిలో ఉంది. ఇప్పుడిప్పుడే వారు బయటపడుతున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి బసవరాజ హో్రెట్టి కూడా మంత్రిపదవి కావాలని కొంచెం స్వరం పెంచారు.

కాంగ్రెస్ నేతలకు ఇచ్చినా….

కుమారస్వామి మాత్రం తమకు దక్కాల్సిన రెండు మంత్రి పదవుల్లో ఇతరులకు అవకాశమిచ్చి అసంతృప్తిని చల్లార్చాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా అసంతృప్తితో ఉన్న బలమైన కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారు. రామలింగారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతకు మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా పార్టీలో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ కన్నా కాంగ్రెస్ లోనే విస్తరణతో అసంతృప్తి మరింత పెరిగే అవకాశముంది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చలు జరిపి కుమారస్వామి నిర్ణయం తీసుకోనున్నారు.

యడ్డీ ఆశలన్నీ…..

మరోవైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప సయితం విస్తరణ జరిగితే తమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, సంకీర్ణ సర్కార్ కూలిపోవడం తథ్యమని జోస్యం చెబుతున్నారు. తన ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం ఎనిమిది మంది సభ్యులు మాత్రమే అవసరం కావడంతో యడ్యూరప్ప ఇప్పటీకీ కాంగ్రెస్ అసంతృప్త నేతలతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఈనెల 14వ తేదీ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News