తెగదు.. తెల్లారదు.. ఇదీ అమరావతి కథ

రాజధాని తరలింపు ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఈ ఏడాది సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. న్యాయపరమైన చిక్కులు ఉండటమే కారణం. ప్రస్తుతం హైకోర్టులో మూడు రాజధానుల [more]

Update: 2020-09-01 11:00 GMT

రాజధాని తరలింపు ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఈ ఏడాది సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. న్యాయపరమైన చిక్కులు ఉండటమే కారణం. ప్రస్తుతం హైకోర్టులో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై విచారణ జరుగుతుంది. ఇప్పటికే దీనిపై దాదాపు 12 మంది వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటీషన్లు వేశారు. దీంతో పాటు రోజుకో పిటీషన్ దీనిపై పడుతుండటంతో విచారణ సుదీర్ఘ కాలం సాగుతుందన్నది న్యాయనిపుణులు చెబుతున్నారు.

ఈ ఏడాది జనవరిలో ప్రతిపాదన…

మూడు రాజధానుల ప్రతిపాదానను ఈ ఏడాది జనవరి నెలలో ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. దాదాపు 254 రోజుల నుంచి అమరావతి ప్రాంత రైతులు దీక్షలు చేస్తున్నారు. తమతో సీఆర్డీఏ కుదుర్చుకున్న అగ్రిమెంట్ ను అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. శాసనసభలో చట్టం చేసి మరీ బిల్లును రూపొందించారు. ఈ బిల్లుకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు.

రైతులతో ఒప్పందం మాటేమిటి?

సీఆర్డీఏ, రైతులకు కుదిరిన ఒప్పందం ప్రకారం రాజధాని అమరావతి ప్రాంతంలో 64 వేల మంది రైతులకు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్లాట్లను పూర్తిగా డెవెలెప చేసి ఇస్తామని చెప్పింది. ఇందులో కమర్షియల్, నాన్ కమర్షియల్ అని రెండుగా విభజించి, వారికి అభివృద్ధి చేసి ఇస్తామని రైతులతో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపైనే రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టులో విచారణ సాగుతోంది. సుప్రీంకోర్టు త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని చెబుతున్నప్పటికీ రోజుకో కొత్త పిటీషన్లు పడుతుండటంతో జాప్యం జరిగే అవకాశముంది.

దసరాకు అయితే సాధ్యం కాదు….

ఇక హైకోర్టులో ఎవరికి అనుకూలంగా తీర్పు వచ్చినా, వ్యతిరేకంగా వచ్చిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించే వీలుంది. సుప్రీంకోర్టులో మరికొంత కాలం అమరావతి కథ సాగుతుంది. దీంతో అమరావతి కథ ఇప్పట్లో తేలేలా లేదు. వాస్తవానికి దసరాకు జగన్ విశాఖలో పరిపాలన రాజధానిని ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే అది ఈ ఏడాది సాధ్యం కాకపోవచ్చన్నది న్యాయనిపుణుల అంచనా. కోర్టు కేసులు అంత త్వరగా తేలవని, సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పట్లో ఈ కేసు తేలేలా కన్పించడం లేదంటున్నారు. మొత్తం మీద జగన్ మూడు రాజధానుల కోరిక ఇప్పట్లో నెరవేరాలా కన్పించడం లేదు.

Tags:    

Similar News