అంతా పకడ్బందీగానే

విశాఖకు రాజధాని తరలిపోవాలి. ఇది పక్కా. దాని కోసం ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రాకుండా చూసుకుంటోంది వైసీపీ సర్కార్. టైం ఎక్కువగా తీసుకోవడానికి కూడా అదే [more]

Update: 2020-01-18 08:00 GMT

విశాఖకు రాజధాని తరలిపోవాలి. ఇది పక్కా. దాని కోసం ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రాకుండా చూసుకుంటోంది వైసీపీ సర్కార్. టైం ఎక్కువగా తీసుకోవడానికి కూడా అదే కారణం. శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి శాసనమండలిలో బలం లేదు. మొత్తం 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే వైసీపీ బలం కేవలం 9 మంది మాత్రమే. టీడీపీ ఇక్కడ 26 ఎమ్మెల్సీలతో అతి పెద్ద పార్టీగా ఉంది. ఇక బీజేపీకి మూడు, పీడీఎఫ్ కూటమికి అయిదు సీట్లు ఉన్నాయి. దాంతో బిల్లు అసెంబ్లీలో నెగ్గినా మండలిలో కష్టమేనని అంటున్నారు. దాంతో వైసీపీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేస్తోంది.

ఆర్డినెన్స్ ద్వారా…

ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. 21 నుంచి శాసనమండలి కూడా ఉంటుంది. ఇక్కడ అధికార‌ వికేంద్రీకరణ, ఏపీ సమగ్ర అభివృధ్ధి పేరిట తయారు చేసిన బిల్లు ప్రవేశపెడతారు. దాన్ని బంపర్ మెజారిటీతో ఎటూ ఆమోదిస్తారు. కానీ ఇదే బిల్లు మరుసటి రోజు మండలికి వెళ్తుంది. అక్కడ కచ్చితంగా టీడీపీ మోకాలడ్డుతుంది. మరి దానికి ఏం చేస్తారు. ఇదే వైసీపీ సర్కార్ పెద్దలను ఆలోచింపచేస్తోంది. అయితే దీనికీ ఒక పధ్ధతి ఉంది అంటున్నారు. ఆర్డినెన్స్ గా బిల్లుని తీసుకురావాలని అనుకుంటున్నారుట.

ఇలా కూడా…

అదే విధంగా మూడు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించడం వెనక మరో వ్యూహం కూడా ఉందని అంటున్నారు. మండలిలో బిల్లుని తిరస్కరిస్తే దాన్ని మరో మారు అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకునే వీలు కూడా రాజ్యాంగం కల్పిస్తోంది. దాంతో రెండు మార్లు అసెంబ్లీలో బిల్లు పెట్టి నెగ్గించుకోవడమా, లేక ఆర్డినెన్స్ తేవడమా అన్నది ఇపుడు వైసీపీ ముందున్న ఆప్షన్లుగా చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది జరిగినా కూడా ఎక్కడా అమలుకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలనుకుంటున్నారుట.

న్యాయ‌ పరీక్షకు….

ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులో ఎక్కడా రాజధాని అన్న పదమే ఉండదట. దీని ప్రకారం ఏపీ వికేంద్రీకరణ , అన్ని ప్రాంతాల సమతుల్య అబివృద్ది చట్టం 2020 పేరుతో ఈ బిల్లు తీసుకు వస్తున్నారు. ఇందులో ఎక్కడా రాజధానిని మార్చుతారన్న ప్రస్తావన ఉండదు. విశాఖపట్నానికి సచివాలయం తరలింపు తదితర అంశాలేవీ ఇందులో ఉండవు. అలాగే ఆయా శాఖలను ఆయా ప్రాంతాలలో నెలకొల్పుకునే అదికారాన్ని కూడా బిల్లులో పొందుపరుస్తున్నారు. ప్రభుత్వం తలపెట్టిన నాలుగు ప్రాంతీయ బోర్డుల అంశం కూడా ఈ బిల్లులో పెట్టవచ్చని చెబుతున్నారు. మొత్తానికి ఒక వ్యూహం ప్రకారం వికేంద్రీకరణ చట్టాన్ని తేవాలని వైసీపీ సర్కార్ గట్టి పట్టుదల మీద ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News