లాగితే…మంచిదేనా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ గడచిన పదిహేనురోజులుగా చర్చ నడుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అత్యంత సంచలనాత్మకంగా, వివాదాస్పదంగా ప్రజల్లో నానుతున్న అంశమిదే. మూడు ప్రాంతాలకు పాలన వికేంద్రీకరణ [more]
ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ గడచిన పదిహేనురోజులుగా చర్చ నడుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అత్యంత సంచలనాత్మకంగా, వివాదాస్పదంగా ప్రజల్లో నానుతున్న అంశమిదే. మూడు ప్రాంతాలకు పాలన వికేంద్రీకరణ [more]
ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ గడచిన పదిహేనురోజులుగా చర్చ నడుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అత్యంత సంచలనాత్మకంగా, వివాదాస్పదంగా ప్రజల్లో నానుతున్న అంశమిదే. మూడు ప్రాంతాలకు పాలన వికేంద్రీకరణ పేరిట ప్రభుత్వం తన మనసులోని మాటను ఇప్పటికే బయటపెట్టేసింది. దానికి సాధికారత కల్పించే దిశలో అడుగులు వేస్తున్న సూచనలు కానవస్తున్నాయి. అయితే ప్రాంతాల మధ్య విద్వేషాలు, ఆగ్రహావేశాలు, అసంతృప్తి సెగలు పెచ్చరిల్లకుండా ఏకాభిప్రాయ సాధనకు సాధ్యమైనంత వరకూ ప్రయత్నించాలి. దాంతోపాటు అమరావతి రైతులను ఆదుకునేలా ప్రభుత్వం ఏమేరకు ఆలోచన చేస్తోందనేది ఇప్పుడు ఆసక్తి దాయకం. నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సర్కారు ప్రకటిస్తే అలజడి తగ్గుముఖం పట్టేందుకు, సర్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.
ఒకటే రాజధాని…
రాష్ట్రంలో మూడు రాజధానులంటూ సర్కారు చెప్పినప్పటికీ నిజానికి ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కడ్నుంచి నిర్వహిస్తారనే అంశమే ప్రధానం. ముఖ్యమంత్రి, శాఖల అధిపతులు, మంత్రులు తమ విధి నిర్వహణను ఎక్కడ్నుంచి నిర్వహిస్తారో అదే రాజధానిగా గుర్తింపు పొందుతుంది. మిగిలిన రాజధానులు నామమాత్ర వశిష్టంగానే ఉంటాయి. చట్టపరంగా, సాంకేతికంగా ఇది విస్పష్టమే. అయితే రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను చర్చల్లోకి తెచ్చినది మొదలు మిగిలిన అంశాలన్నీ మరుగున పడి దీనిచుట్టూనే ప్రజాస్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసార, ప్రచురణ మాధ్యమాలు ఆ అంశంపైనే కేంద్రీకరించాయి. ఇది సెంటిమెంటుతో ముడిపడిన భావోద్వేగ ఘట్టంగా మారుతోంది. సాధ్యమైనంత తొందరగా దీనికి తెర దించడం అవసరం. మంత్రులు పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టారు. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలను దీటుగా ఎదుర్కొనే పనిలోనే వారు నిమగ్నం అవుతున్నారు. దీంతో నూతన ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాల పర్యవేక్షణ, సమగ్ర ప్రచారంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.
భవిత..భరోసా…
నవ్యాంధ్ర చరిత్రలో 50 శాతం పైచిలుకు ఓట్లతో భారీ ఆధిక్యతతో ఘనవిజయం సాధించింది వైసీపీ. మరో నాలుగున్నరేళ్ల పాటు తన విధానాలను అమలు చేసుకునేందుకు సర్కారుకు సంపూర్ణ మైన ప్రజామద్దతు ఉన్నట్లుగానే భావించాలి. ప్రతిపక్షాలు, సంఘాలు ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినప్పటికీ అంతిమంగా ప్రభుత్వ నిర్ణయమే అమలవుతుంది. ఇది నిస్సందేహం. అయితే ప్రభుత్వం రాజధాని రైతులకు మాత్రం జవాబు చెప్పాల్సి ఉంటుంది. 29 గ్రామాల ప్రజలే అయినప్పటికీ వారు లేవనెత్తుతున్న అంశం ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన విషయం. అధికారంలో ఎవరున్నప్పటికీ వారు తమ భూములను ప్రభుత్వానికే అప్పగించారు. ప్రజాస్వామ్యంలో పార్టీలకంటే ప్రభుత్వ జవాబుదారీతనం రాజ్యాంగబద్ధమైనది. టీడీపీ, వైసీపీలు పార్టీలు మాత్రమే. పార్టీలు పూటకోమాటతో రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించినా పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వాలు తమ బాధ్యతల నిర్వహణలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడలేవు. అందువల్ల రాజధాని రైతుల భవిష్యత్తుకు స్పష్టమైన భరోసానిచ్చే విధంగా ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాల రాజకీయాలను పక్కనపెట్టినప్పటికీ ఏ ప్రభుత్వమూ ప్రజలను మాత్రం పక్కనపెట్టలేదు.
కార్యాచరణ…
ప్రాంతాల వారీ అభివృద్ధితోపాటు పాలన కేంద్రాలు సైతం విస్తరింప చేయాలనేది ప్రభుత్వ యోచన. ఇందులో మంచిచెడ్డలు, పాలన సౌలభ్యం, ఆర్థిక భారం వంటి విషయాలను కాలం నిర్ణయిస్తుంది. కార్యాచరణకు ముందస్తు కసరత్తు పక్కాగా, పకడ్బందీగా సాగాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వం హడావిడిగా హైదరాబాదు నుంచి తరలిరావడంతో వందల కోట్ల రూపాయలు వృథా వ్యయం చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఉద్యోగులకు అదనపు సౌకర్యాల పేరిట అధికభారం వెచ్చిస్తోంది. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితిలో ఇక ఏమాత్రం ఖర్చును తట్టుకునే స్థితి ఆంధ్రప్ర్రదేశ్ కు లేదనే చెప్పాలి. పెరిగిన రుణభారం, వడ్డీల చెల్లింపు, బడ్జెట్ లో నలభై శాతం పైచిలుకుకు చేరిన సంక్షేమ పథకాల ఖర్చు వంటివన్నీ ప్రభుత్వంపై ఉరుమురిమి చూస్తున్నాయి. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం తన కార్యక్షేత్రం తరలింపునకు సాధ్యమైనంత పరిమిత వ్యయంతో ప్రణాళికను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం, విద్యాసంవత్సరం వంటివి చాలా ముఖ్యం. ఏదేమైనప్పటికీ పాలనలో దీర్ఘకాలం అనిశ్చితి రాష్ట్రానికి మంచిది కాదు. రాజకీయ సందిగ్ధత యంత్రాంగంలో నిరాసక్తతకు, నిర్లక్ష్యానికి దారి తీస్తుంది. దీనికి వెంటనే తెరదించడం మంచిది.
-ఎడిటోరియల్ డెస్క్