కాషాయ కండువానే కాపాడుతుందట

శత్రువుల ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు అధికారంలో ఉన్న పార్టీకి చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ విపక్షాలను దెబ్బతీసేందుకు, ఆర్థికంగా [more]

Update: 2021-01-24 17:30 GMT

శత్రువుల ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు అధికారంలో ఉన్న పార్టీకి చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ విపక్షాలను దెబ్బతీసేందుకు, ఆర్థికంగా పార్టీని ఆదుకునే వారిని ఇబ్బంది పెట్టేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉపయోగపడుతుంది. ఎప్పుడు.. ఎన్నికలు జరిగినా ఈడీ దాడులు సర్వసాధారణమయిపోయాయి. ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏడేళ్ల కాలంలో ఈడీ దాడులు ఎక్కువయిపోయాయని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

ఎక్కడ ఎన్నికలు జరిగినా…?

ఇందులో నిజం లేకపోలేదు. విపక్షాలను ఆర్థికంగా దెబ్బతీస్తేనే గెలుపు సాధ్యమవుతుందని బీజేపీ అంచనా ఒకరకంగా సక్సెస్ అవుతుంది. అయితే ఇది విమర్శలకు దారితీస్తుంది. మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే అక్కడ కమల్ నాధ్ బంధువులపై దాడులు జరుగుతాయి. ఇక కర్ణాటకలో ఎన్నికలు ఉంటే ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇళ్లు, కార్యాలపై ఈడీ సోదాలు, దాడులు జరగడం సర్వసాధారణమయిపోయంది. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి కూడా.

ఆర్థికంగా బలమైన నేతలను…

డీకే శివకుమార్ లాంటి నేతలు పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో నిధులను సేకరించే బాధ్యతలను కూడా వీరే సేకరిస్తారు. అవసరమైన నిధులను తామే సొంతంగా పోగు చేస్తారు. ఇలాంటి కీలక నేతలపై ఈడీ దాడులు జరగడం రివాజుగా మారింది. ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఆ రాష్ట్రంలోని టీఎంసీ నేతలపై ఈడీని ప్రయోగిస్తుంది.

తాజాగా బెంగాల్ లో…..

తృణమూల్ కాంగ్రెస్ నేతలపై దాడులు జరుగుతున్నాయి. మనీలాండరింగ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈడీ కేసులకు భయపడి అనేక మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరితే ఎటువంటి దాడులు జరగవు. కాషాయ కండువా ఆస్తులకు రక్షణగా మారనుండటంతోనే టీఎంసీ నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మొత్తం మీద బీజేపీ ఈడీని పావుగా చూపి ఆర్థికంగా బలమైన విపక్ష నేతలను లొంగదీసుకోవాలని చూస్తుంది. ఇందులో కొంత మేర సక్సెస్ అయిందనే చెప్పాలి.

Tags:    

Similar News