ఆ నలుగురే నడిపిస్తున్నారటగా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఏమాత్రం దిగులు లేదు. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపైనా, భారతీయ జనతా పార్టీపైనా తాను చేసిన విమర్శలకు [more]

Update: 2019-08-03 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఏమాత్రం దిగులు లేదు. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపైనా, భారతీయ జనతా పార్టీపైనా తాను చేసిన విమర్శలకు ప్రతీకారం తీర్చుకుంటారని నిన్న మొన్నటి వరకూ కొంత గుబులు ఉండేది. కానీ ఇప్పుుడు అది లేదు. బిందాస్ గా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పటిష్టం చేయడం కోసం సమయం వెచ్చించవచ్చు. ఇదీ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే హస్తినలో సర్దుబాటు చేసేందుకు అంతా ముందస్తు చర్యలు చంద్రబాబునాయుడు చేపట్టినట్లు పార్టీలోనే గుసగుసలు విన్పిస్తున్నాయి.

పెద్దల సభలో బిల్లులకు….

ఇటీవల రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ లు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఇక తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్ లు మాత్రమే టీడీపీ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్లుగా కూడా ప్రకటించారు. ఇక సీఎం రమేష్ అయితే ఏకంగా బీజేపీ పక్షాన రాజ్యసభలో తానున్నానంటూ కాలరెగరేస్తున్నారు. ఇటీవల జరిగిన రైటు ఇన్ ఫర్మేషన్ యాక్ట్ బిల్లు మద్దతు పొందేందుకు అధికార బీజేపీ తరుపున సీఎం రమేష్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓటింగ్ సమయంలో అందరి వద్దకు వెళ్లి స్లిప్పులు పంచి మరీ డిప్యూటీ ఛైర్మన్ చేత చివాట్లు తిన్నారు సీఎం రమేష్.

టచ్ లో ఉంటూ….

ఇక మరో నేత సుజనా చౌదరికి ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసే పనిని భారతీయ జనతా పార్టీ అప్పగించింది. ఈ పనిలో సుజనా చౌదరి బిజీగా ఉన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులను పార్టీలోకి తీసుకొచ్చినందుకు సుజనా చౌదరికి త్వరలోనే కీలకమైన పదవి ఇస్తారని హస్తిన లో ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల రాజ్యసభలో రెండు కీలక బిల్లులకు తెలుగుదేశం పార్టీ బీజేపీకి సహకరించడానికి వెనుక ఈ నలుగురు ఉన్నారని సమాచారం. చంద్రబాబు నాయుడుతో నేటికీ టచ్ లో ఉంటూ ఈ నలుగురూ హస్తినలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారన్నది టాక్.

అందుకే పట్టించుకోవడం లేదట….

స్థానిక భారతీయ జనతా పార్టీ నేతలు చంద్రబాబునాయుడుపై ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ వాటికి పెద్దగా విలువ లేదని తెలుగుదేశం పార్టీ నేతలే కొట్టి పారేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, పురంద్రీశ్వరి చేస్తున్న విమర్శలకు టీడీపీ నుంచి రెస్పాన్స్ కూడా లేకపోవడానికి ఇదే కారణమంటున్నారు. చంద్రబాబునాయుడు ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతగా మెలిగేందుకు రెడీ అయిపోయారు. ఇందుకు ఆ నలుగరు సహకరిస్తున్నారన్నది పార్టీ వర్గాల నుంచే విన్పిస్తున్న మాట. మొత్తం మీద జగన్ ఎన్ని అవినీతి కేసులు వెలికితీసినా, చంద్రబాబునాయుడుకు మాత్రం జరిగేది శూన్యమని జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది.

Tags:    

Similar News