అమరావతి రాజధానిగా పనికిరాదా…?

అమరావతి మన రాజధాని అని ఏపీలోని 13 జిల్లాల ప్రజానీకం అనుకునేలా చేయడంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా విఫలం అయ్యారు. ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా [more]

Update: 2020-09-02 03:30 GMT

అమరావతి మన రాజధాని అని ఏపీలోని 13 జిల్లాల ప్రజానీకం అనుకునేలా చేయడంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా విఫలం అయ్యారు. ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అమరావతి మీద అలవికాని ప్రేమను కుమ్మరిస్తూ పూర్తిగా మిగిలిన జిల్లాలకు వారిని దూరం చేస్తున్నారు. తాను అధికారంలో లేకపోయిన పరోక్షంగా అమరావతి జేఏసీని డైరెక్ట్ చేస్తూ అమరావతి తమ సొంత ఆస్తి అన్నట్లుగా చేసి పారేశారు. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే డిజైన్ చేశారని అంటున్న విమర్శలకు జవాబు లేదు, దానికి బలమిచ్చేలా జగన్ అధికారంలో ఉన్నా కూడా చేయాల్సినందంతా చేస్తున్నారు.

దళితులకు చోటు లేదా…?

అమరావతి రాజధాని అందరిదీ, పదమూడు జిల్లాల ప్రజల కోసమే ఏర్పాటు చేశాను అని చెబుతున్న చంద్రబాబు అక్కడ ప్రభుత్వ భూమి 1500 ఎకరాల్లో దళితులకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని అంటే మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అమరావతి జేఏసీ పేరిట కోర్టుకు వెళ్ళి ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారు. దీని వల్ల అర్ధమైనదేంటి అంటే అమరావతి రాజధాని అన్నది కేవలం కొందరి కోసం, కొన్ని సామజికవర్గాల వారికోసమనే. లేనిపోని భావనలు ఇలా కలిగేలా చేస్తున్నారు. నిజానికి 50 వేల ఎకరాల్లో అమరావతి రాజధాని రాబోతోందని చెబుతున్న చంద్రబాబు అందులో యాభైవ వంతు దళితులకు ఇస్తామంటే ఎందుకు ఒప్పుకోవడంలేదు. ఇది నిజంగా వివక్ష కాదా. పెద్ద మనిషిగా బాబు అయినా చెప్పి ఒప్పిస్తే ఆయన గౌరవం పెరిగేది కదా. అమరావతి రాజధాని మీద అపోహలు కూడా కొంత వరకైనా తొలగేవి కదా.

అర్హత ఉందా..?

ఒక సామాజికవర్గం అధికంగా ఒకేచోట చేరి తమ వ్యాపార, వర్తక వాణిజ్యాలకు నిలయంగా దాన్ని చేసుకుంటే మిగిలిన వారికి అక్కడ చోటు ఎలా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ కధ అందరికీ తెలిసిందే కదా. అక్కడ హిందువులు ఎందుకు మైనారిటీలుగా మారిపోయారు. అదే రకమైన పరిస్థితి దేశంలో మరో ప్రాంతంలో రావడానికా అన్నట్లుగానే కదా అమరావతి రాజధాని నిర్మాణం ఉందంటూ 13 జిల్లాల ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. దీని మీద మంత్రి కొడాలి నాని అన్న మాటలు కొంత ఇబ్బందిగా ఉన్నా చివరికి అదే నిజమనిపించేలా ఉన్నాయి కదా. అమరావతిలో దళితులకు చోటు లేకపోతే అక్కడ శాసనరాజధాని కూడా ఎందుకు అని నాని అడిగిన ప్రశ్నకు రాజధాని జేఏసీ సమాధానం చెప్పాల్సివుంది. అంతే కాదు, తెర వెనక వారిని నడిపిస్తున్న చంద్రబాబు చెప్పాలి.

అదే జరిగేది……

ఏకైక‌ రాజధాని అంటూ చంద్రబాబు, అమరావతిలోనే అన్నీ ఉండాలని అక్కడ కొంతమంది ఉద్యమకారులు పోరాటం చేసినంతకాలం ఇతర జిల్లాలకు అమరావతి మీద సదభిప్రాయం ఏర్పడదు సరికదా మరింతగా వ్యతిరేకత పెరుగుతుంది. మూడు రాజధానుల్లో ఒకటిగా అమరావతిని చేస్తామంటే ఆ భాగ‌స్వామ్యాన్ని ఒప్పుకోని అమరావతి మీద మిగిలిన రెండు ప్రాంతాల వారికి కూడా ఎందుకు అభిమానం కలుగుతుంది. ఏది ఏమైనా రాజకీయ ఉచ్చులో పడిన తరువాత అమరావతి రాజధాని వివాదాస్పదం అయిందనే చెప్పాలి. దానికి తెర వెనక చంద్రబాబు, తెర ముందు కొందరు ఉద్యమకారులు బాధ్యత వహించాలి. రేపటి రోజున అక్కడ నుంచి అసెంబ్లీని కూడా ఎత్తేసినా తప్పులేదులే అని ఇతర ప్రాంతాల వారు అంగీకరించే పరిస్థితి మాత్రం తెచ్చుకోకూడదన్నదే అందరి విన్నపం.

Tags:    

Similar News