అమరావతి భ్రమల నుంచి బయటకు వస్తేనే…?
అమరావతి రాజధాని గురించి అంటే ఒక కధ గుర్తుకువస్తుంది. వెనకటికి ఒక రాజుగారిని వీధుల్లో నగ్నంగా మంత్రులు, సామంతులు తిప్పుతూ దేవతా వస్త్రాలు ఆయన కట్టారని, పుణ్యాత్ములకే [more]
అమరావతి రాజధాని గురించి అంటే ఒక కధ గుర్తుకువస్తుంది. వెనకటికి ఒక రాజుగారిని వీధుల్లో నగ్నంగా మంత్రులు, సామంతులు తిప్పుతూ దేవతా వస్త్రాలు ఆయన కట్టారని, పుణ్యాత్ములకే [more]
అమరావతి రాజధాని గురించి అంటే ఒక కధ గుర్తుకువస్తుంది. వెనకటికి ఒక రాజుగారిని వీధుల్లో నగ్నంగా మంత్రులు, సామంతులు తిప్పుతూ దేవతా వస్త్రాలు ఆయన కట్టారని, పుణ్యాత్ములకే అవి కనిపిస్తాయని ప్రచారం చేశారట. దాంతో నోరు తెరిస్తే పాపాత్ములం అవుతామని జనం సైలెంట్ అయ్యారు. అలా అయిదేళ్ల పాటు అమరావతి కధలు బాబు వినిపించినా నాడు జనాలు మౌనంగా ఉన్నది 2019 ఎన్నికల కోసమే. ఇక బాబు గుండెలు బాదుకుంటున్న అమరావతి రాజధాని పరిసరాల్లోనే టీడీపీకి చావు దెబ్బ కొట్టి కఠినమైన తీర్పు ఇచ్చారు కూడా. స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడు, సాక్షాత్తూ మంత్రి అయిన లోకేష్ ఓడిపోయారు. మరి ఇంత కధ నడిచినా బాబుకు అమరావతి భ్రమలు ఇంకా పోలేదు ఎందుకో.
అనుభవంతోనేనా …?
ఏపీ రెండుగా విడిపోయినపుడు అప్పులు 90 వేల కోట్లదాకా ఆంధ్రాకు ఉన్నాయి. ఏపీలో హైదరాబాద్ సాటి నగరం లేదు, ఒక్క పరిశ్రమ కూడా లేదు, పూర్తిగా వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంగా ఏపీ ఉంది. కేంద్రం తీరు చూసినా సాయం ఇచ్చే సీన్ లేదని బాబు లాంటి అనుభవం కలిగిన వారికి నాడే అర్ధమయ్యే ఉంటుంది. కానీ అన్నీ తెలిసినా కూడా అమరావతి పేరిట అయిదు లక్షల కోట్ల అతి భారీ ప్రాజెక్ట్ కి బాబు ఎందుకు సన్నాహాలు చేశారన్నదే పెద్ద ప్రశ్న. ఇక అమరావతి కోసం 33 వేల ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించి ఏటా కౌలు చెల్లింపు పేరిట మరో ఆర్ధిక గుదిబండను చితికిపోయిన రాష్ట్రానికి ఎందుకు కట్టారో ఆయనే చెప్పాలి.
అంతా ఏకపక్షమే…..
అమరావతి రాజధాని పూర్తిగా ఒక ప్రభుత్వ వ్యవహారంగా సాగలేదు అంటారు. అది కొందరు కలసి తీసుకున్న నిర్ణయం, కేవలం లాంచనంగా మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానాలు పెట్టి ఆమోదించారని కూడా వైసీపీ నేతలు విమర్శిస్తారు. వారు అన్నది పక్కన పెట్టినా కూడా అమరావతి రాజధాని విషయంలో శివరామక్రిష్ణన్ కమిటీ నివేదికను బాబు తుంగలోకి తొక్కారు. ఆ కమిటీ ఏం చెప్పిదంటే ప్రభుత్వ భూముల్లో రాజధానిని నిర్మాణం చేసుకోమంది. పాలనా రాజధానిగా మాత్రమే దాన్ని చూడమంది. ముక్కారు పంటలు పండే భూములను అసలు తీసుకోవద్దు అని చెప్పింది. కానీ బాబు అలా చేసారా. లేదే. అలాగే కేంద్రంతో నిమిత్తం లేకుండా సింగపూర్ లోని ప్రైవేట్ కంపీనీలతో ఒప్పందాలు కూడా వారికి అనుకూలంగా చేసుకున్నారని విమర్శలు ఉన్నాయి.
వట్టి విమర్శ మాత్రమే….
బాబు ఆద్వర్యంలో అమరావతి రాజధాని శంఖుస్థాపన జరిగింది 2015 అక్టోబర్ 22న. అంటే ఆ తరువాత ఆయన గట్టిగా చెప్పాలంటే మూడున్నరేళ్ల పాటు అధికారంలో ఉన్నారు. మరి తన హయాంలో అమరావతి రాజధానికి ఒక రూపు తీసుకురాలేని బాబు కేవలం ఏడాదిన్నర వైసీపీ పాలనలో అద్భుత భవనాలు నిర్మాణం కావడంలేదు అని ఎలా అనగలరు. పైగా అది ఆయనకు ప్రధానమైన ప్రాజెక్ట్. తమకు అసలు వైసీపీ కాదని తేల్చేశాక విమర్శలు చేయడం తప్ప సాధించేది ఏముంది. ఇవన్నీ పక్కన పెట్టినా కూడా అమరావతి అంటూ బాబు వేలాడిన దానికే కదా మిగిలిన ప్రాంతాల ప్రజలు టీడీపీ వద్దు అంటూ కచ్చితమైన తీర్పు ఇచ్చింది. ఇప్పటికీ చంద్రబాబు అమరావతి భ్రమలు వీడకపోతే మాత్రం రాజకీయంగా మరోసారి భారీ మూల్యానికి సిద్ధపడాల్సిఉంటుందన్నది విశ్లేషణ. ఇక అమరావతిని ఇపుడున్న స్థితిలో కేంద్రం కూడా టేకప్ చేయలేదు. ఎవరు చేసినా కూడా కొన్ని దశాబ్దాలు కాలం, లక్షల కోట్ల నిధులు వెచ్చించాల్సిన అతి పెద్ద ప్రాజెక్ట్ గానే జనం చూస్తున్నారు.