ఈ ఇద్దరినీ చంద్రబాబు ఏం చేయలేక?

ఏపీ టీడీపీలో మ‌రో క‌ల‌క‌లం రేగింది. కొన్నాళ్లుగా గుంభ‌నంగా ఉన్న ప‌రిస్థితి ఇప్పుడు బ‌హిర్గతం అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక‌రిద్దరు సీనియ‌ర్లు.. ఇప్పటికే ఈ విష‌యంపై పార్టీ [more]

Update: 2021-09-05 06:30 GMT

ఏపీ టీడీపీలో మ‌రో క‌ల‌క‌లం రేగింది. కొన్నాళ్లుగా గుంభ‌నంగా ఉన్న ప‌రిస్థితి ఇప్పుడు బ‌హిర్గతం అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక‌రిద్దరు సీనియ‌ర్లు.. ఇప్పటికే ఈ విష‌యంపై పార్టీ అధినేత చంద్రబాబుకు ర‌హ‌స్య లేఖ‌లు రాసిన‌ట్టు తెలిసింది. అయితే.. ఆయ‌న ఇప్పటి వ‌రకుఎలాంటి చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డం.. విష‌యం మీడియాకు పొక్కింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన‌ ముగ్గురు ఎంపీలు గెలిచారు. శ్రీకాకుళం, విజ‌య‌వాడ‌, గుంటూరు ఎంపీల స్థానాలు ఈ పార్టీ ఖాతాలో ప‌డ్డాయి.

ఆ ఎంపీలపై…?

ఈ ముగ్గురు ఎంపీలు కూడా వ‌రుస‌గా రెండోసారి గెల‌వడం విశేషం. అయితే.. క‌ల‌సి క‌ట్టుగా ఉంటున్నార‌ని.. ఏపీ స‌మ‌స్యల‌పై పార్లమెంటులో నిల‌దీస్తున్నార‌ని.. వీరంతా పాండ‌వుల సంత‌తి అని పార్టీ అధినేత చంద్రబాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ త‌ర‌చుగా ప్రచారం చేస్తున్నారు. కానీ, పైకి చెబుతున్న ప‌రిస్థితి అంత‌ర్గతంగా మాత్రం క‌నిపించ‌డం లేద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. ఎవ‌రికి వారుగా ఉన్నార‌ని.. ఎవ‌రూ టీడీపీ త‌ర‌ఫున ప‌నిచేస్తున్నట్టు.. గెలిచిన‌ట్టు భావించ‌డం లేద‌ని అంటున్నారు. విజ‌య‌వాడ నుంచి గెలిచిన కేశినేని నాని తీవ్ర వివాదం అయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. పార్టీ అధినేత‌పైనే ఆయ‌న కామెంట్లు చేశారు. నానిపై సొంత పార్టీలోనే లెక్కలేన‌న్ని కుంప‌ట్లు ఉన్నాయి.

ఎవరి అజెండా వారిదే….

ఇక‌, గుంటూరు నుంచి గెలిచిన గ‌ల్లా జ‌య‌దేవ్‌.. పైకి టీడీపీకి స‌హ‌క‌రిస్తున్నట్టు క‌నిపిస్తున్నా.. త‌న వ్యక్తిగ‌త అజెండానే అమ‌లు చేస్తున్నార‌ని.. గుంటూరు పార్టీ నేత‌లు ల‌బోదిబోమంటున్నారు. రాజ‌ధాని ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు పార్లమెంటులో మాట్లాడ‌డం త‌ప్ప ఆ తర్వాత జ‌య‌దేవ్ గుంటూరుకు మొఖం చూపించిందే లేదు. అదే స‌మ‌యంలో ఒక్క శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు మాత్రం ఒకింత ఫ‌ర్వాలేద‌ని అంటున్నారు. రామ్మోహ‌న్ తో నాని, జ‌య‌దేవ్ క‌ల‌వ‌రా ? లేదా ఆయ‌న వీళ్లను క‌లుపుకోరో ఏమో తెలియ‌ట్లేదు. ఏదేమైనా ఈ ముగ్గురూ మాత్రం ఎవ‌రి అజెండాను వారే మోస్తున్నార‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు.

సహకరించడం లేదంటూ..?

“మా ఎంపీ అనే మాటే కానీ.. మాకు ఒక్క ప‌నికూడా చేసి పెట్టడం లేదు“ అని పార్టీ సీనియ‌ర్లు పేర్కొంటున్నారు. ఇదే విష‌యంపై చంద్రబాబుకు విజ‌య‌వాడ‌, గుంటూరు ప్రాంతాల నుంచి ఏకంగా ప‌ది మంది నాయ‌కులు లేఖ‌లు సంధించారు. అయితే.. చ‌ర్యలు తీసుకుంటాన‌ని చెప్పిన చంద్రబాబు ఇప్పటివ‌ర‌కు ప‌ట్టించుకోలేదు. దీంతో టీడీపీ సీనియ‌ర్లు ఈ విష‌యంపై బ‌హిరంగంగానే తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. “ఎంపీగా ఆయ‌న గెలిచారంటే.. మా స‌హ‌కారం లేకుండానే గెలిచారా? “ అంటూ.. గుంటూరుకు చెందిన మాజీ మంత్రి ఒక‌రు ఇటీవ‌ల మీడియా స‌మావేశం అనంత‌రం పాత్రికేయుల ముందే వ్యాఖ్యానించారు. ఇలాంటి ప‌రిస్థితి విజ‌య‌వాడ‌లో బ‌హిరంగంగానే వ్యక్తమ‌వుతోంది. ఈ ప‌రిస్థితిలో చంద్రబాబు ఏం చేస్తారోచూడాలి. తెగేదాకా వేచి చూస్తారా? లేక చ‌ర్యలు తీసుకుంటారా? అనేది ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News