ఆ విషయంలో బాబుకు వార్నింగ్ ఇస్తున్న క్యాడర్

రాజకీయ పార్టీలకు ఎప్పుడు కార్యకర్తలే పెద్ద సపోర్ట్. వారు లేకపోతే పార్టీల మనుగడే ఉండదు. అందుకే పార్టీలు ఎప్పుడు తమ కార్యకర్తలకు పెద్ద పీఠ వేస్తూ ఉంటాయి. [more]

Update: 2021-09-09 14:30 GMT

రాజకీయ పార్టీలకు ఎప్పుడు కార్యకర్తలే పెద్ద సపోర్ట్. వారు లేకపోతే పార్టీల మనుగడే ఉండదు. అందుకే పార్టీలు ఎప్పుడు తమ కార్యకర్తలకు పెద్ద పీఠ వేస్తూ ఉంటాయి. ఇటు కార్యకర్తలు సైతం పార్టీని బలోపేతం చేయడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తారు. అయితే ఇందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమి భిన్నం కాదు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు….అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలని లైట్ తీసుకుని, అధికారం కోల్పోయాక కార్యకర్తలని పట్టించుకుంటారు.

క్యాడర్ విషయంలో…?

ఆ విషయం గత ఏడేళ్లుగా కనబడుతూనే ఉంది. దాదాపు పదేళ్ళ పాటు అధికారం కోల్పోయి 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ అప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు, కార్యకర్తలని పెద్దగా పట్టించుకోలేదు. ఆఖరికి నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో కూడా అలసత్వం ప్రదర్శించారు. ఏదో చిన్న చిన్నగా బీమా సౌక‌ర్యం క‌ల్పించి దాని గురించే లోకేష్ ఆధ్వర్యంలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని…?

ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ కేడ‌ర్‌ను లైట్ తీస్కొని… ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు మాత్రం ఎక్కువగానే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల 2019 ఎన్నికల్లో టీడీపీకి ఎలాంటి ఫలితం వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. పార్టీ ఘోరంగా ఓడిపోతే…పార్టీకి అండగా నిలబడుతూ వస్తుంది..మళ్ళీ కార్యకర్తలే. అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి నాయకులు మళ్ళీ వేరే దారి చూసుకోవడమో, లేక సైలెంట్ అయిపోవడమో చేస్తే, కార్యకర్తలే అధికార వైసీపీకి ధీటుగా నిలబడి టీడీపీని పైకి లేపడానికి కృషి చేస్తున్నారు.

కేసులు పెడుతున్నా?

ఎన్ని కేసులు పెడుతున్నా సరే పార్టీకి అండగా నిలబడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు మ‌ళ్లీ కార్యక‌ర్తల విలువ తెలుసుకుని వారిని మ‌చ్చిక చేసుకునే ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈ సారి మాత్రం పార్టీ అధికారంలోకి వస్తే జంపింగ్ నాయకులని ఎంకరేజ్ చేయొద్దని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అధికారం కోసం ఆశపడి వచ్చే నాయకులని చంద్రబాబు మళ్ళీ నెత్తిన పెట్టుకుంటే పార్టీకే నష్టం జరుగుతుందని అంటున్నారు. అందుకే వలస నాయకులని ఈసారి ఎక్కువగా ప్రోత్సహించకూడదని కార్యకర్తలు, చంద్రబాబుకు చిన్నపాటి వార్నింగ్ ఇస్తున్నారు. అయితే చంద్రబాబు వీటిని త‌ల‌కెక్కించుకుంటారో ? లేదో ?

Tags:    

Similar News