రహస్య చర్చలు మతలబు ఏంటో?

రాజకీయ నాయకుల సంబంధాలు కత్తిమీద సాముగా మారిపోయాయి. అందులోనూ రహస్యంగా అనధికారిక మంతనాలు జరపాలంటే వణుకుపుడుతోంది. ఎవరెక్కడి నుంచి వల పన్నుతారో తెలియదు. ఫోన్ సంభాషణలను ప్రత్యర్థులు, [more]

Update: 2021-08-28 15:30 GMT

రాజకీయ నాయకుల సంబంధాలు కత్తిమీద సాముగా మారిపోయాయి. అందులోనూ రహస్యంగా అనధికారిక మంతనాలు జరపాలంటే వణుకుపుడుతోంది. ఎవరెక్కడి నుంచి వల పన్నుతారో తెలియదు. ఫోన్ సంభాషణలను ప్రత్యర్థులు, ప్రభుత్వ యంత్రాంగం ఎవరు రికార్డు చేస్తారో తెలియదు. గుట్టుచప్పుడు కాకుండా జరగాల్సిన వ్యవహారాలు రోడ్డున పడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో ఆన్ లైన్, మొబైల్ ద్వారా సంబంధాలను నడపడానికి నాయకులు ఇష్టపడటం లేదు. ఈరోజు మిత్రుడే రేపటి శత్రువు. నేటి ప్రత్యర్థి రేపటి సహచరుడు. ప్రస్తుతం పొరుగు పార్టీలోని కీలక నేత రేపు తన పార్టీలోనే బాస్ కావచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అందుకే నాయకులు చాలా తెలివిగా సంబంధాలు మెయిన్ టెయిన్ చేస్తుంటారు. దిగువస్థాయి కార్యకర్తలు వీధికెక్కి కొట్టాడుకుంటూ ఉంటారు. నాయకుల మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రం ఆంతరంగికంగా సజావుగానే ఉంటాయి. ఉత్తుత్తి యుద్దాలు, సవాళ్లు కొనసాగుతుంటాయి. అవసరమైనప్పుడు మాట్టాడుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు. అదే రాజకీయ రహస్యం. కానీ వారి సంబంధ బాంధవ్యాలకు గతంలో ఉన్నంత సదుపాయం ఇప్పుడు కనిపించడం లేదు. అత్యంతక్లిష్టంగా వ్యవహారాల నిర్వహణ మారిపోయింది.

వేడుకే రాజకీయ వేదిక…

తిమ్మిని బమ్మిని చేస్తూ లౌక్యంగా వ్యవహారాలు నడపటంలో చంద్రబాబు చాణుక్యుడు. దాదాపు అన్ని పార్టీలతోనూ మంచి సంబంధాలే కొనసాగిస్తుంటారాయన. అటువంటి చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో గతంలో ఎన్నడూ ఎదుర్కోని విషమ పరిస్థితిని చవి చూస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎటువైపు మొగ్గాలో తేల్చుకోలేని అయోమయం వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ వేట కొనసాగిస్తోంది. తెలంగాణలో వేలు పెట్టేందుకు సందు దొరకడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన రాజకీయ భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో వేలాడుతోంది. పరిస్థితిని సెట్ రైట్ చేసుకోవడానికి తనకున్న నైపుణ్యాన్ని వినియోగించి పావులు కదపాలి. గుట్టుగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెసులను లైన్ లో పెట్టాలి. కానీ గతంలో మాదిరిగా సంబంధాలను మొబైల్ తో నడిపేసేందుకు అవకాశం లేదు. మధ్యవర్తులను నమ్ముకునే పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలో వైవాహిక వేడుకలను సైతం రాజకీయ సంప్రతింపులకు వినియోగించుకుంటున్నారు చంద్రబాబు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కుమారుని వివాహానికి టీడీపీ అధినేత హాజరయ్యారు. ఈ మధ్య కాలంలో సొంత పార్టీ నాయకుల ఇళ్లల్లో వేడుకలకు కూడా హాజరుకావడం లేదు. తప్పనిసరి అయితే లోకేశ్ ను పంపుతున్నారు. అటువంటిది గతంలో తనతో పెద్దగా సంబంధాలు లేని శైలజానాథ్ ఇంటి వేడుకకు హాజరు కావడం, పనిలో పనిగా రేవంత్, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారితో కలిసే సందర్బాన్ని సృష్టించుకోవడం హాట్ టాపిక్ గా చర్చనీయమవుతోంది.

చక్రం తిప్పగలరా..?

చంద్రబాబు ఎటువంటి మొహమాటాలు లేని రాజకీయ వేత్త. ప్రతి సందర్బాన్ని పక్కాగా రాజకీయ అవసరాలకే వినియోగిస్తారు. గతంలో హరికృష్ణ మరణించినప్పుడు పరామర్శకు వచ్చిన టీఆర్ఎస్ అగ్రనేతలతో రాజకీయ చర్చలు జరిపి విమర్శలపాలయ్యారు. టీఆర్ఎస్, టీడీపీ తెలంగాణలో కలిసి పనిచేసే విషయమై కుటుంబ పరామర్శ వద్దనే మాట్టాడేశారు. ఆ విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు బయట పెట్టడంతో చంద్రబాబు నైజం సామాన్యులకు తెలియవచ్చింది. ఆయనతో నిత్యం తిరిగే నాయకులకు, ఇతర పార్టీలకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. ప్రస్తుతం చంద్రబాబుకు జాతీయ పార్టీల అండ చాలా అవసరం. కాంగ్రెసు చుట్టూ దేశంలోని అనేక పార్టీలు చేరుతున్నాయి. ఎన్డీఏకు ప్రత్యర్థిగా ఒక కూటమి రూపుదిద్దుకుంటోంది. కానీ చంద్రబాబు నాయుడు నేరుగా ఆ జట్టుతో కలిసేందుకు సాహసించలేకపోతున్నారు. 2018లో తెలంగాణలో కాంగ్రెసు తో కలిసి దిద్దుకోలేని పొరబాటు చేశారు. బీజేపీకి దూరమయ్యారు. రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసుతో కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. కానీ కాంగ్రెసు పార్టీ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే జాతీయంగా అండ దొరుకుతుంది. అప్పటివరకూ రహస్యంగా సంబంధాలు కొనసాగించాలి. ప్రత్యక్షంగా ఇప్పటికిప్పుడు హస్తం పార్టీకి అనుకూలంగా మాట్టాడలేరు. ఇప్పటికే కక్ష కట్టిన వైసీపీ సర్కారుకు , కేంద్ర ప్రభుత్వమూ తోడైతే టీడీపీ అడ్రస్ గల్లంతవుతుంది. నాయకులకు దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు, లోకేశ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించవచ్చు. ఆయా పరిణామాలను ఎదుర్కొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం సిద్దంగా లేరు. అందుకే సైలెంట్ గా ఉంటున్నారు. ఆశగా చూస్తున్నప్పటికీ బీజేపీ అక్కున చేర్చుకోవడం లేదు. కాంగ్రెసు కరుణిస్తుందని నమ్మకం ఉంది. కానీ బహిరంగ సంబంధాలు పెట్టుకుంటే అపాయం.

ఇరువైపులా చెట్టాపట్టాల్…

పీసీసీ అద్యక్షుడు శైలజానాథ్ కుమారుని వివాహం చంద్రబాబుకు చక్కని రాజకీయ వేదికగా ఉపయోగపడింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం నిలపడటానికి టీడీపీ సహకరించింది. తగినంత బలం లేకపోయినా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూర్తి కాలం కొనసాగడానికి చంద్రబాబు పరోక్ష సహకారం ఉపయోగపడింది. కాంగ్రెసు నుంచి టీడీపీ జాతీయంగా సహకారాన్ని కోరుకుంటోంది. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వంటి ప్రముఖులు చంద్రబాబు అనుయాయులే. వారితో కూడా మనసు విప్పి మాట్టాడుకోలేని పరిస్థితులు దాపురించాయి. ఈ దశలో శైలజానాథ్ కుమారుని వివాహం కలిసి వచ్చింది. శైలజానాథ్ తో చంద్రబాబుకు గతంలో ఎప్పుడూ మంచి సంబంధాలు లేవు. వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో టీడీపీపట్ల తీవ్రమైన విమర్శనాత్మక ధోరణి కనబరిచిన వారిలో శైలజానాథ్ ఒకరు. కానీ ఏపీలో పీసీసీ పీఠం అధిష్టించిన తర్వాత శైలజానాథ్ తో చంద్రబాబు సత్సంబంధాలు నెలకొల్పుకున్నారు. రేవంత్ ఎటూ తన మనిషే. శైలజానాథ్ కూడా సహకరించే చాన్సులు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులిద్దరితోనూ చెట్టపట్టాలు వేసుకుంటూ తద్వారా పరోక్షంగా కాంగ్రెసు అధిష్టానానికి సంకేతాలు పంపడమే చంద్రబాబు ఉద్దేశం. కేంద్రంలో కాంగ్రెసుతో సంబంధాలకు భవిష్యత్తులో వీరు కీలకంగా ఉపయోగపడతారనేది టీడీపీ అధినేత చంద్రబాబు అంచనా. పీసీసీ నేత కుటుంబ వేడుకలో ఏం జరిగిందనేది బహిరంగం కాకపోయినప్పటికీ, మనసు విప్పి మాట్టాడుకునే వేదిక మాత్రం దొరికింది. దానిని చంద్రబాబు నూటికి నూరు శాతం సక్సెస్ చేసుకుని ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News