Tdp : చేరికలు ఇప్పట్లో ఉండవట… కారణం అదేనట

అధికారంలో ఉన్న పార్టీ బలహీనమయితే విపక్షానికి అడ్వాంటేజీ అవుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో విపక్షంలో చేరికలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతం ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే తెలుగుదేశం [more]

Update: 2021-10-03 08:00 GMT

అధికారంలో ఉన్న పార్టీ బలహీనమయితే విపక్షానికి అడ్వాంటేజీ అవుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో విపక్షంలో చేరికలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతం ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ బలోపేతం కాలేదు. అన్ని నియోజకవర్గాలలో టీడీపీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. దీంతో పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మంది చేరారు.

వీడేవారే సంఖ్య…

ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వీడిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించిన వారు సయితం యాక్టివ్ గా లేరు. కేవలం పది మంది మాత్రమే అధికార పార్టీ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నారు. దీంతో వైసీపీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీని వీడేందుకు ఎవరూ సాహసించడం లేదు. పార్టీలో సీనియర్లు, ముఖ్యనేతలకు ఇంతవరకూ పదవులు జగన్ ఇవ్వలేదు.

పార్టీ మారాలని ఉన్నా…

దాడి వీరభద్రరావు వంటి నేతలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మామూలుగా అయితే ఇలాంటి నేతలు విపక్ష తెలుగుదేశం పార్టీ లేదా మరో పార్టీలోకి వెళ్లాలని చూస్తారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలు మారడం నేతలు నిర్ణయం తీసుకోవడం మామూలే. కానీ తెలుగుదేశం పార్టీలో చేరికలు మరో ఏడాదిన్నర వరకూ ఉండేలా కనిపించడం లేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.

పొత్తు కూడా ఆటంకమే…..

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లనున్నారని భావిస్తున్నారు. జనసేనతో పొత్తు ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. జనసేనతో పొత్తు ఉంటే తమకు ప్రాధాన్యత లభించదని నేతలు భావిస్తున్నారు. నిజానికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖ వంటి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ వైపు వైసీపీ నేతలు రావాలనుకుంటున్నా పొత్తుల ఇబ్బందితో వారు చేరడానికి ముందుకు రావడం లేదంటున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో ఇప్పుడిప్పుడే చేరికలు ఉండే అవకాశాలు లేనట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News