Chandrababu : ఢిల్లీ కి పయనం…. వారిని కూడా కలుస్తారటగా?

తెలుగుదేేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ప్రయణానికి సిద్దమవుతున్నారు. సోమవారం ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. బీజేపీతో సఖ్యత సాధ్యం కాకపోవడంతో ఆయన మరోసారి మోదీకి వ్యతిరేకంగా [more]

Update: 2021-10-23 15:30 GMT

తెలుగుదేేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ప్రయణానికి సిద్దమవుతున్నారు. సోమవారం ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. బీజేపీతో సఖ్యత సాధ్యం కాకపోవడంతో ఆయన మరోసారి మోదీకి వ్యతిరేకంగా ఉన్నే పార్టీలతో చేతులు కలిపే అవకాశాలున్నాయి. గత మూడేళ్ల నుంచి బీజేపీతో సఖ్యత కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తన పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులను బీజీపీలోకి పంపినా ఫలితం లేదు. వారికి అక్కడ వాల్యూ లేకుండా పోయింది.

బీజేపీతో పొత్తు….

దీంతో చంద్రబాబుకు బీజేపీతో పొత్తు అనేది అసాధ్యమని తేలిపోయింది. స్థానికంగా ఇన్ ఛార్జిగా ఉన్న సునీల్ దేవధర్ సయితం టీడీపీని వ్యతిరేకిస్తున్నారు. తాను త్వరగా బీజేపీకి దగ్గరవ్వాలనుకుంటే స్థానిక నేతలు పడనివ్వడం లేదు. కేంద్ర నాయకత్వం కూడా సుముఖంగా లేదు. ఆర్ఎస్ఎస్ అగ్రనేతల ద్వారా జరిపిన రాయబారం కూడా సఫలం కాలేదు. దీంతో బీజేపీతో పొత్తుపై చంద్రబాబు ఆశలు వదులుకున్నారు. దీంతో పాటు చంద్రబాబు కు అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా లభించలేదు. రాష్ట్రపతి అపాయింట్ మాత్రమే లభించింది.

కాంగ్రెస్ తో కలవడమే…..

ఇక చంద్రబాబుకు ఒకే ఒక్క దారి బీజేపీయేతర పార్టీలతో కలవడమే. కాంగ్రెస్ తో గత ఎన్నికల సమయంలోనే కలిశారు. అఖిలేష్ యాదవ్, మమత బెనర్జీ వంటి నేతలను కలసి మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడాలని, మోదీని గద్దె దించాలని డిమాండ్ చేశారు. మరోసారి మోదీ ప్రభుత్వం రావడం, తాను అధికారాన్ని కోల్పోవడంతో చంద్రబాబు గత మూడేళ్ల నుంచి ఢిల్లీ గడప తొక్కలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత మోదీకి అనుకూలంగా మాట్లాడినా ఇప్పుడు క్రమంగా మనసు మార్చుకుంటున్నారు.

సమయం దగ్గరపడుతుండటంతో…

పార్లమెంటు ఎన్నికలు, శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. ఇక మూడేళ్ల సమయం మాత్రమే ఉంది. క్రమంగా కాంగ్రెస్ తో కొన్ని పార్టీలు కలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తాను కూడా త్వరగా కాంగ్రెస్ కూటమిలో చేరాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. బీజేపీతో కటీఫ్ చెప్పేసి కాంగ్రెస్ తో చేతులు కలిపితే రాష్ట్రంలో కూడా కొంత ఓటు బ్యాంకును తెచ్చుకోవచ్చన్న యోచనలో ఉన్నారు. అన్నీ కుదిరితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల నేతలను కలిసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఢిల్లీలో టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాల నేతలను కూడా సంప్రదిస్తున్నారు. బీజేపీ నేతలు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే ఢిల్లీలోనే ఉండి ఆయన కాంగ్రెస్ మిత్రపక్షాలను కలిసే అవకాశముంది.

Tags:    

Similar News