Chandrababu : ఢిల్లీ టూర్ సందడి లేదు… సైలెంట్ గానేనట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా హడావిడి ఉంటుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఢిల్లీ టూర్లు సందడిగా సాగేవి. జాతీయ నేతలతో వరస [more]

Update: 2021-10-22 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా హడావిడి ఉంటుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఢిల్లీ టూర్లు సందడిగా సాగేవి. జాతీయ నేతలతో వరస భేటీలు, జాతీయ మీడియాతో చిట్ చాట్ లు ఇలా చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం ఆద్యంతం ఉత్సాహంగా నడిచేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా జరుగుతుంది. ఎవరిని కలవాలో తెలియదు. ఎవరు కాదంటారో అర్థంకాని పరిస్థితుల్లో చంద్రబాబు హస్తిన పర్యటన ఉండబోతోంది.

ఎంతో హడావిడి….

దాదాపు నలభై ఏళ్లుగా చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఆయన జాతీయ నాయకుడి హోదాలో అనేక సార్లు ఢిల్లీకి వచ్చారు. దేవెగౌడను ప్రధాని చేయడంలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడంలో అంతా తానే అయి వ్యవహరించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వివిధ పార్టీల నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యేవారు. చంద్రబాబు వస్తున్నారంటే ఢిల్లీలోని టీడీపీ నేతల హడావిడి మామూలుగా ఉండేది కాదు.

ఎవరిని కలుస్తారో?

కానీ ఇప్పుడు ఒంటరిగానే ఢిల్లీకి వెళుతున్నారు. అమిత్ షా కలుస్తారో లేదో తెలియదు. రాష్ట్రపతి రమ్మంటారో లేదో అర్థంకాని పరిస్థిితి. కానీ రాష్ట్రపతి వరకూ అపాయింట్ మెంట్ దొరికే అవకాశాలున్నాయి. ఇందులో ఢిల్లీలో కీలకపదవిలో ఉన్న ఒకాయన హెల్ప్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇంతకీ ఢిల్లీ వెళ్లి చంద్రబాబు ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారనుంది. అమిత్ షాతో కలిసి ఆయనకు ఫిర్యాదు చేసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఫలితం ఉండదన్నది చంద్రబాబు కు తెలియంది కాదు.

జాతీయ మీడియాకు….?

అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై చర్యలు ఆశించకపోయినా, రాజకీయంగా ఆయన బీజేపీకి దగ్గరయ్యే అవకాశానికి ఈ టూర్ ఉపయోగపడనుంది. అదే సమయంలో జాతీయ మీడియాకు జగన్ ప్రభుత్వం తమ పార్టీ పట్ల అనుసరిస్తున్న విధానాలను, వైఫల్యాలను వివరించే అవకాశముంది. అది తప్ప ఢిల్లీ టూర్ ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు, ఆయన పార్టీకి పెద్దగా ఉపయోగపడే అవకాశాలు లేవు.

Tags:    

Similar News