Andhra : వారిద్దరిని కలవడం కోసం కసరత్తు…?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి ఢిల్లీని తాకనుంది. సోమవారం ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారయింది. ప్రధాని మోదీ, హోంమంత్రి [more]

Update: 2021-10-23 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి ఢిల్లీని తాకనుంది. సోమవారం ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారయింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దల ఎదుట రాష్ట్ర పంచాయతీని పెట్టాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకసారి వారిద్దరి అపాయింట్ మెంట్ దొరికితే చాలు యాభై శాతం చంద్రబాబు రాజకీయంగా విజయం సాధించినట్లే.

మోదీ, షాలను…

ఇప్పటికే ఢిల్లీలో టీడీపీ నేతలు ప్రధాని మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమిత్ షా మూడు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన సోమవారం ఢిల్లీ చేరుకునే అవకాశముంది. ఆయన అపాయింట్ మెంట్ కోసం టీడీపీ నేతలు ఇప్పటికే హోంమంత్రి కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తో పాటు కంభంపాటి రామ్మోహన్ రావులు అదే ప్రయత్నంలో ఉన్నారు.

ఖరారు కాకపోయినా…?

అయితే ఇంతవరకూ వారిద్దరి అపాయింట్ మెంట్లు ఖరారు కాలేదు. చంద్రబాబు చాలా కాలం తర్వాత ఢిల్లీ వెళుతుండటంతో ఖచ్చితంగా కేంద్రంలోని పెద్దలను కలసి రావాలని భావిస్తున్నారు. తన ఢిల్లీ పర్యటనపై ఫెయిల్యూర్ ముద్ర పడకూడదని ఆయన ఇప్పటికే నేతలను ఆదేశించారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం కేంద్రంలో కీలక స్థానంలో ఉన్న ప్రముఖ వ్యక్తితో సంప్రదింపులు జరుపుతున్నారు.

జాతీయ స్థాయిలో….

తన పర్యటనతో జగన్ కు ఇప్పటికిప్పుడు చెక్ పెట్టకపోయినప్పటికీ జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టే వీలుంటుంది. అలాగే జాతీయ మీడియాతో కూడా చంద్రబాబు సోమవారం మాట్లాడేలా టీడీపీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ నేతలపై దాడులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి జాడ లేకపోవడం తదితర అంశాలపై చంద్రబాబు సోమవారం జాతీయ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు.

Tags:    

Similar News