Chandrababu : స్పీడ్ పెంచుతారట.. రూట్ మ్యాప్ రెడీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మరింత జోరు పెంచే అవకాశాలున్నాయి. ఢిల్లీ టూర్ పెద్దగా తనకు రాజకీయంగా ఉపయోగపడనప్పటికీ, జగన్ ను [more]

Update: 2021-11-03 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మరింత జోరు పెంచే అవకాశాలున్నాయి. ఢిల్లీ టూర్ పెద్దగా తనకు రాజకీయంగా ఉపయోగపడనప్పటికీ, జగన్ ను జాతీయ స్థాయిలో బద్నాం చేయగలిగామన్న సంతృప్తితో చంద్రబాబు ఉన్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత మరింత స్పీడ్ పెంచాలన్న ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నారు. ఇక ప్రజాసమస్యలపై పోరాటం చేసే దిశగా చంద్రబాబు క్యాలెండర్ ను రూపొందిస్తున్నారు.

ఇప్పటి వరకూ….

చంద్రబాబు నిన్న మొన్నటి వరకూ కరోనా కారణంగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ తమ పార్టీ నేతలకోసం టీడీపీ ఆందోళన చేసిందన్న ఒక భావన ఏర్పడింది. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, పార్టీ కార్యాలయాలపై దాడులు, టీడీపీ నేతలపై దాడులు వంటి వాటిపైనే చంద్రబాబు ఎక్కువగా పోరాటం చేశారన్న విమర్శలున్నాయి.

ప్రజా సమస్యలపై….

దీంతో చంద్రబాబు నేరుగా ప్రజాసమస్యలపై ఉద్యమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం కలసి వచ్చే పార్టీలతో కలసి కార్యాచరణను రూపొందించనున్నారు. ఇటీవల జరిగిన బంద్ కు కూడా రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభించలేదు. దీంతో చంద్రబాబు వారితో కలసి పోరాటం చేయాలని రూట్ మ్యాప్ ను రూపొందిస్తున్నారు. ప్రధానంగా ఆస్తిపన్ను పెంపుదల, విద్యుత్త్ ఛార్జీలు, పెట్రోలు రేట్లు, నిత్యవసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం ఇలా వరస పెట్టి ఆందోళనలను చేయాలని నిర్ణయించారు.

స్థానిక సమస్యలను కూడా…

కేవలం ఒక సమస్యను ఒక్కరోజుతో వదిలేయకుండా ప్రభుత్వం నుంచి కాకపోయినా ప్రజల నుంచి స్పందన వచ్చేంత వరకూ ఆందోళన చేస్తే బాగుంటుందన్న సూచనలను కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారంటున్నారు. రాష్ట్ర స్థాయి సమస్యలే కాకుండా జిల్లా సమస్యలను కూడా గుర్తించి అక్కడ స్థానిక పార్టీలతో కలసి ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయాలని చంద్రబాబు నేతలకు ఆదేశించారు. ఇలా రానున్న మూడేళ్లు పార్టీ ప్రజల కోసమే అన్నట్లు చంద్రబాబు కార్యాచరణ ఉండబోతోంది.

Tags:    

Similar News