Chandrababu : బిల్డప్ బాబాయ్… బ్యాక్ టు అమరావతి

“చంద్రబాబు ఉగ్రరూపం.. రాష్ట్రపతి సీరియస్.. ఏపీలో రాష్ట్రపతి పాలన…వణుకుతున్న జగన్” రెండు రోజుల నుంచి ఇవే వార్తలు. వినలేక, చూడలేక చచ్చాం. కానీ తీరా అసలు విషయానికి [more]

Update: 2021-10-26 13:30 GMT

“చంద్రబాబు ఉగ్రరూపం.. రాష్ట్రపతి సీరియస్.. ఏపీలో రాష్ట్రపతి పాలన…వణుకుతున్న జగన్” రెండు రోజుల నుంచి ఇవే వార్తలు. వినలేక, చూడలేక చచ్చాం. కానీ తీరా అసలు విషయానికి వచ్చేసరికి….ఏదైనా గుప్పిట మూసేంత వరకే. చంద్రబాబు ఇప్పుడు ఆ గుప్పిట తెరిచేశారు. అందులో ఏమీ లేదని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం ముగిసింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారన్న ప్రశ్నలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. అసలు ఒక వ్యూహం లేకుండా ఢిల్లీ యాత్రను ప్లాన్ చేసుకోవడాన్ని చంద్రబాబు సన్నిహితులు సయితం నమ్మలేకపోతున్నారు. గతంలో చంద్రబాబుకు, ఇప్పటి బాబుకు చాలా తేడా ఉందని ఆయనను దగ్గరగా చూసిన వారు సయితం అభిప్రాయపడుతున్నారు.

ఫ్రస్టేషన్ తోనేనా?

చంద్రబాబు ఎప్పుడూ వేగంగా నిర్ణయాలు తీసుకోరు. అది అందరికీ తెలిసిన సత్యమే. ఏదైనా నాన్చి నాన్చి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఒక్కోసారి ఆలస్యంగా తీసుకున్న నిర్ణయాలు కూడా సక్సెస్ కావడంతో ఆయనను నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో సయితం తప్పుపట్టే ధైర్యం చేయరు. కానీ ఇటీవల కాలంలో చంద్రబాబులో ఫ్రస్టేషన్ పెరిగిందంటున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయత నుంచే నిర్ణయాలు వెలువడుతుండటంతో బూమ్ రాంగ్ అవుతున్నాయి.

రెండున్నరేళ్ల తర్వాత….

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి దాదాపు రెండున్నరేళ్లు అయింది. రెండున్నరేళ్ల తర్వాత ఢిల్లీకి వెళుతున్నారంటే ముందుగా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఒక ప్లాన్ లేకుండా బాబు ఢిల్లీ హడావిడిగా బయలుదేరి వెళ్లారు. కేవలం రాష్ట్రపతిని కలిశారు. 36 గంటల పాటు హోటల్ గదిలోనే నేతల అపాయింట్ మెంట్ల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు ఉత్తచేతులతో వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది. ఢిల్లీలో చక్రం తిప్పేవారని ఒకప్పుడు చంద్రబాబుకు పేరుండేది. కానీ ఇప్పుడు ఆయనను దేకేవారే లేరన్న ముద్రపడిపోయింది.

ఏదో చేస్తారనుకుని….

జగన్ మీద కోపం ఉండొచ్చు. రాష్ట్రంలో ఎన్ని దీక్షలైనా చేసుకోవచ్చు. ఎన్ని ఆందోళనలకు పిలుపు నివ్వవచ్చు. కానీ ఢిల్లీకి వెళ్లే నిర్ణయం చంద్రబాబు ఖచ్చితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమే. బీజేపీ నేతలు తన పట్ల ఇంకా సుముఖంగా లేరు. మోదీ, షాలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ప్రతి పనికీ ఆచి తూచి అన్ని మార్గాల్లో ప్రయత్నించే చంద్రబాబు ఈసారి మాత్రం ఢిల్లీకి వెళ్లి బిల్డప్ బాబాయ్ లాగా తిరిగి వచ్చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలసి జగన్ ను కట్టడి చేస్తారని టీడీపీ కిందిస్థాయి కార్యకర్త నుంచి నేతల వరకూ భావించారు. కానీ అది కుదరకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఇప్పటి వరకూ చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ పూర్తిగా ఢిల్లీ పర్యటనతో పోయింది.

Tags:    

Similar News