Chandrababu : ఇది కూడా పోతే ఇక ఇంతే సంగతులు

తెలుగుదేశం పార్టీకి వరస ఓటములు కుంగదీస్తున్నాయి. ఏ ఎన్నికలోనూ ఆ పార్టీకి విజయం లభించ లేదు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఏమాత్రం టీడీపీ ప్రభావం చూపలేకపోయింది. పరిషత్ [more]

Update: 2021-11-06 00:30 GMT

తెలుగుదేశం పార్టీకి వరస ఓటములు కుంగదీస్తున్నాయి. ఏ ఎన్నికలోనూ ఆ పార్టీకి విజయం లభించ లేదు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఏమాత్రం టీడీపీ ప్రభావం చూపలేకపోయింది. పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి భంగపడింది. బద్వేలు ఉప ఎన్నికలకు పోటీకి దూరంగా ఉంది. ఇక తాజాగా 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.

సవాల్ విసిరి మరీ….

ఈ ఎన్నికల్లో కనీస పనితీరు కనపర్చకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తలెత్తుకోలేరు. ఇప్పటి వరకూ దమ్ముంటే ఎన్నికలకు వెళదాం అని సవాల్ విసిరిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కనీస స్థానాలు గెలుచుకుని ప్రజలు తనవైపు చూస్తున్నారని చెప్పుకోవాల్సి ఉంటుంది. పన్నెండు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు మూడు ప్రాంతాల్లో జరుగుతుండటంతో దీనిని మినీ సమరంగానే చూడాల్సి ఉంటుంది.

భారీగానే నామినేషన్లు….

ఇన్నాళ్లూ నామినేషన్లు అడ్డుకున్నారని ఆరోపించిన చంద్రబాబుకు ఇప్పుడిక ఆ ఆరోపణ చేసే అవకాశం లేదు. అన్ని మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ లో లెక్కకు మించి నామినేషన్లు దాఖలయ్యాయి. కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ కంటే టీడీపీ అభ్యర్థులే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేయగలిగారు. దీంతో ఆ ఆరోపణకు ఇక విలువ లేకుండా పోయింది. అందుకే చంద్రబాబు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

నిధుల కొరత….

అయితే అన్ని చోట్లా టీడీపీ అభ్యర్థులకు నిధుల సమస్య తీవ్రంగా ఉంది. పార్టీ వైపు అభ్యర్థులు నిధుల కోసం చూస్తున్నారు. స్థానిక ఇన్ ఛార్జుల పైనే చంద్రబాబు భారం మోపారు. దీంతో వారు ఎంత వరకూ ఆర్థికంగా అభ్యర్థులకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతిరోజూ అన్ని జిల్లాల నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ ధైర్యం చెబుతున్నా అసలు విషయాన్ని దాటవేస్తున్నారంటున్నారు. మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనీస పనితీరును చంద్రబాబు కనపర్చకపోతే వైసీపీ మీద మరో కొత్త ఆరోపణను వెతుక్కోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News