అమరావతి మీద నమ్మకం పెరిగిందా ?

నిన్నటిలా నేడు ఉండదు, రేపు అసలు ఉండదు, ఎందుకంటే ఇది రాజకీయం, అందులో బోలెడు మలుపులూ పిలుపులూ ఉంటాయి. 2020 తొలి ఆరు నెలలూ చూసుకుంటే ఇంకెక్కడి [more]

Update: 2021-03-22 00:30 GMT

నిన్నటిలా నేడు ఉండదు, రేపు అసలు ఉండదు, ఎందుకంటే ఇది రాజకీయం, అందులో బోలెడు మలుపులూ పిలుపులూ ఉంటాయి. 2020 తొలి ఆరు నెలలూ చూసుకుంటే ఇంకెక్కడి అమరావతి అన్న మాటే అందరి నోటా వినిపించింది. మరో వైపు చలో విశాఖ అంటూ వైసీపీ శిబిరం హుషార్ చేసింది. ముహూర్తాలు మంచి రోజులూ అంటూ ఫ్యాన్ పార్టీలో సందడే సందడి. కానీ ఈ భూ ప్రపంచం మీద ఎవరూ కనీ వినీ ఎరగని మహమ్మారి కరోనా రూపంలో వచ్చింది. అక్కడే వైసీపీ మూడు రాజధానులకు బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయని చెప్పాలి.

క్యాలండర్ మింగేసింది….?

మొత్తానికి రెండు సార్లు శాసనసభలో తీర్మానం పెట్టి మరీ మూడు రాజధానుల బిల్లుని నెగ్గించుకున్న జగన్ కి ఆ ముచ్చట తీరనే లేదు. హై కోర్టులో సవాల్ చేసి మరీ అమరావతి రైతులు ప్రభుత్వానికి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టారు. ఆ విచారణ కొలిక్కి వస్తూండంగా హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి బదిలీ కావడంతో కొన్ని నెలలుగా ఆ కేసు విచారణ ఆగింది. ఇపుడు చూస్తే విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రూపంలో కొత్తగా అగ్గి పుట్టింది. దాంటో అటూ ఇటూ కూడా పెద్ద లాక్ పడిపోయింది.

ఎక్కడికీ పోదా…?

అమరావతి రాజధాని ఎక్కడికీ పోదు అంటున్నారు చంద్రబాబు. ఆయన సుదీర్ఘ కాలం తరువాత తాజాగా తుళ్ళూరు వచ్చి రైతు కుటుంబాలను పరామర్శించారు. అమరావతి రాజధాని గురించి ఈ మధ్య కనీసం నోటి వెంట ఒక్కమాటా మాట కూడా రాని చంద్రబాబు హఠాత్తుగా అమరావతిలో ప్రత్యక్షం కావడం అంటే రాజకీయంగా హాట్ టాపికే మరి. పైగా బాబు గొంతులో గతంలో ఎన్నడూ లేనంతగా ధీమా కనిపించింది. అమరావతి రైతులకు కూడా అన్యాయం జరగదు. వారితో జరిగిన ఒప్పందాన్ని ఏ ప్రభుత్వం అసలు మార్చడానికి వీలు లేదని కూడా బాబు చెప్పడం గమనార్హం.

అవన్నీ బూటకమే ..?

అమరావతిలో అన్ని కులాలూ, మతాలూ ఉన్నాయి. అయినా కూడా ఒకే కులమంటూ ప్రచారం చేశారు. అక్రమాలు, అవినీతి జరిగింది అని కూడా చెప్పుకొచ్చారు. కానీ రెండేళ్ల తరువాత చూస్తే ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు. జగన్ మాటలు మంచులా కరిగిపోయాయని కూడా బాబు అంటున్నారు. అమరావతి రాజధానిని ఎవరూ ఎక్కడికీ మార్చలేరని, ఏపీకి ఇదే శాశ్వత రాజధానిగా చిరకాలం వర్ధిల్లుతుందని కూడా చంద్రబాబు గట్టిగానే చెప్పారు. మొత్తానికి రాజకీయ గండరగండడు అయినా బాబుకు ఏపీలో జరుగుతున్న పరిణామాలు, జరగబోయే పరిణామాలూ కూడా అంతా అంచనాకు అందుతున్నాయి అనిపిస్తోంది. లేకపోతే బాబు ఇంత ధీమాగా ఈ మధ్యకాలంలో ఎపుడూ మాట్లాడలేదని అంటున్నారు. ఏది ఏమైనా అమరావతే రాజధాని అని బాబు మళ్ళీ పెద్ద గొంతు చేయడంతో ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News