ఆగ్రహం….అసహనం….??

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయిన దగ్గర నుంచే ఆయన అనేక అనుమానాలను లేవనెత్తారు. ఉండవల్లిలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన [more]

Update: 2019-04-11 05:06 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయిన దగ్గర నుంచే ఆయన అనేక అనుమానాలను లేవనెత్తారు. ఉండవల్లిలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన చంద్రబాబునాయుడు ఈవీఎంల మొరాయింపుపై ధ్వజమెత్తారు. తాను తొలినుంచి ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అందుకే సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇప్పటికీ బ్యాలట్ పద్ధతిని వినియోగిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు తాజాగా రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి కూడా లేఖరాశారు.

టీడీపీ బలంగా ఉన్న చోటనే….

తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈవీఎంలు పనిచేయడం లేదన్నది చంద్రబాబు అనుమానం. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో తమ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఈవీఎంలు ఎందుకు మొరాయిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా అనేక ఈవీఎంలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు పడుతుందని కూడా తనకు ఫిర్యాదులందుతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. అందుకే ఈవీఎంలు పనిచేయని కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పోలింగ్ తీరుపై పూర్తిగా అసహనంతో ఉన్నట్లు కన్పిస్తోంది.

సక్రమంగానే ఉందన్న…..

అయితే ఈవీఎంలు సక్రమంగానే పనిచేస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది స్పష్టం చేశారు. చాలా తక్కువ కేంద్రాల్లోనే ఈసమస్య తలెత్తిందని, అయితే వెంటనే తమ ఇంజినీర్లు వాటిని పరిష్కరించగలిగారని ద్వివేదీ చెప్పారు. ఎక్కడా ఒక పార్టీకి ఓటు వేస్తే మరొక పార్టీకి పడినట్లు తమకు ఫిర్యాదులు రాలేదన్నారు. ఈ ప్రచారాలను నమ్మవద్దని ద్వివేది కోరారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో జరుగుతన్న ఎన్నికల్లో అనేక చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించినా వాటిని తిరిగి పునరుద్ధరించామని అధికారులు తెలుపుతున్నారు. చంద్రబాబు మాత్రం ఈవీఎంల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News