బాబు అసలు భయం ఇదే

పోలవరం ఆంధ్రప్రదేశ్ వాసుల దశాబ్దాల కల. 1941 నుంచి ఆ డ్రీమ్ నేతల మాటల్లో తప్ప కార్యాచరణలో కానరాలేదన్నది పచ్చి నిజం. ఇక అంజయ్య ముఖ్యమంత్రి గా [more]

Update: 2019-08-02 05:00 GMT

పోలవరం ఆంధ్రప్రదేశ్ వాసుల దశాబ్దాల కల. 1941 నుంచి ఆ డ్రీమ్ నేతల మాటల్లో తప్ప కార్యాచరణలో కానరాలేదన్నది పచ్చి నిజం. ఇక అంజయ్య ముఖ్యమంత్రి గా ఒక పునాది రాయి వేసి వదిలేశారే కానీ పని చేసింది శూన్యమే. ఇక విపక్ష నేతగా వైఎస్సాఆర్ పాదయాత్రలో గోదావరి పక్కనే వున్నా నోళ్ళు వెళ్ళబెట్టి బీడుబారిన మెట్టప్రాంత భూములు దగ్గరుండి చూశారు. గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలు, ఉత్తరాంధ్ర కు ముఖ్యంగా మహానగరం విశాఖకు నీటికష్టాలు తెలుసుకున్నారు. కృష్ణా లో ఏర్పడ్డ నీటి కొరత ముందే ఆయనకు తెలుసు. వీటన్నిటికి ఏకైక పరిష్కారం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడమే అని తలిచారు. అంతే అసాధ్యమనుకున్న ప్రాజెక్ట్ కి ఎలాంటి అనుమతులు లేకుండానే, విపక్షాల ఆందోళనల నడుమ తాను ముఖ్యమంత్రి కాగానే శ్రీకారం చుట్టారు.

అడుగడుగునా అడ్డంకులు …

ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ ముందుకు సాగకుండా అడుగడుగునా కోర్ట్ ల్లో కేసులు వీటిని ఎదుర్కొంటూనే ఒక్కో అనుమతి సాధిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుకు సాగిపోయారు. అన్ని అనుమతులు కేంద్రం నుంచి వచ్చే దశలో ఆయన అకాల మరణంతో పోలవరం ప్రాజెక్ట్ కి గ్రహణం పట్టింది. ఆ తరువాత ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల ప్రాధాన్యత పోలవరం కాకుండా పోయింది. దీనికి తోడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తో పోలవరం ఊసే లేకుండా పోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ ను తెలంగాణ కు అప్పగిస్తూ ఎపికి పోలవరాన్ని వరం గా జాతీయ ప్రాజెక్ట్ గా యుపిఎ సర్కార్ ప్రకటించింది. ఆ తరువాత టిడిపి సర్కార్ ఎపి లో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ రావడం జరిగిపోయాయి. అయితే ఈ రెండు ప్రభుత్వాల సారధ్యంలో ఐదేళ్లల్లో పూర్తి కావలిసిన పోలవం ప్రాజెక్ట్ టిడిపి సర్కార్ అలసత్వం తో రెండేళ్ళు వృధాగా పోయింది. ఇక 2017 లో మాత్రం పాత కాంట్రాక్టర్ ట్రాన్స్ స్ట్రాయి ని తప్పించి పోలవరం ప్రాజెక్ట్ పనులను నామినేషన్ పై నవయుగకు అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం.

నిపుణుల కమిటీ నివేదిక లో …

పోలవరం ప్రాజెక్ట్ పై వైఎస్ జగన్ సర్కార్ వచ్చాక నీటిపారుదల నిపుణులు తో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని కోరింది. ఈ నివేదికలో అడుగడుగునా ఈపిసి నిబంధనలు ఉల్లంఘించి ప్రధాన కాంట్రాక్టర్ నుంచి సబ్ కాంట్రాక్టర్ గా నవయుగ కు రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్ ఇవ్వడం దారుణమని పేర్కొంది. సుమారు 2914 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ప్రధాన పనులు, జలవిద్యుత్ ప్రాజెక్ట్ పనులను అప్పగించేయడాన్ని ప్రశ్నించింది. దానిపై జగన్ సర్కార్ వెంటనే చర్యలకు దిగింది. పోలవరం పై నవయుగను తప్పించాలన్న సంచలన నిర్ణయం తీసుకుంది. పనులు వేగవంతం చేసేందుకు రివర్స్ టెండరింగ్ లో కొత్త కాంట్రాక్టర్ కి అప్పగించాలని ముందుకు పోతుంది. ఇప్పటికే నవయుగ కు బాధ్యతలనుంచి తప్పుకుని 15 రోజుల్లో అకౌంట్ సెటిల్ చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే పోలవరం అధారిటీ కానీ, కేంద్ర జలవనరుల శాఖ ప్రమేయం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పై తెలుగుదేశం మండిపడుతుంది. జగన్ అనుభవలేమితో పోలవరాన్ని కలగా మిగిల్చేస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

పద్ధతి ప్రకారమే వెళతారా …?

ఎపి సిఎం జగన్ తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం ను తన హయాంలోపు పూర్తి చేయాలన్న సంకల్పంతో వున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం అభిప్రాయాలను ఈనెల ప్రధాని తో కూడా జగన్ చర్చించనున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. పోలవరం పై పూర్తి పారదర్శకంగా వెళ్లాలనే జగన్ ఈ చర్యలు తీసుకున్నారని అడ్డగోలు అవినీతి జరిగిన విధానాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరోపక్క జగన్ సర్కార్ తీసుకున్న ఈ చర్యలు తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళానికి తెరతీసింది. తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన కాంట్రాక్ట్ లపై ఇదే విధానం లో వైసీపీ వెళితే అవి దక్కించుకున్న పాత గుత్తేదారులతో తమకు వచ్చే తలనొప్పులు ఎలా వుండబోతాయన్నది చంద్రబాబు ఆందోళనకు ప్రధాన కారణం గా తెలుస్తుంది. ఇదిలావుంటే నవయుగ పోలవరం కాంట్రాక్ట్ నుంచి మౌనంగా తప్పుకుంటుందా లేక న్యాయస్థానం ను ఆశ్రయిస్తుందా అన్నది వేచి చూడాలి. అలాగే జగన్ సర్కార్ పోలవరం పనులు ఎలా వేగవంతంగా చేస్తుంది అన్నది ఆసక్తికరం అయ్యింది.

Tags:    

Similar News