క్యాపిటల్ వర్సస్ క్యాస్ట్

ఆంధ్రప్రదేశ్ లో పాలన, రాజకీయపరమైన వివాదాలు ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఒకే వేదికపైకి రావడానికి, ఆందోళనలకు ఊతమిస్తున్నాయి. సర్కారు మారడంతో అజెండా మారింది. [more]

Update: 2019-08-27 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో పాలన, రాజకీయపరమైన వివాదాలు ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఒకే వేదికపైకి రావడానికి, ఆందోళనలకు ఊతమిస్తున్నాయి. సర్కారు మారడంతో అజెండా మారింది. విధివిధానాల్లో మార్పులొచ్చాయి. సుదీర్ఘ ప్రణాళికతో ముడిపడిన విషయాలకు ప్రభుత్వాల మార్పిడితో సంబంధం ఉండకూడదు. అవి అలా ముందుకు సాగిపోతూ ఉండాలి. బాగా వైరుద్ధ్యాలు ఉన్న విషయాల్లో నూతన సర్కారు తీవ్ర నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. రివర్స్ గేర్ లో గత ప్రభుత్వ విధానాలను తిరగదోడేందుకు సైతం వీలుంటుంది. ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి యంత్రాంగం పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ రాజకీయంగా వ్యతిరేకత తలెత్తుతుంది. ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రజల మూడ్ తెలుసుకునేందుకు ప్రభుత్వాలు సూచన ప్రాయంగా తమ అభిప్రాయాలను లీకేజీల రూపంలో వెల్లడిస్తుంటాయి. ప్రత్యర్థి పార్టీలను పక్కన పెట్టినా ప్రజల స్పందన ప్రభుత్వానికి చాలా అవసరం. అందుకే వారి ఒపీనియన్ ను అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో కీలకమైన విషయాల్లో కొనసాగుతున్న గందరగోళం ప్రజాభిప్రాయాన్ని అనిశ్చితిలో పడేస్తోంది.

సంఘ మర్యాదకు చెల్లు చీటి…

ఆంధ్రప్రదేశ్ లో కులం తోసిపుచ్చలేని నిజం. రాజకీయాల్లో ప్రధాన పార్టీలకు కొన్ని కులాలు అండగా మారిపోయాయి. అధినేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న కులాల్లో మెజార్టీ ప్రజలు ఆయా పార్టీలకే మద్దతు పలుకుతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. హైదరాబాద్, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగుళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ కులం ప్రాధాన్యం పెద్దగా కనిపించదు. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కాస్మాపాలిటిన్ నగరాలలో రాజకీయంగా కుల ముద్ర పెద్దగా చర్చనీయాంశంగా ఉండదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే రాజధానిని ఏర్పాటు చేసుకుంటోంది. రాజధాని అమరావతి శైశవ దశలోనే ఉంది. ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ఏపీ ఇంకా గ్రామీణ పునాదులపై ఆధారపడిన సామాజిక సమీకరణలతోనే కొనసాగుతోంది. కృష్ణా,గుంటూరు జిల్ల్లాల్లో ఆర్థికంగా, భూముల పరంగా ఒక సామాజిక వర్గం సాంఘికంగా డామినేట్ చేస్తోంది. అదేవిధంగా ఉభయగోదావరి జిల్లాల్లో మరొక సామాజిక వర్గం జనాభారీత్యా ప్రభావశీలంగా ఉంది. రాయలసీమలోని జిల్లాల్లో ఇంకో సామాజిక వర్గానిదే రాజకీయ,ఆర్థిక ఆధిపత్యం. ఉత్తరాంధ్రలో వెనకబడిన తరగతులు రాజకీయ ప్రాబల్యంలో ముందంజ వేస్తున్నాయి. అయితే ఆయా కులాల ముద్రతో పూర్తిగా రాజకీయాలు నడపటం నష్టదాయకం. రాజధాని అమరావతి అన్ని ప్రాంతాలకు , వర్గాలకు సంబంధించిన కూడలిగా విరాజిల్లాలి. ఎంపికలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, అప్పటి పాలక పార్టీ టీడీపీకి పూర్తిగా సహకరించిన అధినేత సామాజిక వర్గం ఇప్పుడు కేపిటల్ కు కష్టాలు తెచ్చిపెడుతోంది. మంత్రి స్థాయిలోనే కుల ప్రాధాన్యాన్ని బట్టే రాజధానిని ఎంపిక చేశారని వ్యాఖ్యలు చేయడంతో క్యాపిటల్ వర్సస్ క్యాస్ట్ గా మారిపోయింది పరిస్థితి.

సర్కారు యోచనే…

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగానే రాజధాని చర్చను లేవనెత్తిందని చెప్పాలి. సీనియర్ , పురపాలక శాఖకు బాధ్యుడైన బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారంటే దానిని అధికారికం అనే చెప్పాలి. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్న సందర్భంలో , వరదలను కూడా దృష్టిలో పెట్టుకుని సూచనాత్మకంగా అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది కాదని ఆయన ప్రకటించారు. ఇది అధికారికమా? కాదా? అని విపక్షాలు, మీడియా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. తాను తొలుత చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానంటూనే రాజధాని అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. పైపెచ్చు ఒక కులానికి ఉండే ఆధిపత్యాన్ని అనుసరించే ఇక్కడ కేపిటల్ నిర్ణయించారన్న వ్యాఖ్య అత్యంత కీలకమైనది. భవిష్యత్తులో రాజధానిని మార్చినా, లేకపోతే విస్తృత నగరంగా కాకుండా పరిమిత పాలన కేంద్రంగానే ఉంచినా ప్రజల నుంచి వ్యతిరేకత ప్రబలకుండా ఉండేందుకే మంత్రి వ్యాఖ్యానించారనుకోవాలి. రాజకీయ పార్టీలు ప్రభుత్వం పై దాడి చేసేందుకు రాజధాని అంశాన్ని కేంద్రంగా చేసుకుంటూ ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. కేపిటల్ వర్సస్ క్యాస్ట్ అన్న రీతిలో ఒక కులముద్ర వేయడంతో సహజంగానే ఇతర వర్గాల ప్రజల నుంచి రాజకీయ పార్టీలకు తగినంత మద్దతు లభించదనే ఎత్తుగడ కనిపిస్తుంది.

ప్రాంతీయ గందరగోళాలు…

ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు మొదలైన రాజకీయ రాజధాని రగడ ఆయన రాష్ట్రానికి వచ్చి మూడు రోజులైనా కొనసాగుతూనే ఉంది. అటు బీజేపీ నుంచి ఇటు వామపక్షాల వరకూ అన్నిపార్టీలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ వచ్చిన వెంటనే విషయాన్ని తేల్చేస్తారని అందరూ భావించారు. కానీ సర్కారు రాజధాని అమరావతిపై సాధ్యమైనంత చర్చ జరగాలనే కోరుకుంటోంది. ముంపు ప్రాంతం, కుల సమీకరణ, అభివ్రుద్ధి ఒక చోటనే కేంద్రీకృతం కావడం వంటి తమ వాదనలు ప్రజల్లోకి వెళ్లాలనే ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకనే దీనిపై సీఎం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆ కోణంలో చూస్తే మంత్రి బొత్స ప్రకటనతో ప్రభుత్వాధినేత విభేదించడం లేదని అర్థమవుతుంది. అంటే పార్టీలో, ప్రభుత్వంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగిన తర్వాతనే వరద సందర్బంలో ప్రజల ముందుకు విషయాన్ని తెచ్చారని భావించాలి. అయితే ఇప్పుడు రాజధాని అమరావతి స్టేటస్ ఏమిటనేది ఒక చర్చ అయితే వికేంద్రీకరణ చేస్తే తమ ప్రాంతాలకే రాజధాని రావాలనే డిమాండ్లు కొత్తగా వచ్చిపడుతున్నాయి. రాజధానిని వికేంద్రీకరించి తమతమ ప్రాంతాల్లో విభాగాలను, శాఖలను ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్లు మొదలుపెడుతున్నారు. సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వైసీపీ సర్కారు వచ్చిన తొలినాళ్లలోనే మంచి పేరు తెచ్చుకుంది. ప్రజల్లో ఆ పథకాల ఫలితాలపై చర్చ సాగితే ప్రభుత్వానికి మేలు. కానీ ఆ స్థానంలో ఇప్పుడు వివాదాస్పద అంశాలపై చర్చ సాగడమన్నది ప్రభుత్వానికి ఏరకంగానూ ప్రయోజనకరం కాదు.

 

 

ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News