ఈ స్కీమ్ తో సీఎం మళ్లీ అయిపోతారా…?

ఏపీ ప్ర‌జ‌ల‌కు తాయిలాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. వ‌రాల జ‌ల్లుల్లో త‌డిసి ముద్ద‌య్యేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వు తోంది. త‌న అమ్ముల పొదిలో దాచిన అస్త్రాల‌ను ఓట‌ర్ల‌పై సంధించేందుకు అప‌ర చాణ‌క్యుడు [more]

Update: 2019-01-26 11:00 GMT

ఏపీ ప్ర‌జ‌ల‌కు తాయిలాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. వ‌రాల జ‌ల్లుల్లో త‌డిసి ముద్ద‌య్యేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వు తోంది. త‌న అమ్ముల పొదిలో దాచిన అస్త్రాల‌ను ఓట‌ర్ల‌పై సంధించేందుకు అప‌ర చాణ‌క్యుడు సిద్ధ‌మ‌వుతున్నారు. త‌న 40 ఏళ్ల అనుభ‌వాన్నంతా రంగ‌రించి.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు అవ‌స‌ర‌మైన కానుక‌లను రెడీ చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ఒక్కొక్క‌టిగా వ‌రాలు ప్ర‌క‌టిస్తూ.. అన్ని వ‌ర్గాల‌ను మ‌ళ్లీ సైకిలెక్కించేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సైకిలెక్కిన ఓట‌ర్లు మ‌ధ్య‌లో దిగిపోకుండా.. 2019లోనూ త‌నను విజ‌య‌తీరాల‌కు చేర్చే వ‌ర‌కూ సైకిల్ మీదే ఉంచేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు హామీల‌నే న‌మ్ముకున్నారు. ఒక దాని వెంట మ‌రోటి.. ప్ర‌క‌టించేస్తున్నారు. నాలుగేళ్లుగా మూల‌న ప‌డేసిన ఫైళ్ల బూజు దులిపేస్తున్నారు. హ‌డావుడిగా నిబంధ‌న‌లు అమ‌లు చేసేస్తున్నారు. మ‌ళ్లీ త‌నపై న‌మ్మ‌కం క‌లిగేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

నిరుద్యోగ భృతి కూడా….

ఎన్నిక‌లకు ఆరు నెల‌ల ముందు నిరుద్యోగ భృతి ఉత్త‌ర్వులు విడుద‌లైపోయాయి. ఎన్నిక‌లకు నాలుగు నెల‌ల ముందు పింఛ‌ను 'రెట్టింపు' చేస్తున్న‌ట్లు కీల‌క ప్ర‌క‌ట‌న‌. ఇక మ‌రో 75 రోజుల్లో పోరు అన‌గా.. 'రైతు ర‌క్ష‌'.. ఇలా ఎన్నిక‌ల ఏడాదిలో చంద్ర‌బాబు కురిపిస్తున్న వ‌రాల్లో ఇవి కొన్ని మాత్ర‌మే! నాలుగేళ్లుగా నిరుద్యోగ భృతిని నాన్చుతూ వ‌చ్చి చివ‌ర‌కు.. హ‌డావుడిగా నిబంధ‌న‌లు రూపొందించి.. అనేక కోత‌లు విధించి స‌గం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక పింఛ‌నుదీ ఇదే తంతు. కొత్త‌గా ప్ర‌వేశపెట్టిన రైతు ర‌క్ష‌లోనూ అదే తీరు. రైతుకు రూ.10వేలు ఇస్తామంటూ తీపి క‌బురు చెప్పారు. అయితే ఇవ‌న్నీ ఎన్నిక‌ల స్టంటేనా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. హామీల‌తో ప్ర‌జ‌ల‌ను బుట్ట‌లో వేసుకోవ‌డంలో చంద్ర‌బాబును మించిన వారు లేర‌నే అభిప్రాయం బ‌లంగానే వినిపిస్తుంది. గ‌తంలో ఇచ్చిన ఎన్నో హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ఆయ‌న బొక్క‌బోర్లా ప‌డ్డారనే విమ‌ర్శ‌లూ ఉన్నాయి.

ఎర్రచందనం అమ్మి…..

'ఏపీలో ఎర్రచందనం అమ్మేస్తే లక్షల కోట్లు వస్తాయి. వాటితో రైతు రుణ మాఫీ చేసేస్తాను' అని ఆర్భాటంగా ప్రకటించారు. రైతు రుణమాఫీ అలా అయిపోతుందంటూ అప్పట్లో సవాల్ విసిరారు. చంద్రబాబు పాలన మరో మూడు.. నాలుగు నెలల్లో ఐదేళ్లు పూర్తి చేసుకోనుంది. కానీ ఇప్పటికీ రుణమాఫీ పూర్తి కాలేదు. ఆర్థిక లోటులో ఉన్నా 24 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఇదే రికార్డు అని చంద్రబాబు చెబుతున్నారు. ఏపీ ఆర్థిక లోటులో ఉందని, కష్టాల్లో ఉందని ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలియదా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యం తెలిసినా.. ఎన్నికల్లో గెలవాలంటే ఏదో ఒకటి చెప్పి ప్రజలను మ‌భ్య‌పెట్టాలి క‌దా.. అదే చేశారు. గెలిచేశారు. మళ్లీ ఇప్పుడు అదే బాటను ఎంచుకున్నారు చంద్రబాబు.

పాలనచివరలో….

నిరుద్యోగ భృతి హామీని కూడా కుదించి కుదించి పాలన చివరి ఏడాదిలో తీసుకొచ్చారు. అన్న క్యాంటీన్లదీ అదే వరస. ఇప్పుడు రైతుల కోసం 'రైతు రక్ష' అంటూ కొత్త స్కీమ్ ప్రవేశపెట్టబోతున్నారు. అధికారంలో ఉన్న ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ స్కీమ్ లు ఎందుకు అమలు చేయలేకపోయారు? పెన్షన్ లు ఇప్పుడే ఎందుకు పెంచారు? అంటే కారణం అని ఎన్నికలే అని అంటున్నారు విశ్లేష‌కులు. మరోసారి చంద్రబాబు 'ఎన్నికల స్కీమ్'లతో రెడీ అయిపోతున్నారు. మరి ఈ సారి ఆయన హామీలు ఫలిస్తాయా? లేదో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News