మార్పు మంచికేనా….?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులో మార్పు వచ్చిందా…? తాను గతంలో చేసిన తప్పుులను ఆయన సరిచేసుకుంటున్నారా…? ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమి [more]

Update: 2019-07-04 15:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులో మార్పు వచ్చిందా…? తాను గతంలో చేసిన తప్పుులను ఆయన సరిచేసుకుంటున్నారా…? ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమి ఆయనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందనే చెప్పాలి. సంక్షేమ పథకాలు, నిరంతరం కష్టపడటం వంటివి ఎన్నికల్లో కలసి రావని ఆయన గుర్తించారు. కార్యకర్తలు ఏమాత్రం నీరసించినా ఓటమి తప్పదన్నది ఆయనకు గత ఎన్నికలు చెప్పాయి. దీంతో ఆయన తన వైఖరిలో మార్పు తెచ్చుకుంటున్నారంటున్నారు.

పార్టీకి అధిక సమయం…..

2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబునాయుడు పార్టీకి పెద్దగా అందుబాటులో లేరు. కొంతమందికే పార్టీ బాధ్యతలను అప్పగించిన ఆయన పార్టీ వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. మహానాడు లాంటి కార్యక్రమాలు తప్పించి గత ఐదేళ్లలో ఆయన కార్యకర్తలను కలుసుకుంది లేదు. అందుకే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ఆయనకు అర్థం కాకుండా పోయింది. కేవలం అధికారుల మీద ఆధారపడటంతో వారు చెప్పే కాకి లెక్కలను నమ్మేసి ఆల్ ఈజ్ వెల్ అని భావించారు. కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న కార్యకర్తల సమావేశాల్లో చంద్రబాబుకు అసలు విషయం అర్థమయింది.

కిందిస్థాయి నేతలతో…..

అందుకే ఇక ఆయన వారంలో ఐదు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడటమే కాకుండా ఇటీవల జరిగిన దాడుల్లో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాల్లో భరోసా నింపే ప్రయత్నాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. పరామర్శ యాత్ర పేరిట ఆయన గ్రామాల్లో పర్యటించనున్నారు. కేవలం నియోజకవర్గ ఇన్ ఛార్జులను, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో మాత్రమే కాకుండా ద్వితీయ శ్రేణి నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి తనకు స్పష్టంగా తెలుస్తుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

సూటిగా.. స్పష్టంగా….

ఇక గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడును దెబ్బతీసింది ఆయన ప్రసంగాలే. ఇది కూడా ఆయన గుర్తించినట్లుంది. గంటల కొద్దీ ప్రసంగించడం, చెప్పిందే చెప్పడంతో కార్యకర్తలు కూడా చంద్రబాబునాయుడు ప్రసంగాలను పెద్దగా పట్టించుకోలేదని ఆయన గుర్తించారు. అందుకోసమే గత కొద్దిరోజులుగా చంద్రబాబునాయుడు కార్యకర్తల సమావేశాల్లో కాని, ఇతర ముఖ్యనేతలతో భేటీలో కాని సూటిగా, క్లుప్తంగా మాట్లాడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబునాయుడులో వచ్చిన ఈ మార్పుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు తెగ సంతోష పడుతున్నారు.

Tags:    

Similar News