చంద్రగిరి.. ఏమిటీ కిరికిరి..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీట్లను చూసుకుంటే ముందుంటుంది చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామంలో నారావారిపల్లి ఉన్నది ఈ నియోజకవర్గంలోనే. చంద్రబాబు [more]

Update: 2019-05-19 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీట్లను చూసుకుంటే ముందుంటుంది చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామంలో నారావారిపల్లి ఉన్నది ఈ నియోజకవర్గంలోనే. చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. 1978లో మొదటిసారి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. తర్వాతి ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి ఓడిపోవడంతో కుప్పం నియోజకవర్గానికి మారారు. అప్పటి నుంచి చంద్రగిరి ఫలితాలు ఎక్కువగా చంద్రబాబుకు మింగుడు పడకుండానే వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నాక ఒక్కసారి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించకపోవడం ఆయనకు ఇబ్బందిగా మారింది. దీంతో ఈ ఎన్నికల్లో కచ్చితంగా తన స్వంత నియోజకవర్గం చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు.

కోట్లు వెదజల్లిన అభ్యర్థులు

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 4,518 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న చెవిరెడ్డి మరోసారి గెలిచే అవకాశం ఉందనే అంచనాలు మొదట్లో ఉన్నాయి. గల్లా అరుణకుమారి సైతం ఈసారి పోటీ చేయలేనని చెప్పడంతో చంద్రబాబు నాయుడు చంద్రగిరి అభ్యర్థిగా రెండేళ్ల క్రితమే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పులివర్తి నానిని ఖరారు చేశారు. దీంతో చంద్రగిరిలో సీన్ మారిపోయింది. పులివర్తి నాని రెండేళ్లుగా నిత్యం ప్రజల్లో ఉంటూ అన్ని గ్రామాల్లో తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో చెవిరెడ్డి సైతం తన బలం తగ్గకుండా చూసుకున్నారు. దీంతో ఏడాది ముందునుంచే చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల ఫీవర్ నడిచింది. ఇద్దరు నేతలూ ఏడాదిగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఎన్నికల్లోనూ ఇద్దరూ పోటీపడి మరీ డబ్బులు పంచారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది. ఎవరు గెలిచినా అతి స్వల్ప మెజారిటీనే ఉండే అవకాశం ఉంది.

ఈ ఏడు బూత్ లు కీలకమే…

ఎన్నికలు ముగిశాక కూడా నియోజకవర్గంలో రాజకీయవేడి తగ్గలేదు. ఇదిలా ఉండగా ఎన్నికలు జరిగిన నెల తర్వాత నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం తెలుగుదేశం పార్టీకి మింగుడు పడటం లేదు. ఈ ఐదు గ్రామాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లా ఉంటాయి. గత ఎన్నికల్లో ఈ ఐదు గ్రామాల్లో ఏకపక్షంగా టీడీపీకి అండగా ఉన్నాయి. 90 శాతానికి పైగా ఓట్లు టీడీపీకే పడ్డాయి. అసలు పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రతీ ఓటూ కీలకంగా రెండు పార్టీలు భావిస్తున్న సమయంలో టీడీపీకి పట్టున్న గ్రామాల్లో రీపోలింగ్ జరపాలనుకోవడం వారు జీర్ణించుకోలేకపోయారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు సైతం వెళ్లారు. అయినా ఈసీ ఈ ఐదు గ్రామాలతో పాటు మరో రెండు వైసీపీకి పట్టున్న గ్రామాల్లోనూ రీపోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇవాళ ఏడు బూత్ లలో రీపోలింగ్ జరుగుతోంది. ఈ ఏడు పోలింగ్ బూత్ ల ఓట్లు చంద్రగిరి నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉంది. దీంతో అందరి చూపూ చంద్రగిరి వైపు ఉంది. మరి, ఈసారైనా ఇక్కడ టీడీపీ గెలిసి చంద్రబాబు కల నెరవేరుతుందో లేదా మళ్లీ వైసీపీ గెలుస్తుందో చూడాలి.

Tags:    

Similar News