చంద్రయాన్ టూ కు చివరి గంటలో

భారత ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 మరో గంటలో నింగిలోకి దూసుకు వెళ్లే సమయంలో బ్రేక్ పడింది. చంద్రయాన్ కు 56 నిమిషాల 24 సెకన్ల కౌంట్ డౌన్ [more]

Update: 2019-07-15 02:13 GMT

భారత ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 మరో గంటలో నింగిలోకి దూసుకు వెళ్లే సమయంలో బ్రేక్ పడింది. చంద్రయాన్ కు 56 నిమిషాల 24 సెకన్ల కౌంట్ డౌన్ చేరగానే ప్రయోగాన్ని ఆకస్మికంగా నిలిపివేసింది ఇస్రో. లాంచ్ ప్యాడ్ లో లోపాన్ని గుర్తించడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. తిరిగి ప్రయోగం ఎప్పుడన్నది ప్రకటిస్తామని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్ ప్రయోగానికి ముందు 19 గంటల 4 నిమిషాల 36 సెకన్ల పాటు కౌంట్ డౌన్ సాగింది.

స్వయంగా తిలకించాలని ….

తొలిసారి పదివేలమందికి నేరుగా చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఇస్రో అవకాశం కల్పించింది. భారత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ సైతం శాటిలైట్ ప్రయోగాన్ని తిలకించాలని శ్రీహరికోట చేరుకున్నారు. అయితే గంట ముందు సాంకేతిక లోపం గుర్తించడంతో ప్రయోగం నిలిచిపోవడంతో అంతా నిరాశపడ్డారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో తలపెట్టిన ఈ ప్రయోగం గత ఏడాదిగా వాయిదా పడుతూ వస్తుంది.

ముందుగా గుర్తించి…..

ఎట్టకేలకు ముహూర్తం కుదిరి చందమామ రహస్యాలు ఛేదించే ప్రయోగం సాకారం అవుతున్న దశలో ఇలా జరగడం పట్ల శాస్త్రవేత్తలు సైతం అప్ సెట్ అయ్యారు. అయితే ప్రయోగం జరిగాకా విఫలం అయ్యే కన్నా ముందుగా లోపం గుర్తించడం వల్ల మంచే జరిగిందని ఇప్పుడు సాంకేతిక లోపాలు అధిగమించి విజయవంతంగా చంద్రుడిపైకి శాటిలైట్ పంపిస్తామని ధీమాగా చెబుతుంది ఇస్రో. ఇప్పటికే ఈ ప్రయోగం సఫలం కావాలని ఇస్రో తిరుమల సహా అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించింది. ఆధునిక విజ్ఞానానికి దైవబలం తోడు కావాలని ఇస్రో ప్రయోగాలకు ముందు ఇలా పూజలు చేస్తూ రావడం సంప్రదాయంగా మారింది.

Tags:    

Similar News