వ‌చ్చాడ‌య్యో… జోగ‌య్య.. చెవిలో జోరీగ‌..!

ఆయ‌న వృద్ధ నేత‌. నాలుగు మాట‌లు మాట్లాడితే ఎక్కువ‌. రెండు మాట‌లు మాట్లాడితే.. తక్కువ‌నే రాజ‌కీయాలు చేసిన‌.. మాజీ ఎంపీ చేగొండి హ‌రిరామ జోగయ్య గురించి అంద‌రికీ [more]

Update: 2020-08-13 14:30 GMT

ఆయ‌న వృద్ధ నేత‌. నాలుగు మాట‌లు మాట్లాడితే ఎక్కువ‌. రెండు మాట‌లు మాట్లాడితే.. తక్కువ‌నే రాజ‌కీయాలు చేసిన‌.. మాజీ ఎంపీ చేగొండి హ‌రిరామ జోగయ్య గురించి అంద‌రికీ తెలిసిన విష‌యమే. అప్పుడెప్పుడో.. ముగిసిన రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా ఎదిగిన ఆయ‌న త‌ర్వాత అనేక కండువాలు మార్చారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కానీ, త‌న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, పోనీ.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని ముందుకు దూకిన‌ప్పుడు కానీ, ఆయ‌న కాపుల గురించి గుర్తులేదు. కాపుల సంక్షేమం గురించిన ఆలోచ‌న కూడా లేదు. కానీ, ఇప్పుడు వృద్ధుడై పోయిన త‌ర్వాత మాత్రం హ‌రిరామ జోగయ్యకి కాపులు గుర్తుకు వ‌చ్చారు. కాపుల‌కు అన్యాయం జ‌రిగిపోతోంద‌ని, కాపుల సంక్షేమానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని పేర్కొంటూ.. ప‌డుతూ లేస్తూ కాపు సంక్షేమ సేన అంటూ ఓ ఉద్యమ పార్టీని స్థాపించారు.

రాజకీయ అవసరాల కోసం…

నిజ‌మే.. ఎవ‌రో ఒక‌రు ఉద్యమ బాట‌లో న‌డిచి ముందుకు సాగాల్సిందే.. కాపుల‌కు అనుకున్నదేదో జ‌ర‌గాల్సిందే. కానీ, ఎవ‌రు ఉద్యమంలోకి వ‌చ్చినా.. అనుమానించాల్సిన అవ‌స‌రం ప్రస్తుత రాజ‌కీయాల్లో ఏర్పడింది. అందుకే హ‌రిరామ జోగయ్యని కూడా అనుమానించాల్సిన అగ‌త్యం ఏర్పడింద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. వాస్తవానికి కాపుల‌కు జోగయ్య చేసిందేమి లేదు. ఆయ‌న త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ప‌దే పదే పార్టీలు మారుతూ వ‌చ్చారు. టీడీపీతో ప్రారంభ‌మైన ఆయ‌న రాజ‌కీయ ప్రస్థానం ఆ త‌ర్వాత కాంగ్రెస్ వైపు తిరిగేలా చేసింది. కాంగ్రెస్‌లో జోగ‌య్య మ‌రుగున ప‌డిపోయిన టైంలో 2004 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైఎస్ పిలిచి మ‌రీ న‌ర‌సాపురం ఎంపీ సీటు ఇవ్వగా.. ఆ గాలిలో ఆయ‌న ఎంపీగా గెలిచారు.

చిరు ఓటమికి…..

అనంత‌ర కాలంలో వైఎస్‌తో తీవ్రంగా విబేధించి 2009 ఎన్నిక‌ల‌కు ముందు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. చిరంజీవిని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ పాల‌కొల్లులో పోటీ చేయించినా ఓడిపోయారు. చిరు ఓట‌మికి జోగ‌య్యే కార‌ణ‌మ‌న్న టాక్ కూడా ఉంది. ఆ త‌ర్వాత వైసీపీకి దగ్గరైనా జ‌గ‌న్‌తో విబేధించి మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్పుడేదో కాపుల కోసం ఉద్యమం అంటోన్న హ‌రిరామ జోగయ్యకు ఇప్పటి వ‌ర‌కు కాపులు గుర్తు రాలేదా ? అని సొంత సామాజిక వర్గ నేత‌లే ప్రశ్నిస్తున్నారు. నిజానికి కాపు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగ‌సేలా చేశారు ముద్రగ‌డ ప‌ద్మనాభం. ఆ స‌మ‌యంలో యాక్టివ్‌గానే ఉన్న హ‌రిరామ జోగయ్య ముద్రగ‌డ‌తో ఎందుకు క‌లిసిరాలేక పోయారు ? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న. పైగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన‌ప్పుడు.. ఏం చేశారు? అనేది కూడా తెలియాల్సి ఉంది.

ముద్రగడ వదిలేసిన…..

ఇప్పుడు ముద్రగ‌డ వ‌దిలేసిన కాడిని ఈ వ‌య‌సులో భుజాన మోస్తాన‌ని వ‌స్తున్న హ‌రిరామ జోగయ్యని అభినందించాలో.. లేక ఆయ‌న అప్పట్లో కాపుల‌ను ప‌ట్టించుకోలేదు.. ఇప్పుడు మాత్రం క‌న్నీరు తుడుస్తారా ? అని విమ‌ర్శించాలో అర్ధం కాక కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. రాజ‌కీయంగా రేసులో వెన‌క‌ప‌డిన ముద్రగ‌డ కాపు ఉద్యమంతో ఒక్కసారిగా వెలుగులోకి వ‌చ్చారు. ముద్రగ‌డ త‌న ఉద్యమంలో స‌క్సెస్ అయ్యారా ? లేదా ? అన్నది ప‌క్కన పెడితే ఆయ‌న ఈ ఉద్యమాన్ని భుజాన‌కు ఎత్తుకున్నాకే తిరిగి వెలుగులోకి వ‌చ్చారు. ఇప్పుడు హ‌రిరామ జోగయ్య కూడా అంద‌రూ త‌న‌ను మ‌ర్చిపోతోన్న టైంలో ఈ కొత్త ప్లాన్‌తో కాపు ప‌ల్లవి అందుకున్నారా ? అన్న చ‌ర్చలు కూడా న‌డుస్తున్నాయి. మ‌రి మున్ముందు ఆయ‌న ఎలా ముందుకు వెళ్తారో.. ఏం చేస్తారో.. చూడాలి.

Tags:    

Similar News