డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు?

అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు చైనా తహతహలాడుతోంది. అమెరికాకు వ్యతిరేకంగా ఒకప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తు రష్యా) తరహాలో పోటీ పడాలన్నది చైనా ఆలోచన. అదే సమయంలో డ్రాగన్ [more]

Update: 2020-11-14 16:30 GMT

అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు చైనా తహతహలాడుతోంది. అమెరికాకు వ్యతిరేకంగా ఒకప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తు రష్యా) తరహాలో పోటీ పడాలన్నది చైనా ఆలోచన. అదే సమయంలో డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వాటిల్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా , భారత్ ముఖ్యమైనవి. చైనాతో అమెరికా వైరం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ వ్యవహారాల్లో అన్నింటా తనకు సవాల్ విసురుతున్న బీజింగ్ ను ఒంటరి చేయడం, దాని శత్రు దేశాలతో సాన్నిహిత్యం నెరపడం వాషింగ్టన్ విధానం. జపాన్-చైనా విభేదాలు కూడా కొత్తేమీ కాదు.

అన్ని దేశాలతో కలసి….

దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ దూకుడును అడ్డుకోవడం కోసం దానికి ఇతర దేశాల అండ అవసరం. ఆస్రేలియా విషయానికి వస్తే ప్రత్యక్షంగా దానికి చైనాతో గొడవలేమీ లేవు. అయితే తన మిత్ర దేశాలకు మద్దతుగా నిలవాలన్నది దాని ఆలోచన. ఇక భారత్ సంగతి చెప్పక్కర్లేదు. బీజింగ్ తో సరిహద్దు విభేదాలు, 60ల నాటి యుద్ధం, ప్రస్తుతం తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ పూర్వరంగంలో పైన పేర్కొన్న నాలుగు దేశాలు చాలాకాలం క్రితమే చతుర్భుజి కూటమిగా ఏర్పడ్డాయి. దీనినే ఆంగ్లంలో ‘క్వాడ్’ కూటమిగా పేర్కొంటారు. ఈ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం జపాన్ రాజధాని టోక్యోలో గత నెల 6,7ల్లో జరిగింది.

అంతర్జాతీయ సముద్ర జలాల్లో….

వాస్తవానికి ఈ సమావేశం ఎప్పుడో జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సమావేశంలో చైనా దూకుడుకు అడ్డకట్ట వేసే విషయమై కీలక చర్చ జరిగింది. నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు సుబ్రమణ్యం జైశంకర్ (భారత్), మైక్ పాంపియో (అమెరికా), తోషి మిత్సు మోతెగి (జపాన్), మారిసె పేన్ (ఆస్రేలియా) పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో న్యాయబద్ధమైన హక్కులు కలిగిన ఉన్న దేశాల భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు భారత మంత్రి జైశంకర్ స్పష్టం చేవారు. ఈ ప్రాంతంలో స్వేచ్ఛాయుత రవాణా ఆవశ్యకతను నొక్కి చెప్పింది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో అన్ని దేశాలకు సమాన హక్కులు ఉండాలని, వాటిపై ఏ ఒక్కరి పెత్తనం ఉండరాదని ఆయన విస్పష్టంగా వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రంపై తనకే హక్కులు ఉన్నాయన్నంటున్న చైనా మొండివాదన నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన దక్షిణ చైనాసముద్ర తీర దేశాలైన ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, బ్రూనై వంటి దేశాలకు ఎలాంటి హక్కులు లేవని, ఆ తీర ప్రాంతమంతా తనదేనని చైనా వితండ వాదనపై జై శంకర్ గట్టిగానే మాట్లాడారు. మిగిలిన మూడు దేశాల మంత్రులు కూడా భారత వాణికి మద్దతు తెలిపారు.

హెచ్చరించడమేనా?

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. క్వాడ్ సమావేశంలో చైనా విషయమై అమెరికా మరింత ముందుకు వెళ్లింది. ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ చైనా విస్తరణ కాంక్ష నుంచి తమ భాగస్వామ్య పక్షాలను కాపాడుకుంటామని ప్రకటించడం సంచలనం కలిగించేదే. ఇది ప్రత్యక్షంగా చైనాను హెచ్చరించడమేనని దౌత్య నిపుణులు పేర్కొంటున్నారు. క్వాడ్ సమావేశంపై బీజింగ్ కూడా ఘాటుగానే స్పందించింది. క్వాడ్ కూటమి అమెరికా ఆధ్వర్యంలోని మరో ‘నాటో’ (నార్తరన్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) వంటిదని పేర్కొంది. అమెరికా మిత్రదేశాల సైనిక కూటమినే ‘నాటో’ అని వ్యవహరిస్తారు. చైనా మరింత ముందుకు వెళ్లి క్వాడ్ నుఆసియా నాటోగా అభివర్ణించింది. క్వాడ్ లోని రెండు కీలక దేశాలు భారత్, జపాన్ ఆసియా ఖండ దేశాలే. అదే సమయంలో చైనా సైతం ఆసియా ఖండ దేశమే కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఒక్కమాటలో చెప్పాలంటే శత్రువు శత్రువు మిత్రుడన్న పాత సామెత అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ వర్తిస్తుంది. కూటములు ఈ ప్రాతిపదికనే ఏర్పడుతుంటాయి. ఆయా దేశాల ప్రయోజనాల పరమావధిగానే రూపుదిద్దుకుంటాయి. ఇది నగ్న సత్యం. ఎత్తులు పైయెత్తుల్లో ఆరితేరిన చైనాకు ఇదితెలియని విషయమేమీ కాదు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News