ఎందుకీ పాకులాట?

భారత్ – చైనా మిత్రదేశాలా….? శత్రుదేశాలా…? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. చైనా అధికారుల పర్యటనలు చూసి అది మిత్రదేశం అని అనుకోవడం పోరపాటే అవుతుంది. [more]

Update: 2019-10-17 16:30 GMT

భారత్ – చైనా మిత్రదేశాలా….? శత్రుదేశాలా…? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. చైనా అధికారుల పర్యటనలు చూసి అది మిత్రదేశం అని అనుకోవడం పోరపాటే అవుతుంది. విస్తృత లోతుల్లో చూస్తే నేటికీ బీజింగ్ భారత్ కు శత్రు దేశమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరో దశకంలో నమ్మించి మనపై యుద్ధం చేసి టిబెట్ ను ఆక్రమించారు. కశ్మీర్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించింది. ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో సరిహద్దుల్లోకి అక్రమ చొరబాట్లు చేస్తుంటుంది. మన శత్రుదేశం పాకిస్థాన్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటుంది. మన ఇరుగు పొరుగు దేశాలైన శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుంటుంది. అందువల్ల బీజింగ్ పరంగా చూసిన భారత్ శత్రుదేశమే. అంతర్జాతీయ వేదికలపై ఏనాడు భారత్ కు అది మద్దతు ఇవ్వలేదు. కశ్మీర్ పై ఏనాడూ ఢిల్లీకి మద్దతు ప్రకటించలేదు. భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై అయిదు శాశ్వత సర్వోన్నత దేశాల్లో మోకాలు అడ్డుతోంది ఒక్క చైనానే కావడం గమనార్హం. అయినప్పటికీ భారత్ తో సత్సంబంధాల కోసం బీజింగ్ పాకులాడుతుండడం గమనార్హం.

మంచి చేసుకోవడానికి….

ఈ నేపథ్యంలో చైనా అధినేత జిన్ పింగ్ రెండు రోజుల భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన ఉభయ దేశాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా అమెరికా నిశితంగా గమనించింది. భారత్ తో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ జిన్ పింగ్ చిరు నవ్వులతో తమిళనాడులోని మల్లాపురంలో స్నేహహస్తం చాటడానికి తెరవెనుక అనేక కారణాలున్నాయి. కేవలం భారత్ ను ప్రసన్నం చేసుకోవడమే ఆయన పర్యటన లక్ష్యం. అందువల్లే ఎలాంటి సంయుక్త ప్రకటనలు వెలువడలేదు. ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరలేదు. కేవలం యధా పరిస్థితి కొనసాగించడమే అంతిమంగా ఆయన పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. నిజానికి చైనాతో భారత్ స్నేహం కన్నా ఇప్పటి పరిస్థితుల్లో భారత్ తో స్నేహమే చైనాకు చాలా అవసరం. అన్నింటికీ మించి భారత్ తో వ్యాపార అవసరాలు బీజింగ్ కు మరీ ఎక్కువ. అందువల్లే ఎన్ని విభేదాలు ఉన్నప్పటికి, మనసులో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ స్నేహహస్తం చాటక తప్పడం లేదు. రెండు రోజులపాటు దాదాపు ఏడు గంటలపాటు జరిగిన చర్చల్లో 16 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. వాణిజ్య పెట్టుబడుల రంగాల్లో సమస్యలను అధిగమించడానికి రెండు దేశాల మంత్రుల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్నది కీలక నిర్ణయం.

భారత్ కార్యాచరణ….

రెండు దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ కు ఉన్న లోటును తగ్గించడానికి కృషి చేస్తామని చైనా హామీ ఇచ్చింది. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు రెండు దేశాల సైన్యం మధ్య సమాచారం ఉండాలన్నది మరో కీలక నిర్ణయం. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఏడాది లోగా కార్యరూపం దాల్చాలన్నది మరో కీలక నిర్ణయం. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మెరుగు పరచాలన్న లక్ష్యంతో కొన్ని నిర్ణయాలకు భారత్ అప్పుడే కార్యాచరణ ప్రారంభించింది. చైనా పర్యాటకులకు అయిదేళ్ల ఈ టూరిస్టు వీసా ఇవ్వనున్నట్లు భారత్ ప్రకటించింది. దీనివల్ల చైనీయులు భారత్ లోని వివిధ నగరాలు సందర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు చైనా లోని భారత్ రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉభయ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ లోటు చాలా తీవ్రంగా ఉంది. దాదాపు 60 బిలియన్ డాలర్ల లోటు ఉంది. ఇంత భారీ మొత్తం వాణిజ్యలోటు ఉంటే మన దేశం నుంచి ఎగుమతులు తక్కువగా, మనకు దిగుమతులు ఎక్కువగా ఉండటం, ఒక పక్క చైనా చేసే ఉత్పత్తులు భారత్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. అదే సమయంలో చైనాకు మన ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయి. ప్రపంచంలో చైనా తరువాత రెండో అతిపెద్ద జనాభాగల దేశం భారత్. చైనా తన ఉత్పత్తులను అమ్ముకోవడానికి భారత్ ను మించిన దేశం మరొకటి లేదు. తన ఉత్పత్తులను అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పాశ్చాత్య దేశాల్లో అమ్ముకోలేదు. ఇతర వర్తమాన దేశాల్లో కొనుగోలు శక్తి తక్కువ.

ఒకవైపు రెచ్చగొడుతూనే….

యాభై దేశాల జనాభా కూడా ఒక్క భారత్ కు సరితూగడం, విదేశీ వస్తువులు అంటే భారత్ కు విపరీతమోజు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతీయుల్లో కొనుగోలు శక్తి ఎక్కువ. అందువల్ల ఇంతటి విస్రృతమైన మార్కెట్ ను వదులు కునేంత తెలివి తక్కువ పని చైనా చేయనే చేయదు. సరిహద్దు, అంతర్జాతీయ సమస్యల కారణంగా భారత్ ను దూరం చేసుకునేంత అమాయకత్వం ఆ దేశానికి లేదు. అందువల్లే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఢిల్లీని బీజింగ్ విస్మరించదు. తన వ్యాపార ప్రయోజనాల ముందు దానికి అన్ని దిగ దుడుపే. ఒక్క వ్యాపార కోణంలో తప్పితే ఏ రకంగాను భారత్ కు బీజింగ్ స్నేహహస్తం చాపడం లేదన్నది చేదు నిజం. మద్దతు ప్రకటించడంలేదు. ఉదాహరణకు కశ్మీర్ సమస్యపై భారత్ వైఖరిని ఏనాడు చైనా సమర్థించలేదు. ఈ విషయాలను మన శత్రుదేశం పాక్ ను వెనుకేసుకు రావడం మానలేదు.

మౌనం ఎందుకు?

తాజాగా కశ్మీర్ లో 370 అధికరణ రద్దుపై మౌనం వహించిందే తప్ప మనకు మద్దతు ప్రకటించలేదు. సరిహద్దుల్లో చొరబాట్లను ఆపడం లేదు. 2017లో సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం వద్ద చొరబాటు ఘటన ఇందుకు నిదర్శనం. దాదాపు రెండున్నర నెలల పాటు ప్రతిష్ఠంభన నెలకొంది. ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగం అన్న వాదనను వీడడటం లేదు. టిబెట్, హాంకాంగ్, తైవాన్ సమస్యలను అసలు ప్రస్తావించవద్దని హెచ్చరిస్తోంది. భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై మోకాలడ్డుతున్న ఏకైక దేశం చైనా. భారత్ కు ఇరుగు పొరుగు దేశాలైన శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, భూటాన్ లో పాగా వేస్తుంది. ఆయా దేశాలకు ఆర్థిక సాయం చేస్తూ భారత్ వ్యతిరేకతను రెచ్చగొడుతోంది. భారత్ పక్కనే ఉన్న హిందూ మహా సముద్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. అదే సమయంలో దక్షిణ చైనా సముద్రంలో తీర దేశాల హ్కులను కబళించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సముద్రాలు ఇతర దేశాల ప్రమేయాన్ని తప్పు పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ను దూరం చేసుకుంటే అది అమెరికాకు మరింత సన్నిహితం అవుతుందన్నది చైనా భయం. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత్ అగ్రరాజ్యం కానప్పటికీ దాని వాణికి విలువ, గౌరవం ఉంది. ప్రాంతీయ శక్తిగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా దాని ప్రాధాన్యాన్ని ఏ దేశం తక్కువగా అంచనా వేయడం లేదు. అందువల్లే భారత్ ను బీజింగ్ విస్మరించడం లేదు. ఎన్ని విభేదాలున్నా వాణిజ్య ప్రయోజనాల కోసం భారత్ ను దూరం చేసుకొనే సాహసం చేయలేదు. జిన్ పింగ్ తాజా పర్యటనను ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News