ఆధిపత్యానికి చైనా ఆరాటం

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా గల చైనా అంతర్జాతీయంగా సత్తా చాటేందుకు ఆరాట పడుతోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. పరోక్షంగా అమెరికా ఆధిపత్యానికి గండి కట్టేందుకు అన్నిశక్తులు [more]

Update: 2021-07-12 16:30 GMT

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా గల చైనా అంతర్జాతీయంగా సత్తా చాటేందుకు ఆరాట పడుతోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. పరోక్షంగా అమెరికా ఆధిపత్యానికి గండి కట్టేందుకు అన్నిశక్తులు సమీకరించుకుంటోంది. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల డ్రాగన్ దూకుడు ప్రదర్శిస్తోంది. పంచాధిపత్యం కోసం సామ, భేద, దండోపాయాలను ప్రదర్శిస్తోంది. వివిధ అంతర్జాతీయ సంస్థల అధిపతులుగా తన మనుషులుగా ప్రతిష్టించడం, లేదా ఆయా సంస్థలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపించడం ద్వారా తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. బ్రిటన్ కు చెందిన ఓ కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. 11మంది సభ్యులు గల పార్లమెంటరీ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది.

విరాళాలు ఇస్తూ…..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్), అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం, ఇంటర్ పోల్ (ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీసు ఆర్గనైజేషన్), ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ ఏ ఓ- ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్) వంటి అంతర్జాతీయ సంస్థలపై చైనా ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. వివిధ దేశాలకు, వివిధ అంతర్జాతీయ సంస్థలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా వాటిపై డ్రాగన్ పట్టు కొనసాగిస్తోంది. మరోవైపు అమెరికా తరవాత ఆధిపత్య దేశంగా చిన్న దేశాలపై ప్రభావం చూపుతోంది. 2010- 19 మధ్య కాలంలో చైనా విరాళాలు 348 శాతం పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ప్రపంచ సంస్థలకు అమెరికా విరాళాలు బాగా తగ్గాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న చైనా అంతర్జాతీయంగా విరివిగా విరాళాలు ఇస్తూ తన ప్రభావాన్ని చూపుతోంది. పరిధిని విస్తరించుకుంటూ వస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ…..

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతిగా టెడ్రోస్ వ్యవహరిస్తున్నారు. 2017లో ఆయన ఎన్నికకు చైనా మద్దతిచ్చింది. అంతకుముందు టెడ్రోస్ వెనక బడిన ఆఫ్రికా దేశమైన ఇథియోపియో మంత్రిగా వ్యవహరించారు. ఈ దేశానికి చైనా పెద్దయెత్తున నిధులు సమకూర్చింది. వాస్తవానికి టెడ్రోస్ వైద్యుడు కూడా కారు. 2019లో వెలుగు చూసిన కరోనాకు చైనాయే కారణమన్న విమర్శలు, ఆరోపణలు పెద్దయెత్తున వచ్చాయి. యావత్ అంతర్జాతీయ సమాజం దాదాపుగా చైనాను అభిశంసించింది. అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను ఎక్కడా తప్పుపట్టలేదు. అదేపనిగా చైనాను వెనకేసుకొచ్చింది. ఇప్పటికీఅదే పరిస్థితి. కీలకమైన మరో అంతర్జాతీయ సంస్థ ప్రపంచ మానవ హక్కుల సంస్థలోనూ చైనా మనుషులు ఉన్నారు. చైనాలోని ‘ఉయ్ ఘుర్’ తెగకు చెందిన ముస్లింలపై వేధింపులు కొనసాగుతున్నాయి. వారిని అణచి వేస్తున్నారు. అయినా ప్రపంచ మానవహక్కుల సంస్థ మౌనంగా వ్యవహరిస్తోంది.

చిన్న దేశాలపై పట్టు పెంచుకుంటూ..?

కీలకమైన ఇంటర్ పోల్ (ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్) పైనా చైనా ప్రభావం ఉంది. ఇది అంతర్జాతీయ నేరగాళ్ల ఆచూకీ కనిపెట్టేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తుంటుంది. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ ఏ ఓ – ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్) లోనూ చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఆసియా, ఆఫ్రికా ఖండాలను కలిపే మార్గం బీ ఆర్ ఐ (బెల్ట్ రోడ్ ఇనిషియేటీవ్) ద్వారా అనేక దేశాలతో సంబంధాలు కలిగి ఉంది. ఇందులో చేరేందుకు భారత్ ససేమిరా అనడం చైనాకు మింగుడు పడలేదు. ఇప్పటికే దక్షిణాసియాలోని భారత్ ఇరుగు పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక,పాకిస్థాన్ లపై పట్టు పెంచుకుంటోంది. మొత్తానికి అంతర్జాతీయంగా ఆధిపత్యాన్ని చాటుకునేందుకు, పెంచుకునేందుకు తద్వారా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేసేందుకు బీజింగ్ నాయకత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News