గెలవలేమని… గెలిచే చోటకు వెళ్లాలని…?

అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు తెలిసి రాలేదు. ఐక్యతగా ఉండి అధికార పార్టీ పై పోరాడాల్సిన సమయంలో వచ్చే ఎన్నికల కోసం వ్యూహరచన [more]

Update: 2021-02-17 03:30 GMT

అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు తెలిసి రాలేదు. ఐక్యతగా ఉండి అధికార పార్టీ పై పోరాడాల్సిన సమయంలో వచ్చే ఎన్నికల కోసం వ్యూహరచన చేసుకుంటున్నారు. మాజీ మంత్రి చినరాజప్ప ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చినరాజప్ప కారణంగా మాజీ ఎమ్మెల్యే పార్టీకి దూరమవ్వడం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త పార్టీకి దూరంగా ఉండటానికి కారణం చినరాజప్ప అని స్పష్టం చేయడం విశేషం.

జిల్లా పార్టీని శాసిస్తూ….

గత ఇరవై నెలల నుంచి అధికారం కోల్పోవడంతో టీడీపీ నేతలు బయటకు కూడా రావడం లేదు. అయినా తూర్పు గోదావరి జిల్లాలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పలు పార్టీపై పెత్తనం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో వేలు పెడుతూ నేతలను ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలో ఏ ఇన్ ఛార్జిని నియమించాలన్నా, పార్టీ పరంగా ఏ పదవులు ఇవ్వాలన్నా వీరిద్దరి అనుమతి ని అధిష్టానం తీసుకుంటుండటంతో మరింతగా ఆధిపత్యం చేస్తున్నారు.

నియోజకవర్గం మార్చాలని….

చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికి రెండుసార్లు పెద్దాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అసలు చినరాజప్ప తొలిసారి 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అప్పటి వరకూ ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారి గెలవడంతోనే ఆయనకు 2014లో చంద్రబాబు హోంమంత్రి పదవిని కట్టబెట్టారు. పెద్దాపురంలో హ్యాట్రిక్ ను సాధించడం కష్టమని భావించిన చినరాజప్ప ఈసారి అక్కడ గెలుపు కష్టమని భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేయకపోవడంతో ఆయనపై అసంతృప్తి ఎక్కువగా ఉంది.
ఇక్కడ వచ్చే ఎన్నికల్లో బొడ్డు భాస్కరరామారావును పోటీ చేయించాలని హైకమాండ్ కూడా భావిస్తుంది.

అందుకే ఈ వివాదం….

దీంతో చినరాజప్ప నియోజకవర్గాన్ని మార్చాలని డిసైడ్ అయ్యారంటున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం అయితే సేఫ్ అని చినరాజప్ప భావించారు. అక్కడ కాపు ఓటు బ్యాంకు కూడా ఎక్కువగా ఉండటంతో ఈసారి అక్కడి నుంచి పోటీ చేయాలన్నది చినరాజప్ప ఆలోచనగా ఉంది. అందుకే అక్కడ టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న పిల్లి అనంతలక్ష్మిని బయటకు పంపాలని ప్లాన్ వేసి వారికి ఇబ్బందులు కల్గించారంటున్నారు. అందుకే వారు బయటకు వెళ్లిపోయారంటున్నారు. కానీ చినరాజప్ప మాత్రం ఈ వివాదంలో తనకెలాంటి సంబంధ లేదని చెబుతున్నారు.

Tags:    

Similar News