ఈయనగారి డిక్షనరీలోనే లేదు.. ఎవరినీ వదడం లేదుగా

సరిహద్దు దేశాలతో సత్సంబంధాలన్నది చైనా ‘డిక్షనరీ’లో లేనేలేదు. ప్రతి పొరుగు దేశంతోనూ పేచీలకు దిగడం డ్రాగన్ నైజం. చైనాతో 13 దేశాలు సరిహద్దులు కలిగి ఉన్నాయి. భారత్, [more]

Update: 2020-10-11 16:30 GMT

సరిహద్దు దేశాలతో సత్సంబంధాలన్నది చైనా ‘డిక్షనరీ’లో లేనేలేదు. ప్రతి పొరుగు దేశంతోనూ పేచీలకు దిగడం డ్రాగన్ నైజం. చైనాతో 13 దేశాలు సరిహద్దులు కలిగి ఉన్నాయి. భారత్, రష్యా, నేపాల్, పాకిస్థాన్, భూటాన్, మయన్మార్, వియత్నాం, లావోస్, ఉత్తర కొరియా, మంగోలియా, తజకిస్థాన్, కిర్గిజిస్థాన్, కజకిస్థాన్ లతో బీజింగ్ సరిహద్దులను పంచుకుంటోంది. ఒక్క ఉత్తర కొరియా, పాకిస్థాన్ తప్ప ప్రతి దేశంతోనూ ఏదో ఒక గొడవ ఉంది. గత అయిదు నెలలుగా భారత్ సరిహద్దులోని తూర్పు లడఖ్ ప్రాంతంలో అది హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే.

నానాయాగీ చేస్తూ….

జూన్ లో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ఇప్పటికీ ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు వీడలేదు. ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. తాజాగా మిత్రదేశమైన నేపాల్ తోనూ పేచీలకు దిగుతోంది. ఉభయదేశాల సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడుతూ తన నైజాన్ని చాటుకుంటోంది. చిన్నదైన మిత్ర దేశాన్ని వంచిస్తోంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని కాలాపానీ, లిపూలేఖ్, లింపియాధురాల ప్రాంతాలు తమవేనని నానాయాగీ చేసింది నేపాల్. అంతేకాక ఆ దేశ పార్లమెంట్ ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు దేశ చిత్ర పటంలో మార్పులు చేసింది. దీనిని పాఠ్యంశంగా కూడా చేర్చింది. భారత్ విషయంలో ఇంత రాద్ధాంతం చేసిన హిమాలయ పర్వత రాజ్యం ఇప్పుడుచైనా ఆక్రమణపై నోరు మెదపడం లేదు. విపక్ష నేపాలీ కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నా మౌనాన్నే ఆశ్రయించింది.

నేపాల్ భూభాగంలోనూ….

తాజా విషయానికి వస్తే నేపాల్ భూభాగంలో బీజింగ్ 12 భవనాలను నిర్మించడం వివాదాస్పదమైంది. నేపాల్ లోని కర్నాలి ప్రావిన్స్ లో చైనా వీటిని నిర్మించింది. హుమ్లా జిల్లా పరిధిలో గల నామ్కా గౌపాలికా గ్రామీణ పురపాలక సంఘం పరిధిలోని లాప్చా-లిమి గ్రామ సరిహద్దుకు సుమారు కిలోమీటరు దూరంలో చైనా 12 భవనాలను నిర్మించింది. హుమ్లా ఎంపీ చక్క బహదూర్ లామా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాంతంలోని 11వ సరిహద్దు స్తంభాన్ని చైనా సైనికులు మాయం చేశారు. ఇది వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉంది. టిబెట్ ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడి నుంచి మానస సరోవరాన్ని దగ్గరగా వీక్షించవచ్చు. అటు టిబెట్, ఇటు భారత్ లోని ఉత్తరాఖండ్ ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంపై బీజింగ్ ఎప్పటినుంచో కన్నేసింది. పదిహేనేళ్ల క్రితం ఇక్కడ చిన్న గుడిసె మాత్రమే ఉండేది. కాలక్రమంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఇక్కడి సరిహద్దు స్తంభాన్ని తొలగించి భవనాలను నిర్మించింది. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు స్థానిక ప్రజలను , పాత్రికేయులను, నేపాల్ అధికారులను అనుమతించడం లేదు. అంతేకాక ఇది తమ ప్రాంతమేనని దబాయిస్తోంది.

పెదవి విప్పడం లేదు….

సరిహద్దు స్తంభం మాయమైన మాట వాస్తవమేనని హుమ్లా జిల్లా పాలనాధికారి చిరంజీవి గిరి వెల్లడించారు. ఈ విషయమై నివేదిక కోరడానికే విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిమితమైంది. అంతకు మించి మాట్లాడటానికి ఇష్ట పడటం లేదు. అంతకు ముందు భారత్ ఆక్రమణలకు పాల్పడుతుందని అదేపనిగా ఆడిపోసుకున్న ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ చైనా భవన నిర్మాణాలపై పెదవి విప్పడం లేదు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన ఖడ్గ ప్రసాద్ కు భారత్ వ్యతిరేకిగా పేరుంది. విపక్షమైన నేపాలీ కాంగ్రెస్ చైనా భవన నిర్మాణాలపై గట్టిగా మాట్లాడుతోంది. ప్రభుత్వం ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తోంది. దేశంలో అత్యంత పురాతన పార్టీగా పేరొందిన నేపాలీ కాంగ్రెస్ కు భారత్ కు అనుకూలమన్న అభిప్రాయం ఉంది. తాజా వివాదాన్ని బీజింగ్- ఖట్మాండు ఎలా పరిష్కరించుకుంటాయో వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News