చింత‌మ‌నేని @ జీరో పెర‌ఫార్మెన్స్‌.. దెందులూరు గోవిందా…?

టీడీపీ సీనియ‌ర్ నేత, ప‌శ్చిమ గోదావ‌రిజిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్‌ చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ అధికారంలో ఉండ‌గా దూకుడు ప్రద‌ర్శించారు. అంతా తానే అయిన‌ట్టు [more]

Update: 2020-04-04 06:30 GMT

టీడీపీ సీనియ‌ర్ నేత, ప‌శ్చిమ గోదావ‌రిజిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్‌ చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ అధికారంలో ఉండ‌గా దూకుడు ప్రద‌ర్శించారు. అంతా తానే అయిన‌ట్టు జిల్లా మొత్తంలో హ‌ల్‌చ‌ల్ చేశారు. అధినేత ఆదేశాల‌ను కూడా ఆయ‌న కొన్నిసంద‌ర్భాల్లో ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలోనూ త‌న‌కు తిరుగు లేద‌నే విధంగా వ్యవ‌హ‌రించారు. ఈ క్రమంలోనే అధికారుల‌పైనా ఆయ‌న దూకుడుగా వ్యవ‌హ‌రించారు. విప‌క్ష నాయ‌కుల‌ను తూల‌నాడారు. కేవ‌లం టీడీపీ మాత్రమే పార్టీ అనే రేంజ్‌లో వ్యవ‌హ‌రించారు. అంతేకాదు, తాను త‌ప్ప ఎవ‌రూ పార్టీని బ‌తికించ‌లేర‌నే ధీమా కూడా వ్యక్తం చేశారు.

ఎన్ని సవాళ్లు..ఎన్ని వివాదాలు….

జ‌గ‌న్‌కు, ప‌వ‌న్‌కు ఇద్దరికి ద‌మ్ముంటే వ‌చ్చి త‌న దెందులూరులో పోటీ చేయించాల‌ని స‌వాళ్లు రువ్వారు. ప‌దేళ్ల పాటు దెందులూరు త‌న అడ్డాగా చేసుకుని పేట్రేగిపోయారు. చంద్రబాబు సైతం చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ చ‌ర్యల విష‌యంలో చూసి చూడ‌న‌ట్టు వ్యవ‌హ‌రించ‌డంతో అస్సలు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇలా అడుగడుగునా .. వివాదాలు, వివాదాస్పద చ‌ర్యలు, నిర్ణయాల‌తో గడిచిన చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ రాజ‌కీయాలు ఒక్కసారిగా చ‌తికిల ప‌డ్డాయి. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. అంతేకాదు, దెందులూరులో చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ కూడా ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు. అంతే.. ఒక్క ఓట‌మితో ఆయ‌న రాజ‌కీయ హ‌వా కింద‌కి జారి 'చింత‌మ‌నేని @ జీరో' -అనేలా ప‌రిస్థితి మారిపోయింది. సొంత పార్టీ టీడీపీలోనే త‌న సొంత సామాజిక వ‌ర్గం నేత‌లే ఇప్పుడు చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ ని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

భారీగా టీడీపీ నుంచి వలసలు….

అంతేకాదు, వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే అబ్బయ్య చౌద‌రి దూకుడు ముందు చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ పూర్తిగా ఎలాంటి వ్యూహం లేకుండా చేతులు ఎత్తేస్తున్నార‌న్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి గ‌త మూడు ద‌శాబ్దాల్లో చూస్తే 2004, 2019 ఎన్నిక‌ల్లో మాత్రమే టీడీపీ ఇక్కడ ఓడిపోయింది. 2009, 2014 ఎన్నిక‌ల్లో చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ విజ‌యం సాధించారు. నిజానికి ఒక నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి పునాదులు వేసేందుకు ఈ ద‌శాబ్దకాలం చాలా ఉప‌యోగ ప‌డే విష‌యమ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే, చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ ఎప్పుడూ వివాదాలు, వివాదాస్పద అంశాల‌కే ప‌రిమిత‌మైన నేప‌థ్యంలో పార్టీని ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఈ క్రమంలోనే భారీ ఎత్తున పార్టీ నుంచి వ‌ల‌స‌లు చోటు చేసుకుని వైసీపీ గూటికి చేరిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన పార్టీగా ఉన్న టీడీపీ ఇక్కడ బ‌ల‌హీన ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో….

చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ హ‌వా త‌గ్గిపోయింద‌ని చెప్పడానికి ఇటీవ‌ల జ‌రిగిన ఓ సంఘ‌ట‌నే ప్రధాన ఉదాహ‌ర‌ణ‌. దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం లో ఏలూరు రూర‌ల్ ప‌రిధిలోకి వ‌చ్చే జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ ఏక‌గ్రీవం చేసుకుంది. అంతేకాదు, అనేక స్థానిక సంస్థల్లో ప‌లు ఎంపీటీసీ సీట్లను కూడా వైసీపీ త‌న ఖాతాలో వేసుకుంది. నిజానికి విప్‌గా వ్యవ‌హ‌రించిన చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ పార్టీపై ప‌ట్టుకోల్పోయారా ? అనే ప్రశ్నలు కూడా వ‌స్తున్నాయి. మొత్తానికి త‌న‌కు తిరుగులేద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలోత‌న‌కు ఎదురు లేద‌ని, ఓడించే నాయ‌కుడు కూడా పుట్టలేద‌ని వ్యాఖ్యలు చేసిన చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ ఇప్పుడు ఏకంగా చేతులు ఎత్తేసి @ జీరో అనే ప‌రిస్థితి ఏర్పడ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News