సింపతీ బాగా పెరుగుతోందా

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. దూకుడు స్వ‌భావం ఎక్కువ‌గా ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న పేరు [more]

Update: 2019-11-01 11:00 GMT

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. దూకుడు స్వ‌భావం ఎక్కువ‌గా ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే అత్యంత వేగంగా వివాదాస్ప‌ద నాయ‌కుల జాబితాలో చేరిపోయారు. టీడీపీ త‌ర‌పున రెండు సార్లు ఇక్క డ విజ‌యం సాదించిన ఆయ‌న‌కు ప‌ట్ట‌ప‌గ్గాల్లేవ‌ని కూడా అంటారు. ఈ క్ర‌మంలోనే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ గ‌డిచిన ఐదేళ్ల చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో త‌నకు తిరుగే లేద‌ని అన్న‌ట్టుగా రెచ్చిపోయారు. అనేక వివాదాల‌ను కొని తెచ్చుకున్నారు. ఏకంగా ఓ మ‌హిళా ఎంఆర్వోపైనే దాడి చేయించార‌నే అప‌వాదును మోశారు.

ఓటమి తర్వాత….

అయితే, అప్ప‌ట్లో చంద్ర‌బాబు.. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై అపార‌మైన ప్రేమ‌ను చూపించ‌డంతో ఆయ‌న ఆట‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్‌, జ‌గ‌న్ క‌లిసి వ‌చ్చి పోటీ చేసినా దెందులూరులో గెలుపు త‌న‌దే అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. చివ‌ర‌కు రాజ‌కీయాల‌కు కొత్త అయిన ఎన్నారై కొఠారు అబ్బ‌య్య చౌద‌రి చేతిలో 17 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదిలావుంటే, తాజాగా ఐదుమాసాల కింద‌ట అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ రెండు మాసాలు తిరిగేస‌రికి చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై క‌న్నెర్ర చేశారు. ఆయ‌న హ‌యాంలో ప్ర‌త్యేకంగా కేసులు న‌మోదు చేయించ‌క‌పోయినా.. పాత కేసుల‌ను తిర‌గ‌దోడుతున్నారు.

అరెస్ట్ చేసే విషయంలోనూ….

రెండు నెల‌ల పాటుచింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ని పోలీసులు అరెస్టు చేసే విష‌యంలో కూడా మీన‌మేషాలు లెక్కించారు. వైసీపీ అగ్రనాయకత్వం ఈ కేసుల విష‌యంలో ప్ర‌త్యేకంగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కి అనుకూలంగా ఉన్న పోలీసుల‌ను బ‌దిలీ చేయ‌డ‌మో లేదా ? స‌స్పెండ్ చేయ‌డ‌మో చేశారు. గ‌తంలో కేవ‌లం మాట మాత్రంగా ఫిర్యాదు చేసిన వారిని పోలీసులు స్టేష‌న్ల‌కు పిలుచుకువ‌చ్చి మ‌రీ చింత‌మ‌నేనిపై కేసులు రాత‌పూర్వ‌కంగా న‌మోదు చేయస్తున్నారు. దీంతో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ప‌రిస్థితి చిత్త‌డై పోయింది. ఆయ‌న ఎక్కే కోర్టు.. దిగే కోర్టు అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

కమ్మ సామాజికవర్గంతో పాటు….

ఒక కేసులో జైలుకు వెళ్ల‌డం దానిలో బెయిల్ తెచ్చుకునిఏదో ఒక ర‌కంగా బ‌య‌ట ప‌డ‌కుండా… బెయిల్ వ‌చ్చిన వెంట‌నే మ‌రో కేసులో చిక్కుకోవ‌డం ఆ వెంట‌నే జైలులో రిమాండ్ పొడిగించ‌డం చ‌కచ‌కా జ‌రుగుతున్నాయి. జైలు… బెయిలు.. ఆ వెంట‌నే జైలు .. ఇదీ గ‌డిచిన నెలన్న‌ర‌ రోజుల‌కు పైగా జ‌రుగుతున్న తతంగం. అయితే, ఈ విష‌యం ప‌రిశీలిస్తున్న క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌ల‌తో పాటు టీడీపీకి బాగా స‌పోర్ట్ చేసే బీసీల్లోన్ని కొన్ని వ‌ర్గాలు మాత్రం జ‌గ‌న్ కావాల‌నే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ని ఇలా ఇబ్బంది పెడుతున్నార‌ని అంటున్నారు. దీంతో వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగింది. మ‌రోప‌క్క‌, వైసీపీని అభిమానించే క‌మ్మ వ‌ర్గం కూడా ఈ చ‌ర్య‌ల‌తో జ‌గ‌న్‌పై ఒకింత ఆగ్ర‌హంతోనే ఉంది.

సానుభూతి పెరగడంతో….

అస‌లే వైసీపీలో ఉన్న క‌మ్మ వ‌ర్గం త‌క్కువ‌. అయితే జ‌గ‌న్ టోట‌ల్‌గా ఆ వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తుండ‌డంతో అస‌లే ఆ పార్టీలో ఉన్న ఆ వ‌ర్గం సానుభూతిప‌రులు కూడా వైసీపీకి దూర‌మ‌వుతున్నారు. ఇక బీసీల్లోనూ కొంద‌రు జ‌గ‌న్ కావాల‌నే టార్గెట్ చేస్తున్నార‌న్న సందేహంతో ఉన్నారు. ఈ ప‌రిస్థితి ప‌శ్చిమ‌గోదావ‌రి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువుగా క‌నిపిస్తోంది. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై చ‌ర్య‌ల‌ను, ఆయ‌న అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దౌర్జ‌న్యాల‌ను ఎవ్వ‌రూ స‌పోర్ట్ చేయ‌క‌పోయినా కావాల‌ని కొన్ని వ‌ర్గాల‌ను ఇలా టార్గెట్ చేస్తుండ‌డం చాలా మందికి న‌చ్చ‌డం లేదు. తాజాగా నారా లోకేష్ చింతమనేనిని, ఆయన కుటుంబాన్ని పరామర్శకు వచ్చినప్పుడు కూడా పెద్దయెత్తున ప్రజలు హాజరవ్వడం ఇందుకు ఉదాహరణ. ఈ ప‌రిణామాలు అంతిమంగా చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై సానుభూతికి కార‌ణ‌మ‌వుతున్నాయి. మ‌రి జ‌గ‌న్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ లాంటి వాళ్ల విష‌యంలో ప‌ట్టు విడుపుల‌తో ఉంటారా? చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తోంద‌ని స‌మ‌ర్ధించుకుంటారా? చూడాలి.

Tags:    

Similar News