కాంగ్రెస్ మూలాలే చిరంజీవిని దూరం చేశాయా…?

దక్షిణాదిన తిరుగులేని నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనది నాలుగున్నర దశాబ్దాలకు పైగా సినీ జీవితం. సౌతిండియా దిగ్దర్శకుడు కె బాలచందర్ కళ్ళలో ఒకనాడు పడి కెమెరా [more]

Update: 2021-04-15 12:30 GMT

దక్షిణాదిన తిరుగులేని నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనది నాలుగున్నర దశాబ్దాలకు పైగా సినీ జీవితం. సౌతిండియా దిగ్దర్శకుడు కె బాలచందర్ కళ్ళలో ఒకనాడు పడి కెమెరా ముందు నిలిచిన సామాన్య ఆర్టీసీ కండక్టర్ ప్రపంచ నటుడి స్థాయిని సంపాందించారంటే అది ఆయన స్వయంకృషిగానే చెప్పుకోవాలి. రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడాన్ని అంతా స్వాగతిస్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ తమిళనాట ఎన్నికల సమయంలో ఈ అవార్డ్ దక్కడం పట్ల మాత్రం కొంత చర్చ అయితే ఉంది.

ఎన్నో అవార్డులు….

రజనీకాంత్ కి ఎన్నో అవార్డులు ఇప్పటికే దక్కాయి. ఆయనకు పద్మభూషణ్ వచ్చింది. 2016లో పద్మ విభూషణ్ దక్కింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెద్దలకు దేశాన సినీ ప్రముఖులు అంటూ గుర్తుకు వస్తే ఉత్తరాన అమితాబ్ దక్షిణాన రజనీకాంతే గుర్తుకు వస్తారు. తాజాగా 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సన్నాహక కమిటీలో కూడా రజనీకి చోటు కల్పించారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలో నంబర్ వన్ స్టార్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని మాత్రం మరిచారు.

ఎందుకలా వివక్ష …?

చిరంజీవికి కాంగ్రెస్ హయాంలో పద్మభూషణ్ దక్కింది. ఆ తరువాత ఆయన ప్రజారాజ్యం పార్టీని పెట్టి తన సత్తా ఎంత ఉందో చెప్పేసేలా గుప్పిట విప్పేశారు. ఇక తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి ఆ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇక రాజ్యసభ పదవీకాలం ముగియగానే ఆయన సినిమా రంగానికే పరిమితం అయ్యారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీతో దోస్తీ చేస్తున్నా చిరంజీవి మాత్రం నో పాలిటిక్స్ అంటున్నారు. బహుశా ఆ గుస్సా ఏమైనా కేంద్ర బీజేపీ పెద్దలకు ఉందేమో తెలియదు అన్న మాట ఉంది.

పట్టించుకోరా…?

అర్హత ఉంటే అవార్డులు వచ్చి వాలిపోవు. దానికి తోడు రాజకీయ అవసరాలు కూడా ఉండాలి. అవి పై వారికి తీర్చేలా ఉండాలి. రజనీకాంత్ బలం ఎంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆయన పార్టీ పెట్టకుండానే రాజకీయ ఊహాగానాలకు స్వస్తి చెప్పారు దాంతో పాటు ఆయన ఏ పార్టీ మనిషిగా ముద్ర లేకుండా ఉన్నారు. మరో వైపు ఆయన మీద బీజేపీకి ఆశలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇవన్నీ కలసి దేశంలోనే ఒక అత్యున్నత పురస్కారానికి ఆయన్ని ఎంపిక చేసేలా చూసాయని అంటున్నారు. అదే సమయంలో మరో వైపు చిరంజీవి మాజీ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. బీజేపీని టచ్ మీ నాట్ అంటున్నారు. ఈ నేపధ్యంలో కనీసం ఆయనకు పద్మ విభూషణ్ కూడా దక్కలేదు అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా అదే తమిళనాడుకు చెందిన మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ కి భారత రత్నను సరిగ్గా ఎన్నికల వేళ నాటి కాంగ్రెస్ సర్కార్ ప్రకటించంది. ఇపుడు మరో తమిళ నటుడు రజనీకి కూడా బీజేపీ అవార్డును ఎన్నికల వేళనే చూసి మరీ అందించింది. మరి తెలుగునాట ఒక ఎన్టీయార్, మరో చిరంజీవి ఏం పాపం చేశారు అంటే సమాధానం కేంద్ర పెద్దలే చెప్పాలేమో.

Tags:    

Similar News