ఆ వేషానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసినట్లే

మెగాస్టార్ చిరంజీవి బోల్డ్ గా మాట్లాడుతారు. అసలు అయనకు వెండి తెరపైన నటన తప్ప బయట నటించడం చేతకాదు. ఎందుకంటే ఆయన గంజీ బెంజీ రెండూ చూసిన [more]

Update: 2021-01-03 05:00 GMT

మెగాస్టార్ చిరంజీవి బోల్డ్ గా మాట్లాడుతారు. అసలు అయనకు వెండి తెరపైన నటన తప్ప బయట నటించడం చేతకాదు. ఎందుకంటే ఆయన గంజీ బెంజీ రెండూ చూసిన వాడు. అందుకే ఆయన అలాగే ఉంటారు. ఆయనలాగే ఉంటారు. ఈ రోజు కోట్లకు పడగలెత్తినా ఆ గుండెలో తడి ఉంది. అది బాధతో స్పందిస్తుంది. ఇది చాలు చిరంజీవిని జనం మనిషిని చేయడానికి. ప్రత్యేకంగా రాజకీయాలూ, ఆ వేషాలూ ఎందుకు. చిరంజీవి రాజకీయ ప్రవేశం వార్తలు వచ్చినపుడు ఆయన గురించి ఎరిగిన వారు అన్న మాటలు ఇవి.

అదే సత్యమైంది…..

నిజమే అదే నిజమైంది. చిరంజీవికి రాజకీయాలు అసలు వంటబట్టలేదు. ఆయన ఇమేజితో తాము అందలాలు ఎక్కి దాన్ని డ్యామేజ్ చేయడానికి పక్కన చేరిన వారితో ఆయన విసిగిపోయారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసే దశవరకూ సాగిన మొత్తం ఎపిసోడ్ లో చిరంజీవి లాంటి సున్నిత మనస్కుడు ఎంతలా బాధపడి ఉంటారో ఊహించిన వారికే అర్ధమవుతుంది. మొత్తానికి కేంద్ర మంత్రి పదవిని కొన్నాళ్ళు చేపట్టి ఆ మీదట సభకు నమస్కారమంటూ చిరంజీవి పూర్తిగా పాలిటిక్స్ చొక్కా విడిచి పెట్టేశారు.

వచ్చే జన్మలో కూడా….

ఎవరైనా ఏ విషయంలోనైనా కూడా పొరపడితే తడబడితే ఈ జన్మకు కుదరలేదు అంతే ప్రాప్తం అనుకుంటారు. కానీ చిరంజీవికి మాత్రం ప్రజారాజ్యం విఫల ప్రయోగం, రాజకీయాల్లో చూసిన ఎగుడు దిగుళ్ళూ అన్నీ కలసి జన్మ జన్మల వైరాగ్యాన్నే తెచ్చిపెట్టాయని అనిపిస్తోంది. ఆయన తాజాగా ఓ ఓటీటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు వద్దంటే వద్దు అంటూ చాలా సీరియస్ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అంతే కాదు వచ్చే జన్మలో కూడా తాను నటుడిగానే పుట్టాలి. జనాలను అలరించాలి అంటూ తన కోరికనూ వ్యక్తం చేశారు.

అందరికీ పాఠమే….

సినిమా నటులకు ఏ వర్గానికీ చేరని వారుగా అందరూ అభిమానులే ఉంటారు. వారు సున్నితంగా ఉంటారు. వారికి తెలియని రంగం, కుదరని రంగం రాజకీయం. ఎన్టీయార్ అంతటి మహానుభావుడు కృద్దుడై ఎందుకొచ్చాను రాజకీయాల్లోకి అని వగచి వాపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇపుడు ఉరకలు వేస్తున్న వారు కొత్త పార్టీలు పెడతాము అని పరుగులెత్తే వారికి కూడా చిరంజీవి రాజకీయ జీవితం, ఆయన తాజాగా చేసిన ప్రకటనలు ఒక పాఠంగా మారాలి. సరే అందరూ అలా కావాలని లేదు కదా అని ఎవరైనా ఈ రంగానికి వచ్చేందుకు సిధ్ధపడితే మాత్రం వారు ఢక్కా మెక్కీలు తినేందుకు రెడీగా ఉండాలి. ఏది ఏమైనా చిరంజీవి కి ఇంతలా విరక్తిని పుట్టించిన రాజకీయాలను సగటు మనిషి కూడా ఇపుడూ ఎపుడూ వ్యతిరేకిస్తున్నాడుగా.

Tags:    

Similar News