తమ్ముడి పాలిటిక్స్ కి మెగా బ్రేకులు ?

తెలుగు రాష్ట్రాలో మెగాస్టార్ ఫ్యామిలీని ఉన్న గుర్తింపే వేరు. కోట్లాది మంది అభిమాన జనమే మెగాస్టార్ చిరంజీవికీ, ఆయన కుటుంబానికీ వరం. చిరంజీవి ఒంటరిగా సినీ పరిశ్రమకు [more]

Update: 2020-11-29 14:30 GMT

తెలుగు రాష్ట్రాలో మెగాస్టార్ ఫ్యామిలీని ఉన్న గుర్తింపే వేరు. కోట్లాది మంది అభిమాన జనమే మెగాస్టార్ చిరంజీవికీ, ఆయన కుటుంబానికీ వరం. చిరంజీవి ఒంటరిగా సినీ పరిశ్రమకు వచ్చి మొనగాడు అనిపించుకున్నారు. ఇపుడు ఆయన సహా వారసులు కూడా సినీ సీమను ఏలుతున్నారు. ఇక ఆరున్నర పదుల వయసులో ఆయన టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా మారారు. చిరంజీవి జీవితంలో సినిమాలదే అగ్ర తాంబూలం, మధ్యలో ఆయన రాజకీయాల వైపు చూసినా కూడా అది మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. దానికి చిరంజీవి సాత్విక మనస్తత్వం ఒక కారణం అయితే నాటి రాజకీయ నేపధ్యం మరో కారణం.

అడ్డు పడుతున్నారా…?

ఇక చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాలల్లో దూకుడుగా ఉంటారని అంటారు. ఆయన మాటలు, ఆవేశపు ప్రకటనలు కొంత మాస్ ని కట్టిపడేస్తాయి. చిరంజీవితో సరిసమానమైన ఇమేజిని సాధించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అన్న చేసిన తప్పులు తాను చేయకుండా ముందుకు సాగాలనుకుని జనసేనను స్థాపించారు. అయితే ఆవేశమే తప్ప సరైన ఆలోచనా విధానం లేకపోవడం వల్ల ఆయన ఆరేళ్ళుగా అక్కడే ఉన్నారు తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. ఇక చిరంజీవి నీడ కూడా రాజకీయంగా పవన్ కి అడుగడుగునా అడ్డుపడుతోందన్న మాట కూడా ఉంది.

అక్కడే క్లాష్ ….

చిరంజీవి ఎపుడో రాజకీయ అవతారం చాలించారు. ఆయన ఈ వయసులో నాకు పాలిటిక్స్ ఎందుకు అని ఆ మధ్య మీడియా ముఖంగానే తన విముఖతను చాటుకున్నారు. అయితే చిరంజీవి టాలీవుడ్ లో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో పెద్ద దిక్కుగా మారిపోయారు. దాసరి నారాయణరావు తరువాత టాలీవుడ్ కి ఒక ఫేస్ లేకపోవడంతో మెగాస్టార్ ఆ లోటుని భర్తీ చేస్తున్నారు. ఇలా ఆయన సినీ రంగానికి సంబంధించిన సమస్యలను ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల వద్ద తరచూ ప్రస్తావిస్తున్నారు. దాంతో ఆయనకు వారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందన్న ప్రచారం కూడా మరో వైపు జరిగిపోతోంది. ఇదే జనసేనాని పవన్ కి ఇబ్బందిగా ఉంటోందిట. తాను రాజకీయంగా విభేదిస్తున్న నేతలను స్వయానా తన అన్న కలవడం వల్ల తన ప్రయత్నాలు వృధా అవుతున్నాయని పవన్ భావించడంతో తప్పులేదు.

అది ఇరకాటమే…?

తరచూ కేసీఆర్ తో చిరంజీవి భేటీ అవుతూ సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావనకు తెస్తున్నారు. తెలంగాణాలో బీజేపీతో కలసి కేసీయార్ మీద పోరాడాలనుకుంటున్న జనసేనాని పవన్ కి ఈ కలయికలు ఇబ్బందిగా ఉంటున్నాయట. మరో వైపు ఏపీ సీఎం జగన్ ని ఇప్పటికి రెండు సార్లు కలసిన చిరంజీవి మరో మారు కలిసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. సినీ రంగం సమస్యల మీదనే ఆయన జగన్ తో భేటీ వేస్తున్నా మెగాస్టార్ చిరంజీవి జగన్ పక్షమని వైసీపీ దాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకునే అవకాశమూ ఉంది. దాంతో పవన్ జగన్ మీద ఎక్కుపెడుతున్న బాణాలు కూడా వెనక్కి తిరిగివచ్చేలా పరిస్థితి ఉందంటున్నారు. మొత్తానికి చిరంజీవిని తప్పుపట్టడానికి లేదు. పవన్ రాజకీయ పంధాను విమర్శించడానికీ లేదు, కానీ జనసేనలో ఉన్నది కూడా మెజారిటీ మెగా ఫ్యాన్సే. వారికి పార్టీ రాజకీయాలు, సినీ అభిమానాలకు మధ్య తేడా తెలియకపోవడం వల్లనే పవన్ పాలిటిక్స్ కి మెగా బ్రేకులు పడిపోతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News