ఈ నగరాలకు ఏమైంది? రానున్నది గడ్డుకాలమేనా?

నగరాలు ఇప్పట్లో కోలుకునేలా లేవు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా నగరాల్లోనే విస్తరిస్తుండటంతో నగరాలు దాదాపు ఖాళీ అవుతున్నాయి. దేశంలో 89 శాతం కరోనా పాజిటివ్ కేసులు [more]

Update: 2020-07-14 18:29 GMT

నగరాలు ఇప్పట్లో కోలుకునేలా లేవు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా నగరాల్లోనే విస్తరిస్తుండటంతో నగరాలు దాదాపు ఖాళీ అవుతున్నాయి. దేశంలో 89 శాతం కరోనా పాజిటివ్ కేసులు 49 నగరాల్లోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ముంబయిలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటేశాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కూడా కేసుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది.

నగరాలన్నీ ఖాళీ……

దీంతో అనేక నగరాలు ఖాళీ అవుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే నగరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 25 లక్షల మంది నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని అంచనా. వీరంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని సొంత గ్రామాలకు వెళ్లినవారే. ఎక్కువగా రోజు వారీ ఉపాధి పొందుతున్న వారే నగరాన్ని వీడుతున్న వారిలో ఉన్నారు.

లక్షల సంఖ్యలో కార్మికులు…..

బెంగళూరు కూడా ఇందుకు మినహాయింపు కాదు. లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చిన తర్వాత బెంగళూరు నగరంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు నగరం నుంచి దాదాపు పదిహేను లక్షల మంది బెంగళూరు నగరాన్ని వదిలి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఎవరూ నగరాన్ని విడిచి వెళ్లవద్దని యడ్యూరప్పతో సహా మంత్రులందరూ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా నగరాన్ని వీడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువయిపోతుంది. రైళ్లు, బస్సులు, ప్రయివేటు వాహనాలు నగరాన్ని విడిచి వెళ్లే వారితో కిక్కిరిసిపోతున్నాయి.

నిర్మాణ రంగంపై…..

చెన్నై కూడా ఇందుకు మినహాయింపు కాదు. నగరాన్ని ఎక్కువగా రోజువారీ కూలీలు విడిచి వెళ్లిపోతుండటతో ఆ ప్రభావం ఎక్కువగా నిర్మాణరంగంపై పడిందంటున్నారు. చిన్న చిన్న పనులు కూడా నిర్మాణ రంగ కార్మికులు దొరకక పోవడంతో నగరాల్లో నిలిచిపోయాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనలోకి నెట్టేశాయి. మరోవైపు ఇంటి అద్దెల మోత కూడా నగరాన్ని విడిచి కార్మికులు వెళ్లడానికి కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద నగరాలన్నీ బోసిపోయి కన్పిస్తున్నాయి. ఈ ప్రభావం ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిపై కూడా పడే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News