తిరుప‌తిలో కులాల లెక్కలు ప‌ని చేస్తాయా ?

ఏపీలో 2019 సాధార‌ణ ఎన్నిక‌ల నుంచి కులాల లెక్కలు మాయ‌మైపోయాయి. ఏ ఎన్నిక జ‌రిగినా ఓ పార్టీకి కొన్ని కులాల ఓట్లు వేస్తాయ‌ని అప్పటి వ‌ర‌కు జ‌రిగిన [more]

Update: 2021-04-16 03:30 GMT

ఏపీలో 2019 సాధార‌ణ ఎన్నిక‌ల నుంచి కులాల లెక్కలు మాయ‌మైపోయాయి. ఏ ఎన్నిక జ‌రిగినా ఓ పార్టీకి కొన్ని కులాల ఓట్లు వేస్తాయ‌ని అప్పటి వ‌ర‌కు జ‌రిగిన ప్రచారం పటాపంచ‌లు అయిపోయింది. మెజార్టీ కులాల్లో మెజార్టీ ప్రజ‌లు అధికార వైసీపీకి వ‌న్‌సైడ్‌గా ఓట్లేస్తోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. సాధార‌ణ ఎన్నిక‌లు, పంచాయ‌తీ ఎన్నిక‌లు… ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్‌, కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ అదే ప‌రిస్థితి క్లీయ‌ర్‌గా క‌నిపిస్తోంది. ఓట‌ర్ల తీర్పు ఇంత ఏక‌ప‌క్షంగా ఉన్నా ఏపీలో ఉన్న కుల రాజ‌కీయాలు, కుల వైష‌మ్యాలు, కుల విమ‌ర్శల నేప‌థ్యంలో తిరుప‌తి పార్లమెంటు ఉప ఎన్నిక‌ల వేళ కూడా ఈ కులాల గోల మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది.

సామాజిక వర్గాల వారీగా…..

తిరుప‌తిలో వైసీపీ గెలుస్తుంద‌న్నదే క్లారిటీగా ఉంది. అయితే ఆ పార్టీకి ఎంత మెజార్టీ వ‌స్తుంద‌న్నది మాత్రమే చూడాలి. ఇక తిరుప‌తిలో పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో బీజేపీ అభ్యర్థి మిన‌హా మిగిలిన పార్టీల నేత‌లు అంద‌రు మాల సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ర‌త్నప్రభ‌ది మాదిగ సామాజిక వ‌ర్గం. కానీ ఈ పార్లమెంటు ప‌రిధిలో ఎక్కువ మంది మాల వ‌ర్గం ఓట‌ర్లే ఉన్నారు. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు డాక్ట‌ర్ గురుమూర్తి, ప‌న‌బాక ల‌క్ష్మి, చింతా మోహ‌న్‌లు మాల సామాజిక‌వ‌ర్గానికి చెందినవారు. ఇక ఇప్పటి వ‌ర‌కు ఉన్న చ‌ర్చల ప్రకారం చూస్తే మాల వ‌ర్గం వైసీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు. మాదిగ‌ల్లో నిన్న మొన్నటి వ‌ర‌కు టీడీపీకి ఎక్కువ మంది స‌పోర్టర్లు ఉండేవారు. అయితే ఇటీవ‌ల వీరు కూడా వైసీపీకి వ‌న్‌సైడ్‌గా జై కొడుతోన్న ప‌రిస్థితి.

టీడీపీ ఓటు బ్యాంకు ను…..

ఏదెలా ఉన్నా మాదిగ‌ల్లో కాస్తో కూస్తో ఆశ ఉన్న టీడీపీ ఓటు బ్యాంకుకు ర‌త్నప్రభ గండికొడ‌తార‌న్న చ‌ర్చలు స్థానికంగా స్టార్ట్ అయ్యాయి. ర‌త్నప్రభకు ఉన్న వ్యక్తిగ‌త ఇమేజ్ నేపథ్యంలో అయినా టీడీపీ ఓటు బ్యాంకు కొంత వ‌ర‌కు ఆమె వైపు ట‌ర్న్ అవుతుంద‌ని అంటున్నారు. ఇక సీపీఎం అభ్యర్థికి సీపీఐ మ‌ద్దతు తెలిపింది. వీళ్లు కూడా 20 వేలో 30 వేలో ఓట్లు చీల్చితే అది కూడా వైసీపీ అభ్యర్థికే లాభించే అవ‌కాశం ఉంది. వాస్తవంగా టీడీపీ + సీపీఐ ఓ అండ‌ర్ స్టాండింగ్‌తో ముందుకు వెళుతోన్న నేప‌థ్యంలో తిరుప‌తిలో సీపీఐ సీపీఎం అభ్యర్థికి మ‌ద్ద‌తు ఇవ్వడంతో టీడీపీలో దెబ్బలో మ‌రో ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్లయ్యింది. ఈ ఈక్వేష‌న్లు అన్ని వైసీపీకి ప్లస్ అయ్యేలా ఉంటే బీజేపీ ఈక్వేష‌న్లు మ‌రోలా ఉన్నాయి.

ఎవరి లెక్కలు వారివే…?

మిగిలిన పార్టీల అభ్యర్థులు మాల‌లు అవ్వడంతో ఆ వ‌ర్గం ఓట్లు చీలిపోతాయ‌ని.. మాదిగ‌ల ఓట్లు త‌మ అభ్యర్థి ర‌త్నప్రభ‌కే ప‌డ‌తాయ‌ని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఇక ప‌వ‌న్ స‌పోర్టుతో పార్లమెంటు ప‌రిధిలో తిరుప‌తి, శ్రీకాళ‌హ‌స్తిలో ఎక్కువుగా.. మిగిలిన చోట్ల కూడా ఓ మోస్తరుగా ఉన్న బలిజ వ‌ర్గం ఓట‌ర్లు కూడా త‌మ పార్టీకే ఓటు వేస్తార‌ని ఆ పార్టీ లెక్కల్లో మునిగి తేలుతోంది. ఎప్పుడూ క‌ుల స‌మీక‌ర‌ణ‌ల్లో ఉండే టీడీపీ ఈ సారి వీటిపై అంత‌గా ఆశ‌లు పెట్టుకున్నట్టు క‌న‌ప‌డక‌పోవ‌డం ఇక్కడ మ‌రో విశేషం.

Tags:    

Similar News