ఆ టీడీపీ జంపింగ్ నేత‌.. సైలెంట్‌.. రీజ‌నేంటి

ఆయ‌న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లాలో టీడీపీని ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. జ‌గ‌న్‌ను ఆయ‌న సొంత జిల్లాలోనే భూస్థాపితం చేయాల‌ని [more]

Update: 2019-09-09 05:00 GMT

ఆయ‌న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లాలో టీడీపీని ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. జ‌గ‌న్‌ను ఆయ‌న సొంత జిల్లాలోనే భూస్థాపితం చేయాల‌ని ప‌క్కా వ్యూహంతో ముందుకు క‌దిలాడు. ఈ క్ర‌మంలోనే 2017లో వ‌చ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ బాబాయి, దివంగ‌త వివేకాను ఓడించేలా వ్యూహం ప‌న్ని అమ‌లు చేసి సాధించారు. ఆ త‌ర్వాత కూడా జిల్లాలో ప‌ట్టు సాధించేందుకు యువ‌త‌ను పార్టీలో చేర్చుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు రెండు మూడు మాసాల ముందు క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ పేరుతో హ‌డావుడి చేశాడు. ఆయ‌నే సీఎం ర‌మేష్‌.

టార్గెట్ చేయడంతో…..

చంద్ర‌బాబుకు క‌డప జిల్లా వ్య‌వ‌హారాల్లో త‌ల్లో నాలిక‌లా వ్య‌వ‌హ‌రించిన సీఎం ర‌మేష్ విప‌క్షాల‌పై అప్ప‌ట్లో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. రాజ్య‌స‌భ‌ స‌భ్యుడిగా కూడా ఏపీ వాణిని వినిపించ‌డంలో ముందున్నారు. ఈ క్ర‌మంలోనే రెండో సారి కూడా చంద్ర‌బాబు సీఎం ర‌మేష్ కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని ఖ‌రారు చేశారు. అయితే, ఏమైందో ఏమో తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మితో సీఎం ర‌మేష్ అనూహ్యంగా పార్టీకి రాం రాం చెప్పి బీజేపీలోకి చేరిపోయారు. అయితే, అప్ప‌టికే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం సీఎం ర‌మేష్‌ను టార్గెట్ చేసింది. ఆయ‌న‌పై ఐటీ స‌హా.. సీబీఐ దాడుల‌ను ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు మౌనం వ‌హించారు.

ఎక్కడా కన్పించకుండా….

దీంతో సీఎం ర‌మేష్ బాబుపై అలిగి పార్టీ మారిపోయార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ఇక‌, పార్టీలో మ‌రో కీల‌క నాయ‌కుడు, ఎంపీ సుజ‌నా చౌద‌రితో క‌లిసి ఒకే సారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు సీఎం ర‌మేష్‌. అయితే, సుజ‌నా యాక్టివ్‌గానే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో వ‌చ్చిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో స్వ‌యంగా బీజేపీ నేత‌ల‌తో క‌లిసి సుజ‌నా అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. అయితే, సీఎం ర‌మేష్ మాత్రం ఎక్క‌డా క‌నిపించక పోవ‌డం, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఎలాంటి విమ‌ర్శ‌లూ చేయ‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో నింపింది.

కాంట్రాక్టులు రద్దు కావడంతో….

అంతేకాదు, తాజాగా సీఎం ర‌మేష్ కంపెనీ రిత్విక్ కాంట్రాక్ట్ ద‌క్కించుకున్న గాలేరు-న‌గ‌రి ప్రాజెక్టును జ‌గ‌న్ ర‌ద్దు చేశారు. దీంతో 432 కోట్ల మేర‌కు ర‌మేష్‌కు న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయినా కూడా ఆయ‌న వ్యూహాత్మ‌కంగా మౌనం పాటిస్తున్నారు. మ‌రోవైపు ఏపీ బీజేపీలో ఇప్పుడు సుజ‌నా హ‌డావిడే ఎక్కువుగా ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు సుజ‌నా, సీఎం ర‌మేష్ ఇద్ద‌రు టీడీపీ టిక్కెట్ల కేటాయింపులో కీల‌కంగా ఉన్నారు. ఫ‌లితాల త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసే బీజేపీలోకి వెళ్లారు.

వేచి చూద్దామనేనా?

ఇప్పుడు బీజేపీలో పాత నాయ‌కుల‌ను డామినేట్ చేస్తూ సుజ‌నా దూసుకుపోతున్నారు. మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ ఇలా ఎక్క‌డ చూసినా ఆయ‌న హంగామానే ఉంది. ఇటు ఏపీలో జ‌గ‌న్ పాల‌న‌పై కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా.. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌మ సంస్థ కాంట్రాక్ట్ ర‌ద్దు చేసినా సీఎం ర‌మేష్ ఇంత‌టి మౌనం వెనుక ఏం ఉంటుందోన‌ని విశ్లేష‌కులు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి ఎప్ప‌టికి ఆయ‌న మౌనం వీడుతారో చూడాలి.

Tags:    

Similar News