ఇలాగయితే అంతే మరి

ఔను..! చారిత్రక త‌ప్పిదాల‌కు కేరాఫ్‌గా ఉన్న క‌మ్యూనిస్టుల చుట్టూ ఇప్పుడు ఈ ప్రశ్నే గింగిరాలు తిరుగుతోంది. స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా.. అంశంపై అవ‌గాహ‌న కూడా లేకుండా ఎవ‌రైనా [more]

Update: 2020-01-02 09:30 GMT

ఔను..! చారిత్రక త‌ప్పిదాల‌కు కేరాఫ్‌గా ఉన్న క‌మ్యూనిస్టుల చుట్టూ ఇప్పుడు ఈ ప్రశ్నే గింగిరాలు తిరుగుతోంది. స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా.. అంశంపై అవ‌గాహ‌న కూడా లేకుండా ఎవ‌రైనా ఇత‌ర పార్టీల నేత‌లు ఆందోళ‌న‌ల‌కు దిగారంటే అర్ధం ఉంటుంది. సుదీర్గ రాజ‌కీయ చ‌రిత్ర, విష‌య ప‌రిజ్ఞానం ఉన్న నాయ‌కులుగా పేరు తెచ్చుకున్న క‌మ్యూనిస్టులు కూడా విష‌యంపై అవ‌గాహ‌న లేకుండా ముందుకు పోతుండ‌డం, నారాయ‌ణ వంటి నాయకులు వివాదాలే కేంద్రంగా వ్యాఖ్యలు చేయ‌డం వంటి ప‌రిణామాలు మ‌ళ్లీ కామ్రేడ్లు చారిత్రక త‌ప్పులు చేస్తున్నారా ? అనే ప్రశ్న ఉద‌యించేలా చేస్తోంది.

కొన్నేళ్ల నుంచి…..

గ‌డిచిన ఐదు సంవ‌త్సరాల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటే.. కామ్రేడ్లను ప్రజ‌లు ఎక్క‌డా గుర్తించ‌డం లేద‌నే విష‌యం స్పష్టమ‌వుతోంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయారు. సొంత ప్రస్థానం లేని క‌మ్యూనిస్టులు.. ప‌రాన్న జీవులుగా రాజ‌కీయాలు చేస్తున్న క‌మ్యూనిస్టులు.. విష‌యంపై ఔచిత్యం లేని విమ‌ర్శలు చేయ‌డం ద్వారా త‌మ విలువ‌ను తామే త‌గ్గించుకుంటున్నార‌నే విమ‌ర్శల‌ను మూట‌గ‌ట్టు కోవ‌డం ష‌రా.. మామూలే అన్న విధంగా మారిపోయింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ‌ధానిలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌కు కామ్రేడ్లు మ‌ద్దతిచ్చారు.

ఇవేం మాటలు….?

ఆ మాట కొస్తే.. ఎక్కడ ప‌ది మంది రోడ్లపై కూర్చుంటే.. అక్కడ ఎర్ర‌జెండాలు వెలుస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. విష‌యం ఏంట‌నేది తెలుసుకుని ముందుకు సాగాల్సిన కామ్రేడ్లు.. ఇలా వ్యవ‌హ‌రించ‌డంపై క‌మ్యూనిస్టుల్లోనే ద్వంద్వ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నేడు జ‌రుగుతున్నది ఏంటి? రాష్ట్రంలో పాల‌నను వికేంద్రీక‌రిస్తామంటూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యల‌పై ర‌గ‌డ‌. దీనిపై నిబ‌ద్ధత ఉన్న క‌మ్యూనిస్టులు అయితే, ముందు అస‌లు విష‌యం ఏంటి? అనేదానిపై దృష్టి పెట్టాలి. కానీ, అలా ఎక్కడా క‌నిపించ‌డం లేదు. “రాజీనామాలు చేసి.. మ‌ళ్లీ గెలిచి .. అప్పుడు రాజ‌ధానిని త‌ర‌లించండి“- అన్న నారాయ‌ణ వ్యాఖ్యలు ఓ వ‌ర్గం మీడియాకు నేడు క‌డుపు నింపొచ్చునేమో కానీ.. విష‌యంపై దృష్టి పెట్టే నిజ‌మైన క‌మ్యూనిస్టుల‌కు త‌ప్పుగానే తోస్తోంది.

చర్చ పెట్టి నిలదీయాల్సి ఉన్నా….

ఏ ప్రభుత్వమైనా.. కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ప్రజ‌ల‌కు ప్రతిరూప‌మైన అసెంబ్లీలో చ‌ర్చించాలి. ఆ దిశ‌గా చ‌ర్యలు తీసుకోని ప్రభుత్వాన్ని నిల‌దీయాలి. ఇక్కడ అస‌లు జ‌రుగుతున్న విష‌యం ఏంటి ? విశాఖ‌, అమ‌రావ‌తి, క‌ర్నూలుకు రాజ‌ధానుల‌ను త‌ర‌లించ‌డం. ఇలా చేయ‌డం వ‌ల్ల రాష్ట్రం అభివృధ్ధి చెందుతుందా? లేదా ? అనే కీల‌క విష‌యాన్ని క‌మ్యూనిస్టులు చ‌ర్చకు పెట్టి ఆ త‌ర్వాత మ‌ద్దతు ప్రక‌టిస్తే.. వారి ఔచిత్యం వంద రెట్లు పెరిగి ఉండేది. కానీ, ఎక్కడ న‌లుగురు గుమిగూడితే.. అక్కడ జెండా పాతేందుకు ప్రయ‌త్నించ‌డం, ఎవ‌రు కొత్తగా పార్టీ పెడితే.. వారి భుజాల‌పై ఎక్కేందుకు ప్రయ‌త్నించ‌డం వంటివి కామ్రేడ్లకు ఎవ‌రు నేర్పించారో కానీ.. ఇలా అయితే, కొన్ని శ‌తాబ్దాల త‌ర్వాత కూడా కామ్రేడ్లు పుంజుకునే ప‌రిస్థితి ఉండ‌ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

Tags:    

Similar News