కమ్యూనిస్టులకు కలిసొస్తుందా ?

కమ్యూనిస్టులకు ప్రజాసమస్యల మీద ఆందోళనలు చేపట్టడం కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే వారుండబట్టే చాలా సమస్యలు కనీసం పాలకుల దృష్టిలోకి వెళ్తున్నాయనుకోవాలి. అయితే కొత్త మిలీనియంలో మాత్రం [more]

Update: 2020-10-15 12:30 GMT

కమ్యూనిస్టులకు ప్రజాసమస్యల మీద ఆందోళనలు చేపట్టడం కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే వారుండబట్టే చాలా సమస్యలు కనీసం పాలకుల దృష్టిలోకి వెళ్తున్నాయనుకోవాలి. అయితే కొత్త మిలీనియంలో మాత్రం వామపక్షాల జోరు బాగా తగ్గింది. వారు కూడా బూర్జువా పార్టీల సరసన చేరి ఒకటో రెండో సీట్లతో సరిపెట్టుకుంటున్నారు. ఉద్యమాలను తగ్గించేశారు అన్న భావన అంతటా ఉంది. కానీ కాలం ఎపుడూ ఒకేలా ఉండదు, పైగా బీజేపీకి వామపక్షాలకు తూర్పు పడమరల అంత తేడా ఉంది. రెండు పార్టీలకు కచ్చితమైన సిద్ధాంతాలు ఉన్నాయి. వారు ఆ సిద్ధాంతాల కోసం ఎంతటి రాద్ధాంతానికైనా వెరవరు అంటారు.

చాన్స్ ఇస్తున్నారా …?

కేంద్రంలోని బీజేపీ ఇపుడు ఎదురులేదనుకుని అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో విద్యుత్ సంస్కరణలు ఒకటైతే, వ్యవసాయ బిల్లుల్లో మార్పులు మరొకటి. ఇవి పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలోని రైతాంగం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయనడంతో సందేహం లేదు. దేశంలో ఈ నిర్ణయాలను పదికి పైగా పార్టీలు వ్యతిరేకించాయి. ఇక తెలంగాణాలో కేసీయార్ సర్కార్ కాదంటోంది. మరో వైపు అక్కడ కాంగ్రెస్, వామపక్షాలు కూడా బీజేపీ మీద సమరం చేస్తున్నాయి. ఏపీలో మాత్రం వేరే సీన్ ఉంది. ఇక్కడ అన్ని పార్టీలూ బీజేపీకే మద్దతు అన్నట్లుగా ఉన్నాయి. దాంతో కమ్యూనిస్టులకు చాన్స్ వస్తోంది.

మీటర్లే రూట్ మారుస్తాయా…?

గ్రామాల్లో రైతుల పంప్ సెట్లకు మీటర్లు బిగించి చూడండి, మీ సర్కార్ పతనం ఆ రోజుతోనే మొదలవుతుంది అని వామపక్షాలు జగన్ని హెచ్చరిస్తున్నాయి. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక చర్య. ఒక విధంగా రైతులను నట్టేట ముంచే చర్య అంటూ ఏపీలో కమ్యూనిస్టులు గట్టిగానే మాట్లాడుతున్నారు. ఈ విషయంలో జగన్ సర్కార్ తప్పు చేస్తోందని, సవరించుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని కూడా కామ్రేడ్స్ గర్జిస్తున్నారు. ఏపీలో ఇపుడు ఎర్రన్నలకు ఒక్క కాంగ్రెస్ తప్ప మరో పార్టీ వత్తాసుగా లేదు కానీ వారు పెద్ద ప్రజా ఉద్యమానికే సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.

కొత్త వేదికగా….

చంద్రబాబు డబుల్ స్టాండర్స్ ని కూడా ఏపీలో కామ్రేడ్స్ రామకృష్ణ, మధు ఎండగడుతున్నారు. ఆయన మోడీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారని అంటున్నారు. అదే విధంగా ప్రత్యేక హోదా అంటూ నినదించిన పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ పంచన చేరారని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జగన్ అయితే కేంద్రానికి వంగి వంగి నమస్కరిస్తున్నారని కూడా గుస్సా అవుతున్నారు. ఇదంతా చూస్తూంటే ఏపీలో వామపక్షాలు సొంతంగానే రాజకీయ మైదానంలో తేల్చుకోవాలనుకుంటున్నట్లుగా సీన్ కనిపిస్తోంది. దానికి ముడి సరకు రెడీగా ఉంది. రైతులతో మొదలు పెట్టి ప్రత్యేక హోదా దాకా గళం విప్పి రోడ్డు మీదకు వస్తే ఏపీలో రెండవ వైపు రాజకీయంలో కొంత వాటా అయినా దక్కుతుందన్న ఆశ వారిలో ఉన్నట్లు ఉన్నట్లుంది. ఇంతకాలం రాంగ్ రూట్ పాలిటిక్స్ నడిపినా సరైన సమయంలో ట్రాక్ లోకి వచ్చినట్లుగానే ఉంది. ఇపుడున్న స్థితిలో ఇతర పార్టీలు ఏవీ మోడీని వదిలి వచ్చేందుకు సిద్ధంగా లేవు. కాంగ్రెస్ తో కలసి వామపక్షాలు ఉద్యమాలు చేస్తే ఏపీలో నాలుగవ ఆల్టర్నేషన్ కి వేదిక ఏర్పాటు అవుతుందేమో చూడాలి.

Tags:    

Similar News