దరువు…దరువు…దరువు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలూ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వ్యూహరచనలో తలమునకలవుతున్నాయి. ప్రత్యర్థుల ఎత్తులను ఎలా చిత్తు చేయాలో ఆలోచిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన [more]

Update: 2019-08-11 16:30 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలూ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వ్యూహరచనలో తలమునకలవుతున్నాయి. ప్రత్యర్థుల ఎత్తులను ఎలా చిత్తు చేయాలో ఆలోచిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, అఖిల భారత కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు భారతీయ జనతా పార్టీ శివసేన కూటమి సర్వశక్తులూ ఒడ్డుతుండగా, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి హస్తం పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. లోక్ సభ ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అంతటా ఆసక్తి నెలకొంది.

పైచేయి సాధించేందుకు…..

ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర సారధులను మార్చి కొత్తవారిని ఆ పదవుల్లో కూర్చోబెట్టాయి. అధికార భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చంద్రకాంత్ పాటిల్ ను నియమించింది. పాటిల్ ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్నారు. విపక్ష కాంగ్రెస్ కూడా పీసీసీ అధ్యక్షుడిని మార్చింది. నాందేడ్ కు చెందిన అశోక్ చవాన్ స్థానంలో బాబాసాహెబ్ తోరబ్ ను నియమించింది. ఇలా చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. యశోమణి ఠాకూర్, బసవరాజ్ పాటిల్, నితిన్ రౌత్, ముజఫర్ హుస్సేన్, విశ్వజిత్ వంటి నాయకులను కార్య అధ్యక్షులుగా నియమించింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన సామాజిక వర్గాలను సంతృప్తి పర్చే ప్రక్రియలో భాగంగా
ఈ నియామకాలు చేపట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఊపు మీద ఉన్న….

2014 అసెంబ్లీ, ఇటవల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి ఘన విజయం సాధించి మంచిఊపు మీద ఉంది. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి ఇప్పుడిప్పుడే కాళ్లు చేతులు కూడతీసుకుంటోంది. మొత్తం 288 స్థానాలకు గాను గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 125 స్థానాలు, 31.5 శాతం ఓట్లతో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షమైన శివసేన 63 స్థానాలు, 19.3 శాతం ఓట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. గత నాలుగేళ్లుగా శివసేన బీజేపీ పై ధ్వజమెత్తుతోంది. ఒకదశలో లోక్ సభ ఎన్నికల్లో పొత్తు ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు కూడా వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో కమలం దూకుడుతో శివసేన ఇప్పుడు దిగివచ్చింది. బీజేపీతో పొత్తు కాదనలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పెద్దన్నగా దానిని ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. మొత్తం 48 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 23 తన ఖాతాలో వేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. 17 స్థానాలతో శివసేన ద్వితీయ స్థానానిక పరిమితమైంది. ఈప్రాతిపదికనే రేపటి అసెంబ్లీలో సీట్ల పంపిణీ ఉంటుంది.

విపక్ష ఓట్లు చీలకుండా….

2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 42, ఎన్సీపీ 38 స్థానాలు సాధించాయి. కానీ ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ చతికలపడ్డాయి. మొత్తం 48 స్థానాల్లో ఒక్క చంద్రాపూర్ నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ స్థానం తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించి ఉంది. ఎన్సీపీ నాలుగు స్థానాలతో ఒకింత గౌరవంగానే ఉంది. పార్టీ అధినేత శరద్ పవార్ సొంత స్థానమైన బారామతిలో ఆయన కూతురు సుప్రియా సూలే విజయం సాధించారు. దీంతో పాటు సతారాతో పాటు మరో రెండు స్థానాల్లో పవర్ పార్టీ గెలుపొందింది. గతంలో కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్, ఎన్సీపీలు భావిస్తున్నాయి. మొత్తం 182 స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించాయి. ఇతర పార్టీలను కూడా కలుపుకుని పోవాలని భావిస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, రాజుశెట్టి ఆధ్వర్యంలోని స్వాభిమాన పక్ష, హితేంత్ర ఠాకూర్ నేతృత్వంలోని బహుజన్ వికాస్ అగధి, అంబేద్కర్ మనవడు సారథ్యంలోని వంచిత్ బహుజన్ అగధి పార్టీలతో చర్చలు జరపాలని భావిస్తున్నాయి. విపక్ష ఓట్లు చీలకూడదన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్-ఎన్సీపీ ముందుకు సాగుతున్నాయి. ఔరంగాబాద్ లోక్ సభ స్థానాన్ని గెలుచుకున్న ఎంఐఎం పార్టీ మహారాష‌్ట్ర ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News