కాంగ్రెస్ టిక్కెట్లకు ఫుల్ డిమాండ్‌

ఇటీవ‌లి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాభ‌వం త‌ర్వాత కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. ఊహించ‌ని స్థాయిలో ఓడిపోవ‌డాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేక‌పోయింది. దీంతో ఇక [more]

Update: 2019-02-14 00:30 GMT

ఇటీవ‌లి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాభ‌వం త‌ర్వాత కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. ఊహించ‌ని స్థాయిలో ఓడిపోవ‌డాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేక‌పోయింది. దీంతో ఇక పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు క‌నీసం అభ్య‌ర్థులైనా దొరుకుతారా అని అంతా అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ఓటింగ్ స‌ర‌ళ‌ని బ‌ట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని మొత్తం 17 పార్ల‌మెంటు సీట్లలో కేవ‌లం 2 మాత్ర‌మే గెలుచుకునే అవ‌కాశం ఉంది. అయితే, ఏ మాత్రం జంక‌ని కాంగ్రెస్ నేత‌లు పార్ల‌మెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోలా కాకుండా ఈసారి త్వ‌ర‌గా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని అధిష్ఠానం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక‌పై పీసీసీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ మేర‌కు పోటీ చేయ‌డానికి ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించారు.

ఓడిన వారూ సిద్ధ‌మ‌వుతున్నారు…

దీనికి పార్టీల నేత‌ల నుంచి బాగానే స్పంద‌న వ‌స్తోంది. మొత్తం 17 స్థానాల‌కు గానూ మొద‌టి రెండు రోజుల్లోనే 130 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇలా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను పీసీసీ కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించ‌నుంది. ఈ నెలాఖ‌రులోగా ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఈ నెల 25వ తేదీ లోగానే అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేత‌లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎక్కువ‌గా ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన అభ్య‌ర్థులు సైతం పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీకి ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి(న‌ల్గొండ‌), జానారెడ్డి(న‌ల్గొండ‌), అద్దంకి ద‌యాక‌ర్‌(పెద్ద‌ప‌ల్లి), మ‌ల్లు ర‌వి(నాగ‌ర్ క‌ర్నూలు), సంప‌త్ కుమార్‌(నాగ‌ర్ క‌ర్నూలు), వంశీచంద్ రెడ్డి(మ‌హ‌బూబ్ న‌గ‌ర్) త‌దిత‌రులు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

లైన్ లో ఉన్న సీనియ‌ర్లు

ఇక‌, సీనియ‌ర్లు కూడా ఈ ఎన్నిక‌ల‌పై క‌న్నేశార‌ని తెలుస్తోంది. మాజీ ఎంపీ వి.హ‌నుమంత‌రావు.. ఖ‌మ్మం పార్ల‌మెంటు స్థానం నుంచి, పీసీసీ కిసాన్ సెల్ అధ్య‌క్షుడు కోదండ‌రెడ్డి భువ‌న‌గిరి టిక్కెట్ ను ఆశిస్తున్నారు. ఇక‌, మాజీ ఎంపీలు మ‌రోసారి టిక్కెట్ రేసులో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాజీ ఎంపీల్లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాత్రం గెలిచారు. మిగ‌తా వారు మ‌ళ్లీ పార్ల‌మెంటు టిక్కెట్‌లు అడుగుతున్నారు. బ‌ల‌రాంనాయ‌క్‌(మ‌హ‌బూబాబాద్‌), పొన్నం ప్ర‌భాక‌ర్‌(క‌రీంన‌గ‌ర్‌), సురేష్ షేట్క‌ర్‌(జ‌హిరాబాద్‌) టిక్కెట్లు ఆశిస్తున్నారు. మ‌రి, అసెంబ్లీ ఎన్నిక‌లైన మూడు నెల‌ల్లోనే ఓట‌ర్ల మ‌న‌స్సు మారుతుంద‌ని అనుకుంటున్నారో, గెలుస్తామ‌నే న‌మ్మ‌కంతోనో కానీ లోక్‌స‌భ బ‌రిలో ఉండేందుకు నేత‌లు మొగ్గు చూపుతున్నారు. మ‌రి, ఈ నేత‌ల జాతకాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News