సీనియర్ల సినిమా అయిపోయినట్లేనా..?

వారంతా హేమాహేమీల్లాంటి నాయకులు. వారి నియోజకవర్గాలను అనేక ఏళ్లు ఎమ్మెల్యేలుగా ఏలారు. జిల్లా స్థాయిల్లోనూ తిరుగులేని నేతలుగా పనిచేశారు. మంత్రులుగా పనిచేసి రాష్ట్రస్థాయికి ఎదిగారు. అంతటి నాయకులకు [more]

Update: 2018-12-28 08:00 GMT

వారంతా హేమాహేమీల్లాంటి నాయకులు. వారి నియోజకవర్గాలను అనేక ఏళ్లు ఎమ్మెల్యేలుగా ఏలారు. జిల్లా స్థాయిల్లోనూ తిరుగులేని నేతలుగా పనిచేశారు. మంత్రులుగా పనిచేసి రాష్ట్రస్థాయికి ఎదిగారు. అంతటి నాయకులకు ఇటీవలి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేదు ఫలితాలు మిగిల్చాయి. కొందరు నాయకుల రాజకీయ భవిష్యత్ కి ముగింపు పలికాయి. ఇక, వారు అసెంబ్లీలోకి అడుగుపెట్టి ‘అధ్యక్షా’ అని పిలిచే అవకాశాన్ని కోల్పోయినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలుగా కొనసాగిన కొందరు నేతలకు ఇటీవలి ఎన్నికలే చివరి వాటిలా కనిపిస్తున్నాయి. పలువురు నేతలు వరుసగా రెండు ఎన్నికలు ఓడిపోవడం, వయస్సు మీద పడటంతో వారి రాజకీయ జీవితం ముగిసినట్లే అని అంటున్నారు. ఇక, వరుసగా ఓడిపోయే వాళ్లకు, 70 దాటిన వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు రాహుల్ గాంధీ సైతం అంత ఇష్టంగా లేరు. దీంతో సీనియర్ల సినిమా అయిపోయినట్లే కనిపిస్తోంది.

వారసుల రంగప్రవేశం…

పలుమార్లు ముఖ్యమంత్రి రేసులో ఉండి గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన జానారెడ్డిది ఇదే పరిస్థితి. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, ఎక్కువ శాఖలకు మంత్రిగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. ఆయన వయస్సు 70కి పైనే. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం అనుమానమే. ఇప్పటికే ఆయన రాజకీయ వారసుడిగా రఘువీర్ రెడ్డి తెరపైకి వచ్చారు. జానారెడ్డికి అవకాశం వస్తే 2019 లోక్ సభకు పోటీచేసే అవకాశం ఉంది. అదీ కుదరకపోతే మాత్రం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దురమవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యది కూడా ఇదే పరిస్థితి. ఆయన జనగామ నుంచి రెండుసార్లు భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన వయస్సు కూడా 70 దాటింది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు తక్కువే. పొన్నాల స్థానంలో ఆయన కోడలు పొన్నాల వైశాలి తెర మీదకు వస్తారనే ప్రచారం జరుగుతోంది.

వయస్సు మీద పడటంతో…

ఇక, మెదక్ జిల్లాలో సుదీర్ఘకాలంగా అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న గీతారెడ్డిది కూడా ఇదే పరిస్థితి. మంత్రిగా పనిచేసిన ఆమె ఇటీవలి ఎన్నికల్లో జహిరాబాద్ నుంచి ఓటమి పాలయ్యరు. ఆమె వయస్సు కూడా 70 దాటింది. దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ప్రొఫెషనల్ కాంగ్రెస్ లో ఉన్న ఆమె పార్టీకి సేవలందించనున్నారు. ఇక, బోధన్ నుంచి వరుసగా రెండుసార్లు ఓటమిపాలైన సుదర్శన్ రెడ్డి వయస్సు కూడా సుమారు 70 ఏళ్లు. దీంతో వచ్చేసారి ఆయన కూడా పోటీ చేయడం అనుమానమే. టీడీపీలో ఒక దశలో వెలుగు వెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి కూడా ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూరమైనట్లే కనిపిస్తోంది. ఆయన గత ఎన్నికల్లో ఎంపీగా, ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. ఆయన వచ్చేసారి పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఆయన కుమారుడిని రాజకీయ వారసుడిగా తెరపైకి తెస్తారని తెలుస్తోంది.

ప్రత్యామ్నాయం లేక…

ఇక, జగిత్యాల నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన జీవన్ రెడ్డి కూడా ఎన్నికల్లో పోటీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఆయన గత ఎన్నికల్లోనే పోటీచేయనని కూడా చెప్పారు. వచ్చే ఎన్నకల్లో ఆయన పోటీకి దూరంగా ఉండవచ్చు. మంత్రిగా పనిచేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేటలో వరుసగా రెండుసార్లు ఓటమి పాలయ్యారు. ఆయన కూడా ఇక ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇదే సమయంలో కామారెడ్డిలో షబ్బీర్ అలీ వరుసగా మూడుసార్లు ఓడిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ్మ కూడా ఆందోల్ లో వరుసగా రెండుసార్లు ఓటమి పాలయ్యారు. నర్సాపూర్ లో సునీతా లక్ష్మారెడ్డి కూడా రెండుసార్లు ఓడిపోయారు. అయితే, వీరి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయం లేకపోవడం, ఇంకా రిటైర్మెంట్ వయస్సు రాకపోవడంతో వీరు మాత్రం పోటీ చేయవచ్చు. మొత్తానికి ఒకప్పుడు హేమాహేమీలుగా ఉన్న నాయకులు… ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో ఉండాలనుకున్న వారు కూడా ఇక రిటైర్ అయినట్లే కనిపిస్తోంది.

Tags:    

Similar News