సీఎంల కొడుకులే ఎందుకిలా…?

సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఓ సెంటిమెంట్ వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పార్టీని నమ్ముకున్న కుటుంబాలే కాంగ్రెస్ ను [more]

Update: 2019-01-27 13:30 GMT

సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఓ సెంటిమెంట్ వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పార్టీని నమ్ముకున్న కుటుంబాలే కాంగ్రెస్ ను వీడిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీనే ప్రాణంగా భావించి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి కుటుంబాలు కాంగ్రెస్ ను వీడటం ఓ సెంటిమెంట్ గా కనిపిస్తోంది. తండ్రులు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలగగా వారి తనయులు మాత్రం పార్టీ పట్ల అసంతృప్తితో ఉంటున్నారు. చాలా వరకు పార్టీని కూడా వీడి వెళ్లిపోతున్నారు. అయితే, ఇందులో పార్టీ స్వయంకృతం కూడా చాలా ఉందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి కుటుంబాలు క్రమంగా పార్టీకి దూరమయ్యాయి.

పార్టీ స్థాపించిన వైఎస్ జగన్…

ఈ లిస్టులో ముందుండేది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం. గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని అమితంగా అభిమానించిన వైఎస్ పార్టీలో కీలకంగా ఎదిగారు. రెండుసార్లు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. అయితే, ఆయన మరణించిన తర్వాత ఆయన కుటుంబం కాంగ్రెస్ ని వీడింది. ఆయన కుమారుడిపై ఆంక్షలు విధించడంతో బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకొని కాంగ్రెస్ ని భారీగా దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. ఇక, నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర రాజకాయాల్లో కీలకంగా వ్యవహరించి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుటుంబం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఆయన కుమారుడు రామ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి మొదట బీజేపీలో చేరారు. ఇటీవలే ఆయన వైసీపీలో చేరిపోయారు. ఇక, కాంగ్రెస్ లో కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన జలగం వెంగళరావు కుటుంబం కూడా ఇవాళ కాంగ్రెస్ లో లేదు. ఆయన కుమారులు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఖమ్మం జిల్లాలో కీలక నేతలుగా ఉన్నారు. ఇక, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా దేశ ప్రధానిగా కూడా పనిచేసిన పీవీ నరసింహారావు కుటుంబం కూడా కాంగ్రెస్ లో యాక్టీవ్ గా లేదు. కొంతకాలం ఆయన కుమారులు పార్టీలో పనిచేసినా ఇప్పుడు ఆ కుటుంబం నుంచీ ఎవరూ కాంగ్రెస్ లో గానీ, రాజకీయాల్లో గానీ లేరు. ఇక, 2014కి ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ ను వీడి ఇటీవల మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. అయితే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకంగా పనిచేసిన ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

పార్టీలో ఉన్నా నామమాత్రమే…

ఇక, తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ నేతగా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు మర్రి చెన్నారెడ్డి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి చెరగని ముద్ర వేసిన ఆయన కుటుంబం కాంగ్రెస్ లో నామమాత్రమయ్యింది. ఆయన కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి పార్టీలో చురుగ్గానే ఉంటున్నా… ఇటీవల ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు. అయితే, కాంగ్రెస్ పై అభిమానంతో ఆయన పార్టీలోనే పనిచేస్తున్నారు. కానీ, ఆయన కుమారుల్లో ఒకరు మాత్రం తెలంగాణ జన సమితి పార్టీలో చేరిపోయారు. ఇక, కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబం కూడా రాజకీయంగా కాంగ్రెస్ లో యాక్టీవ్ గా లేదు. ఆయన కుమారుడు కాసు వెంకటకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా క్రీయాశీలకంగా లేరు. ఇక, ఆయన వారసుడిగా కాసు మహేష్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చురుగ్గా పనిచేస్తున్నారు.

కోట్ల కుటుంబం కూడా….

ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసుకున్న టి.అంజయ్య కుటుంబం కాంగ్రెస్ లోనే ఉన్నా నామమాత్రంగా పనిచేస్తున్నారు. ఇక, వైఎస్ మరణం తర్వాత కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య కుటుంబం మాత్రం రాజకీయాల్లో లేదు. ఇక, తాజాగా ఏపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తుందని నిర్ణయం తీసుకోవడంతో అసంతృప్తితో ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆయన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ లో కీలకనేతగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతల కుటుంబాలు రాజకీయంగా కాంగ్రెస్ తో ఉండలేకపోయాయి. ఉన్నా నామమాత్రంగా ఉన్నారు. అయితే, ఇది కొత్త వారికి అవకాశాలు వచ్చేలా చేసినా కాంగ్రెస్ బలహీనంగా మారడానికి కూడా కారణమైంది.

Tags:    

Similar News