మళ్లీ మొదటికొస్తుందా? మరోసారి తప్పదా?

దేశంలో కరోనా వైరస్ వ్యాధి రోజురోజుకూ పెరిగిపోతుంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య ఇతర [more]

Update: 2020-07-15 17:30 GMT

దేశంలో కరోనా వైరస్ వ్యాధి రోజురోజుకూ పెరిగిపోతుంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే కొంత నయమే అనిపించినా, భారత్ కరోనా కేసుల విషయంలో ప్రపంచంలో మూడో స్థానంలోకి చేరుకుంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో…..

ప్రధానంగా దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లోనే 90 కేసులు నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. మిగిలిన రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉన్నప్పటికీ అంత ప్రమాదకరంగా లేదు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చిన తర్వాత కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. తెలంగాణ, కర్ణాటకలకు ప్రత్యేకంగా కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా కట్టడికి ప్రత్యేక సూచనలు చేసింది.

కేసులన్నీ ఇక్కడే…..

ఒక్క మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరుకుంది. గతంలో కేసుల సంఖ్య భారత్ లో రోజుకు వెయ్యికి మించేవి కావు. ప్రస్తుతం రోజుకు 25 వేలకు తగ్గకుండా భారత్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆందోళనకల్గించే అంశమే. అయితే రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కొంత ఉపశమనం కల్గిస్తుంది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 60 శాతం కేసులు ఢిల్లీ, మహారాష్ట్రల్లోనే నమోదవుతున్నాయి. మరోసారి దేశంలో లాక్ డౌన్ ను విధించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

అందుకే మళ్లీ లాక్ డౌన్…..

దీంతో ఇతర రాష్ట్రాలు ఆందోళనలో ఉన్నాయి. లాక్ డౌన్ మినహాయింపులవల్లనే కేసులు పెరుగుతున్నాయని భావించి తిరిగి లాక్ డౌన్ ను విధిస్తున్నాయి. చెన్నైలో కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. బీహార్ లోని పాట్నా లో లాక్ డౌన్ ను పెట్టాల్సి వచ్చింది. మహరాష్ట్రలోని ఔరంగాబాద్, పూనేల్లో కూడా లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. పశ్చిమబెంగాల్ లో కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా మళ్లీ లాక్ డౌన్ విధించింది. ఇలా దేశంలో అనేక రాష్ట్రాలు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తిరిగి లాక్ డౌన్ ను విధిస్తున్నాయి.

Tags:    

Similar News