ఇజ్రాయిల్ అందరికీ ఆదర్శమేగా?

ఇజ్రాయెల్…పశ్చిమాసియాలోని ఈ యూదు దేశం ప్రస్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. దాని విధానం ఎప్పుడూ విభిన్నమే. ఎంతటి క్లిష్ట విషయంలోనూ ఇతర దేశాలను అనుసరించాలని అనుకోదు. అనుకరణకు ఎంతమాత్రం [more]

Update: 2021-05-23 16:30 GMT

ఇజ్రాయెల్…పశ్చిమాసియాలోని ఈ యూదు దేశం ప్రస్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. దాని విధానం ఎప్పుడూ విభిన్నమే. ఎంతటి క్లిష్ట విషయంలోనూ ఇతర దేశాలను అనుసరించాలని అనుకోదు. అనుకరణకు ఎంతమాత్రం అవకాశం ఇవ్వదు. దాని బదులు తనదైన సొంత విధానంతో ముందుకు సాగుతుంటుంది. అదే దాని ప్రత్యేకత. చుట్టూ శత్రుదేశాలైన అరబ్ దేశాల మధ్య ఉండే ఈ చిన్న దేశం అనుక్షణం అప్రమత్తంగా ఉంటుంది. శత్రువుల కదలికలను గుర్తించడం, వారిని అంతమొందించడంలో వేగంగా ప్రతిస్పందిస్తుంది. ఇక్కడి ప్రజల పట్టుదల, పోరాట పటిమ నుంచి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత నేర్చుకోవలసిన అవసరం ఉంది. ప్రతి విషయంలోనూ ప్రపంచాని కంటే ఒక అడుగు ముందుండటం దాని ప్రత్యేకత. ఈ దేశ ప్రగతి ప్రస్థానం చూసినప్పుడు ఆశ్ఛర్యం కలగక మానదు.

ఎలాంటి ఆంక్షలు లేవు….

కనీసం కోటి మంది జనాభా కూడా లేని ఈ బుల్లి దేశం ఇప్పుడు కరోనా నియంత్రణలో యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. అగ్రరాజ్యాలు, అబివద్ధి చెందిన దేశాల తో సహా యావత్ ప్రపంచం కరోనాతో తల్లడిల్లుతున్న వేళ ఈ యూదు దేశం దాదాపుగా కరోనాను జయించడం విశేషం. ఈ లక్ష్య సాధనలో ఇజ్రయెల్ అనుసరించిన విధానం ఆదర్శమని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కానేకాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల కదలికలపై ఎలాంటి నియంత్రణలు లేవు. ప్రభుత్వపరమైన ఆంక్షలు లేవు. స్వేచ్చగా సంచరించవచ్చు. ఎక్కడికైనా వెళ్లవచ్చు. బీచ్ లు, పర్యాటక ప్రదేశాల్లో విహరించవచ్చు. షాపింగ్ మాళ్లలో కొనుగోళ్లు చేయవచ్చు. బస్సులు, రైళ్లు, విమాన ప్రయాణాలపై ఎలాంటి నిషేధాలు లేవు, ఒక్క మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా పర్యటించవచ్చు. ఎలాంటి నిర్బంధాలు లేవు. మాస్కులు ధరించాలన్న నిబంధనలు లేనేలేవు. భౌతిక దూరం, శానిటౌజర్ల వాడకం వంటి తలనొప్పులు లేవు. మే ఒకటి నుంచి విదేశీ యాత్రికులను కూడా అనుమతించనున్నారు.

సైన్యాన్ని రంగంలోకి దించి…

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కాలు కదపాలంటే భయపడుతున్నారు. కానీ ఇజ్రయెల్ ప్రజలకు మాత్రం ఎలాంటి భయాలు లేవు. ఇజ్రాయెల్ పాలకులు కరోనాను కఠినంగా అణచివేశారు. మహమ్మారి పీచమణచడంలో ఎక్కడా ఏ విషయంలోనూ రాజీపడలేదు. సర్కారు గట్టి చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 9 నెలల పాటు కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేశారు. లాక్ డౌన్ అమలులో పోలీసులకు సాయపడేందుకు ఏకంగా సైన్యాన్నే రంగంలోకి దించింది. అన్ని రకాల ప్రజల రుణాలపై మారటోరియం విధించారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసింది. పేద, మధ్యతరగతి, ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం అందించింది. దాదాపు 90 లక్షలకు పైగా గల జనాభాకు ఉచితంగా వ్యాక్సిన్ టీకా వేసింది. సుమారు 60 శాతం మందికి రెండో డోసు టీకాను వేసింది. మిగిలిన ప్రజలకు కూడా రెండో డోసు అందించేందుకు వేగంగా ముందుకు సాగుతోంది.

వ్యాక్సిన్ కూడా సొంతంగా…

వ్యాక్సిన్ కు అగ్రరాజ్యం, అభివద్ధి చెందిన దేశాలపై ఆధారపడకుండా సొంతంగా తయారు చేసుకుంది. ఇందుకోసం శాస్ర్తవేత్తలను రంగంలోకి దించింది. ఫార్మా సంస్థలకు సాయం అందించింది. వాటికి లక్ష్యాలను నిర్దేశించింది. టీకా పంపిణీలో ముందుగా దేశీయులకే ప్రాధాన్యం ఇచ్చింది. ఎగుమతుల అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ఈ చర్యల ఫలితంగా ఇజ్రాయెల్ లో కరోనా దాదాపుగా నియంత్రణలోకి వచ్చింది. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా తాత్కాలికంగా రాజకీయాలను పక్కన పెట్టాయి. ప్రజాశ్రయస్సే ధ్యేయంగా పనిచేశాయి. ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ, అధ్యక్షుడు రివ్లిన్ ఎప్పటికప్పుడు కరోనా నియంత్రణ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. వారి కష్టం, ప్రయత్నం, శ్రమ వథాగా పోలేదు. ఆ కష్టమే ఆ దేశాన్ని ప్రపంచంలో ఆదర్శంగా నిలిపింది.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News