ఉతికి ఆరేసినా .. ?
కోవిడ్ కల్లోలంలో తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఉతికి ఆరేస్తున్నాయి. ఒకే ఒక విషయంపై ప్రభుత్వాలు ఇంతగా ఇబ్బంది పడిన ఘట్టాలు గతంలో ఎన్నడూ లేవు. [more]
కోవిడ్ కల్లోలంలో తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఉతికి ఆరేస్తున్నాయి. ఒకే ఒక విషయంపై ప్రభుత్వాలు ఇంతగా ఇబ్బంది పడిన ఘట్టాలు గతంలో ఎన్నడూ లేవు. [more]
కోవిడ్ కల్లోలంలో తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఉతికి ఆరేస్తున్నాయి. ఒకే ఒక విషయంపై ప్రభుత్వాలు ఇంతగా ఇబ్బంది పడిన ఘట్టాలు గతంలో ఎన్నడూ లేవు. ఇదేదో ఆషామాషీ సంగతి అయితే ప్రభుత్వాలు దులిపేసుకుని ఉండేవి. కానీ ప్రజల ముందు పరువు పోతోంది. న్యాయస్థానాలు చేస్తున్న వ్యాఖ్యలు భవిష్యత్తులో ప్రజా న్యాయస్థానమైన ఎన్నికల్లో ప్రభావితం చూపుతాయేమోననేదే వాటి బెంగ. అదే ప్రభుత్వాలను ఉలికి పడేలా చేస్తోంది. అటు ఢిల్లీ నుంచి ఇటు తెలంగాణ వరకూ సుప్రీం కోర్టు నుంచి హైకోర్టుల వరకూ ఒకటే చీవాట్లు. ప్రభుత్వాల నిష్క్రియా పరత్వం ప్రజల ప్రాణాలు తీస్తున్నదని న్యాయస్థానాలు చెప్పకనే చెబుతున్నాయి. సకాలంలో సరైన రీతిలో ప్రభుత్వాలు స్పందించడం లేదు. కరోనా కట్టడి చర్యలూ అంతంతమా్త్రమేనని న్యాయస్థానాలు ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉండే కొద్దీ ప్రజల్లో మరింతగా పలచనై పోతున్నాయి. పైపెచ్చు కోర్టులు తీర్పులతో సంబంధం లేకుండానే విచారణలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు కలకలం స్రుష్టిస్తున్నాయి. అవే ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అఫిడవిట్లు, డెడ్ లైన్లు, ప్రత్యేక కమిటీలు ఎన్ని విధాలుగా వీలైతే అంతగానూ న్యాయస్థానాలు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ దున్నపోతు మీద వాన కురిసిన చందాన్నే తలపిస్తున్నాయి ప్రభుత్వాలు.
ఆదేశమా..?అభ్యర్థనా..?
ఆక్సిజన్ సరఫరా మొదలు కోవిడ్ వాక్సిన్ల ధరలు, సరఫరా తీరు వరకూ అన్నిటినీ సుప్రీం కోర్టు తప్పు పడుతోంది. కనీసం కామన్ సెన్స్ తో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించలేదని స్సష్టంగానే చెబుతోంది. దీనికి కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. తప్పును అంగీకరించి దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు. కానీ తాజాగా సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్ కేంద్ర ప్రభుత్వ అహంకార పూరిత వైఖరినే తేటతెల్లం చేసింది. కోవిడ్ విషయంలో శాస్త్రీయంగా తాము చర్యలు తీసుకుంటున్నామని న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఒకవేళ కోర్టులు జోక్యం చేసుకుంటే పర్యవసానాలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయంటూ అఫిడవిట్ లోనే కేంద్రం ప్రస్తావించింది. లేఖ రాసిన తీరు, అందులోని తీవ్రతను బట్టి చూస్తే మీరు జోక్యం చేసుకోకూడదని తెగేసి చెప్పేసింది. అంతేకాకుండా అంతర్లీనంగా మీకేం సంబంధమంటూ న్యాయస్థానానికే పరిధులు, పరిమితులు గీసినట్లు ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ అసహనానికి ఈ అఫిడవిట్ అద్దం పడుతోంది. న్యాయస్థానాల సమీక్షిల వల్లనే యంత్రాంగం కొంతమేరకు బాధ్యత తీసుకుంటోంది. లేకపోతే ఇప్పటికే అధిక సంఖ్యలో ప్రజలు దిక్కూమొక్కూలేకుండా పడిపోయేవారు.
తెగింపు ధోరణి…
రాష్ట్రాలు ఆ తాను ముక్కలే. న్యాయస్థానాలకు తప్పుడు లెక్కలు చూపించడం, ఇచ్చిన హామీలను అటక ఎక్కించడం చేస్తున్నాయి. అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి న్యాయస్థానాలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణ ప్రభుత్వం ఈవిషయంలో హైకోర్టు నుంచి తీవ్రమైన నిరసననే ఎదుర్కొంది. కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి లాక్ డౌన్ వంటి విషయాల్లో మతపరమైన పండుగలను ద్రుష్టిలో పెట్టుకుని వాయిదా వేస్తున్నారా? అంటూ న్యాయస్థానం ప్రశ్నించడం పతాకస్థాయి సన్నివేశంగా చెప్పాలి. అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురవుతాయి. కానీ ఉన్నత న్యాయస్థానమే ఎక్కుపెట్టిందంటే ఆలోచించాల్సిందే. ప్రభుత్వానికి అంతకంటే అవమానం మరొకటి ఉండదు. టెస్లుల సంఖ్యను పెంచడం ద్వారా రోగ తీవ్రతను కనిపెట్టవచ్చు. కానీ వాటిని కుదించడం వల్ల వ్యాధి ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలియని అయోమయ పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. అంతా బాగానే ఉందన్న భావన కల్పించేందుకు కేసీఆర్ సర్కారు వేసిన ఎత్తుగడ ఇది. న్యాయస్థానం తీవ్రంగా అభిశంసిస్తున్నప్పటికీ తన లెక్కలే తాను చూపిస్తోంది. మరోవైపు హైదరాబాద్ వంటి వైద్య మౌలిక వసతులున్న నగరంలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
జీవించే హక్కుకు రక్షణ…
నిజానికి ప్రజారోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ప్రాణాలను కాపాడటానికి ఎంతవరకైనా వెళ్లాలి. ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినా ఖర్చు పెట్టాలి. కర్నూలు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఆక్సిజన్ సరఫరా లేక చూస్తుండగానే ప్రాణాలు పోవడమంటే ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలి. అందుకే తప్పని సరి పరిస్థితుల్లోనే న్యాయస్థానాలు కలగచేసుకుంటున్నాయి. ఈ న్యాయ క్రియాశీలత్వాన్ని చూసి ప్రభుత్వాలు తట్టుకోలేకపోతున్నాయి. కోర్టులకు అధికారమే లేదన్నట్లుగా తమ వాదనలు వినిపిస్తున్నాయి. జీవించే హక్కు ప్రాథమిక హక్కు. దానికి పూచీకత్తు నివ్వడం న్యాయస్థానాల బాధ్యత. అందుకే నిర్లజ్జగా, బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వాలు వ్యవహరించినా న్యాయస్థానాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ వాటికి కొన్ని పరిమితులుంటాయి. ప్రభుత్వాలను ములుగర్రతో పోడవటమే తప్ప పని చేయించడం న్యాయస్థానాలకు కూడా సాధ్యం కావడం లేదు. ఇప్పుడు న్యాయ స్థానాల జోక్యం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వాలు సాకులు వెదుకుతున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్