Munugode: కారెక్కిన కమ్యూనిస్టులు.. కోమటిరెడ్డికి చెక్ పెడతారా.?

Update: 2022-09-02 07:56 GMT

మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాదే ఉండడంతో మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సెమీఫైనల్‌గా మారింది. ఇక్కడ గెలిచి తాము బలంగా ఉన్నామని నిరూపించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పుకునేందుకు ఎలాగైనా ఈ ఎన్నికలో గెలిచి తీరాల్సిందేనన్న కసితో పనిచేస్తున్నాయి. అటు అధికార టీఆర్ఎస్.. తమ సీటును ఎలాగైనా కాపాడుకోవాలని కాంగ్రెస్.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాగా వేసి తీరాల్సిందేనని బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒక్క ఓటు కూడా వదలకూడదన్నంత కసిగా కదనరంగంలో కలిసివచ్చే మిత్రులను సాదరంగా ఆహ్వానిస్తున్నాయి.

అంగబలం.. అర్థబలం మెండుగా ఉన్న కోమటిరెడ్డిని ఓడించేందుకు గులాబీ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కమ్యూనిస్టులను కనీసం పట్టించుకోని కేసీఆర్.. ఈ ఎన్నికతో వామపక్షాలతో దోస్తీ కట్టడం విశేషం. ఎర్రజెండా పార్టీలు రెండూ టీఆర్ఎస్‌కి మద్దతునివ్వడం అంత సామాన్యమైన వ్యవహారమేమీ కాదు. స్థానికంగా బలంగా ఉన్న కమ్యూనిస్టుల ఓటుబ్యాంకును గంపగుత్తగా బ్యాలెట్ బాక్సులో వేయించుకునేందుకు గులాబీ బాస్ భారీ వ్యూహమే రచించారు. మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు గెలుపొందితే.. కమ్యూనిస్టు పార్టీ ఐదుసార్లు విజయం సాధించిన ట్రాక్ రికార్డ్ ఉంది. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు కనీసం 25 వేల ఓటు బ్యాంకు ఉంటుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.

ఇప్పటి వరకూ కేవలం ఒకే ఒక్కసారి గెలిచిన టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా నెగ్గి ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 12 సార్లు ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దివంగత నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఇక్కడి నుంచి ఐదుసార్లు గెలుపొందారు. కమ్యూనిస్టు పార్టీ ఐదు సార్లు విజయం అందుకుంది. 2014 ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 2018 ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం చెందారు. సుమారు 30 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న మునుగోడులో కమలం పార్టీ కూడా భారీగా ఓట్లు సాధించడం విశేషం. గత ఎన్నికల నాటికి తెలంగాణలో అంత బలంగా లేని కమలం పార్టీ మునుగోడులో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓట్లు సాధించింది. 2014, 2018 వరుస ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచింది. 2014లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డి 27 వేలకు పైగా ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో మునుగోడు నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఆ పార్టీకి మరింత బలం చేకూర్చినట్టే. కోమటిరెడ్డి అంగబలం.. అర్థ బలంతో ఉప ఎన్నికలో విజయం సాధించొచ్చని కాషాయదళం భావిస్తోంది. మొత్తమ్మీద కాషాయం.. కాంగ్రెస్.. కారు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో బిజీగా ఉన్నాయి కానీ.. అసలు మునుగోడు ఓటరేమనుకుంటున్నాడో తెలియాలంటే మాత్రం ఎన్నికలయ్యే వరకూ వేచిచూడాల్సిందే.!

Tags:    

Similar News